పరిమళించు పున్నమిలో ...ప్రణయ వీణ పలికింది....’’రేడియోలో వస్తున్న పాట చెవిన సోకగానే సవ్యసాచి మనసు తననొదిలి పోతున్నట్టనిపించింది.ఆహా! ఈ టైంలో వాసంతి వుంటే ఎంత బావుండు..., కళ్ళు మూసుకున్నాడు. మబ్బులు కమ్మిన ఆకాశం.. పూవుల మీదినుంచి వీస్తున్న అల్లరి చల్లగాలి...ఆనందాన్ని ప్రకృతితో పంచుకుందామని కిటికీ దగ్గరికెళ్ళాడు.ఆరు నెలలవుతోంది ఈ ఊరికొచ్చి - పెళ్ళయి కూడా!రావడంతోనే ‘‘ఒక కోరిక’’ అంది వాసంతి.‘‘మనకు టీ.వి. వద్దు... రేడియో.. ఓ టేప్‌ రికార్డర్‌, బీరువా నిండా పుస్తకాలూ, సైగల్‌.. ముఖేష్‌ పాటలు...’’ అంది గుండెల మీద వాలిపోతూ.‘‘ఇంకా...’’ అన్నాడు కొనసాగింపుగా.ముక్కుతో ఆయన గొంతు కింది నుండి పొట్టవరకు నిలువునా గీతలు గీస్తున్నదల్లా ఆగింది.ఈ కోరికలకు ముందు కూడా ‘‘ఒక కోరిక’’ అంది.‘‘నాకు పట్టణాలంటే ఇష్టముండదు. పుట్టి పెరిగింది అక్కడే కదా! తమరి పోస్టింగ్‌ ప్లేస్‌లోనే మన కాపురం...’’భావుకత్వం నిండా వున్న అమ్మాయి కావాలని కోరుకుని చేసుకున్నవాడే కదా! మరి ఇలాంటి కోరికలే వారికుండేది.‘ఇంకా’ అని అడిగాడు కదా!‘‘నెలలో కనీసం రెండు రోజులైనా ఒకరికొకరు దూరంగా వుండాలి. 

దూరంగా అంటే కనబడకుండా వేరే ఊళ్ళల్లో అన్నట్టు...’’‘దూరంగా వుండడమెందుకో’ అదే అడిగాడు.‘‘... విరహం వల్ల ధ్యానం... ధ్యానం వల్ల ఇష్టం.. ఇష్టం వల్ల సంతుష్టం...’’ అని చెబుతూ తన పెదాలను ఆయన పెదాల మీద అద్దింది. ఆ ప్రపోజల్‌ సవ్యసాచికి ఇష్టమనిపించకపోయినా ప్రస్తుత సన్నివేశం మౌనంగా వుండమంది.ఇంటినుండి బయటికి వెళ్ళబుద్ధేయదు ఆమె ఇంట్లో వుంటే! ఏరికోరి వినే పాటలు... ఆ పాటలకి అపుడపుడు నడుమూపుతూ ఊపుతూ వచ్చి తాకి ఆయన గుండెను కూడా ఊపేది.అది ఏ రాత్రయినా కానీ నెలవంక నుండి నిండు పున్నమి వరకు వీరి ఇంటిచుట్టే తిరుగుతూ వుంటాయి.ఆ వయ్యారాలు.. సయ్యాటలు, సపర్యలు, సల్లాపాలు...ఆగి ఆగి చూసే గాలి... పో పొమ్మని నవ్వే జాజి తీగ.ఆ ఇల్లు ఒక ఆనందానంద సుందర బృందావనం.తదేకంగా కిటికీలోంచి చూస్తున్న సవ్యసాచి ఒక్కసారిగా గుమ్మంవైపు చూశాడు. కళ్ళు అప్రయత్నంగా పెద్దవయాయి.లంగా ఓణీతో పూబోణిలాంటి అమ్మాయి!‘‘అక్కయ్య ఇంట్లో లేదా బావా?’’ శ్రావ్యమైన గొంతుకు ప్రతి పలుకూ సంగీతమే!‘‘లే... లేదు. ఊరెళ్ళింది’’ తడబడకూడదనుకున్నా తప్పింది కాదు.‘‘అందుకేనా ఈ నిరీక్షణా వీక్షణ క్షణాలు..’’ కిసుక్కున నవ్వింది.ఆ నవ్వులో గుండెను కోసే మెత్తని పూలు రాల్తాయి. కుడి బుగ్గ మీది సొట్ట ఎవరి కళ్లనైనా అతికించుకుంటుంది.‘‘నేను గంటక్రితమే వచ్చాను’’ అడక్కున్నా చెబుతోందంటే అర్ధం...?పరమార్ధమే!ఈయనగారు డబ్బులకంటే మాటలనే ఎక్కువ పొదుపు చేసేలా వున్నాడనుకుందేమో... అంతవరకూ ఎడం భుజం మీదుగా ముందుకున్న జడను సుతారంగా వెనక్కి తోస్తూ వెనుదిరిగింది.