‘‘అమ్మా వసుధా, నేను బయలుదేరుతానమ్మా’’ ఆటో ఎక్కుతూ కూతురితో చెప్పింది జానకమ్మ. ఆమె వసుధ దగ్గరికి వచ్చి రెండు నెలలయింది.‘‘అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అన్నను, వదినను, పిల్లలను అడిగానని చెప్పు. వెళతానే నాకు ఫోన్‌ చెయ్యి’’ చేతిలో పనితోనే తల్లికి జవాబు చెప్పింది వసుధ.‘‘అమ్మా వసుధా, ఫోను కింద ఉత్తరం ఉంది. తీరిక దొరికినపుడు చదువుకో.వెళ్ళొస్తాను’’ అంది జానకమ్మ.‘‘అలాగే, నువ్వు జాగ్రత్త’’ చెబుతూ వర్ష స్కూలు బస్సు రావడంతో లంచ్‌ బేగు,పుస్తకాల సంచితో ఇంటి ముందుకు వచ్చింది వసుధ.వసుధ కూతురిని బస్సు ఎక్కించి, మురళికి కూడా ఆటో రావడంతో వాడిని కూడా స్కూలుకు పంపించి, తన లంచ్‌ బ్యాగు, పుస్తకాలు, ప్రోగ్రెసు కార్డులు వున్న సంచినీ బండికి తగిలించి, ఇంటికి తాళం వేసి, ఒకటి రెండుసార్లు లాగి చూచి స్కూటర్‌ స్టార్టు చేసింది. అక్కడికి వసుధ పని చేసే స్కూలు మూడు కిలోమీటర్లు ఉంటుంది.చేతి వాచిలో టైమ్‌ చూసుకుంది. ఎనిమిదిన్నర కావస్తూ ఉంది. ‘పరవాలేదు. వేళ మించకుండా బడికి చేరుకోవచ్చు’ అనుకుంటూ స్కూటర్‌లో బయలుదేరింది. అలా ఒక కిలోమీటరు దూరం వెళ్లిందో లేదో స్కూటర్‌ ఆగిపోయింది. అందులో పెట్రోలు అయిపోయింది. ఏం చేయడానికి తోచక చుట్టుపక్కలా చూసింది వసుధ. 

ఎక్కడా పెట్రోలు బంకు కనిపించలేదు. ఒక కిలోమీటరు వెళితే గానీ పెట్రోలు బంకు రాదు. ఏం చేయాలో అర్థం కాక అయిదు నిముషాలు అలాగే ఉండిపోయింది. ‘‘సుధా, బండి రిజర్వులో ఉంది. పెట్రోలు అయిపోతే, డిక్కిలో బాటిల్లో పోసి ఉంచాను. పోసుకో’’ అని ఆ రోజు తెల్లవారి తనతో భర్త అన్నమాటలు వసుధకు తటాలున గుర్తుకు వచ్చాయి.బ్రతుకు జీవుడా అనుకుని, పెట్రోలు పోసుకుని తొందర తొందరగా బడికి బయలుదేరింది. బడిలో అడుగు పెట్టేప్పటికి సమయం తొమ్మిది పదినిముషాలు. ఆదరాబాదరా టీచర్సు రూముకు వెళ్ళి సంతకం చేసి క్లాసుకు వచ్చింది. ఆ రోజు పదవతరగతికి సోషియల్‌ స్టడీసు చెప్పాలి. తాను చదువుకున్నది అడ్వాన్సు తెలుగు బి.ఏ. చెప్పవలసింది ఇంగ్లీషులో. రాత్రంతా కూర్చుని చదివి తయారయిన విషయాన్ని చెప్పడానికి ప్రారంభించింది. ఇంతలో ఫ్యూను రంగయ్య వచ్చి ‘‘అమ్మా, మిమ్మల్ని పెద్దమేడం గారు పిలుస్తున్నారు’’ అన్నాడు.ఆమే హెడ్‌మిస్ట్రెస్‌. రంగయ్యతోపాటు ఆమె రూముకు వెళ్లింది వసుధ.వసుధను చూడగానే ‘‘ఏమ్మా వసుధా.. నైన్తు క్లాసు వాళ్లకు ఇంకా మంత్లి టెస్టు పెట్టలేదు. సెవన్తు వాళ్లకు ప్రోగ్రెసు కార్డులు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళకెందుకమ్మా వుద్యోగాలు. ఎప్పుడూ భర్త, ఇల్లు, పిల్లలు ఇదే మీ ధ్యాసంతా. ఇంక స్కూలు పనులెలా జరుగుతాయి చెప్పండి. ఏమన్నా అంటే హెడ్‌మిస్ర్టెస్‌ రాకాసి, అరుస్తుంది అని నాకు పేరు. అడిగిన దానికి జవాబు చెప్పాలని కూడా మీకు తోచదు’’ అంది.