‘‘నాకు ప్రమోషనిచ్చి ముంబైకి పంపుతామంటున్నారు’’.‘‘నిజంగా నాండి! ఎప్పుడు?’’ ఎగిరి గంతేసినంత పని చేసింది వసంత.‘‘నేను సరేనంటే వారం పది రోజుల్లోనే’’.‘‘అంటే! వెంటనే ఒప్పుకోలేదా మీరు?’’‘‘లేదు. రెండు మూడు రోజుల్లో చెపుతానన్నాను’’.‘‘జీతం ఎంత పెరుగుతుందేమిటి?’’‘‘రెండు వేలకి పైనే వుండొచ్చు’’‘‘మీకేమయినా పిచ్చా? వెంటనే సరేననక రెండు మూడు రోజుల టైమెందుకు? అంతలో వాళ్ళ మనసు మారి మరెవరికైనా ఇచ్చేస్తే? ఖర్మ చాలాక ఇంకెవరయినా తన్నుకు పోతే? రేపు తొందరగా ఆఫీసుకెళ్ళి ప్రమోషన్ని ఒప్పేసుకోండి. ఉండండి, కాఫీ తెస్తాను’’ అంటూ వంటింట్లోకి నడిచింది వసంత.పది నిముషాల్లో ఘుమఘుమలాడే ఫిల్టర్‌ కాఫీతో ప్రత్యక్షమైంది.‘‘ఏమిటాలోచిస్తున్నారు?’’‘‘అదే... నాయన గురించి’’వసంత ముఖంలో రంగులు మారాయి.‘‘ఆయన్ని కూడా తీసుకువెడదాం. ఏమైంది?’’‘‘నాయన కదలలేని స్థితిలో వున్నాడని తెలిసి కూడా అంటున్నావా వసంతా ఈ మాట?’’‘‘అయితే ఏమిటి మీ వుద్దేశం? ఆయన కోసమని వచ్చిన ప్రమోషన్‌ వొదులుకుంటారా? ఈ బొటాబొటీ సంపాదనలోనే మగ్గిపోవాలను కుంటున్నారు?’’ ఆ మాటల్లో కరకుదనం. నా మీద నింద.మౌనంగా కాఫీ చప్పరిస్తున్నాను.

‘‘ఒక పని చేద్దామండి. ఏదయినా ఓల్డేజి హోములో చేర్పించుదాం మామగార్ని’’.‘‘కాలూ చెయ్య పడిపోయి మాట కూడా రాని మనిషిని ఏ హోములోనూ చేర్చుకోరు వసంతా. ఒకవేళ చేర్చుకున్నా వాళ్ళు డిమాండ్‌ చేసే డబ్బు మనం యిచ్చుకోలేం. మనకి సాధ్యం కాని పని అది’’.‘‘పోనీ మీకు అక్కడ క్వార్టర్సు ఇవ్వరా?’’‘‘వెంటనే దొరకదు. ఆర్నెల్లో సంవత్సరమో పట్టొచ్చు. ఒకవేళ దొరికినా భార్యా, భర్త, పిల్లలు తప్ప వేరే వాళ్ళుండడానికి కంపెనీ రూల్సు ఒప్పుకోవు.పోనీ ఎలాగో ఆయన్ని మనతో తీసికెళ్ళినా ఆ మహానగరంలో ఒక చిన్న గది దొరకడమే గగనం. నువ్వు, నేను, మంచం పట్టిన నాయన ఎట్లా వుండగలం చెప్పు?’’ అని ఖాళీ కప్పుని ఆమె చేతికిచ్చాను.

అందుకుని విసురుగా వంటింటికేసి నడిచింది. ఎంత సేపయినా బయటికి రాలేదు. చీకటి పడింది. వరండాలో లైటువేసి వచ్చి గదిలో కూర్చున్నాను. పేపరు చేతికి తీసుకున్నానే గాని చదవలేక పోయాను. పక్కన పడేసి టి.వి. ఆన్‌ చేసాను. ఏదో చెత్త ప్రోగ్రాము. ఆఫ్‌చేసి సిగరెట్‌ వెలిగించి మంచం మీద దిండు కానుకుని కూర్చున్నాను. కిటికీలోంచి పొగ రింగులు రింగులుగా బయటికి పోతున్నది. నా ఆలోచనలు వెనక్కి, వెనక్కి మళ్ళుతున్నాయి.