రాత్రి పదకొండు గంటలు దాటింది. గంటనుంచీ కురిసిన వాన అప్పుడే తగ్గినా ఆకాశాన్ని పట్టిన మబ్బులు వీడలేదు. మెరుపులు గాని, ఉరుములు కాని తగ్గ లేదు. చల్లటిగాలి వీస్తోంది.తలుపుకొట్టిన చప్పుడయితే సుభద్రమ్మ మంచం మీదనుంచి లేచింది.అది ఊరి బయట కాలనీ. ఆ కాలనీలో ఇళ్ళకంటే ఖాళీ స్థలాలే ఎక్కువగా ఉన్నాయి. రోడ్లుకూడా సరిగ్గా వేయలేదు.మొదటిసారిగా తవ్వి మట్టిపోసి దానిమీద కంకర వేశారు. అది అణిగిం తరువాత తారురోడ్డు వేయాలనేది ఆలోచన. అక్కడకు మెయిన్‌రోడ్డు ఫర్లాంగు దూరంలో ఉన్నది.పది గంటలకు పోయిన కరెంటు పావు గంట క్రితం రావటంతో, అప్పటిదాకా గాలికోసం తలుపులు తెరుచుకొని దోమల్ని భరిస్తున్న వాళ్ళు, ఫ్యాన్లు వేసుకొని తలుపులు మూసి పడుకున్నారు.ఇంత అర్ధరాత్రప్పుడు తలుపు ఎవరి కొట్టిందీ అర్థం కాలేదు. ఏ దొంగ వెధవో రాలేదు కదా అని తటపటాయించింది ఆమె. అరవయ్యేళ్ళ వయస్సు ఇచ్చిన అనుభవంతో వెంటనే తలుపు తీయకుండా, కిటికీ తలుపు తీసింది కాని, వచ్చిన వాళ్ళు తలుపుకు దగ్గరగా నిలుచోవటంతో కనబడలేదు. అందునా కటిక చీకటి.కొడుకు శేఖరం, కోడలు సునీత తలుపులు వేసుకు పడుకున్నారు. మనవరాలు - పది నెలలది ఇప్పటిదాకా ఏడుస్తున్నదల్లా, ఫ్యాను గాలికి హాయిగా పడుకున్నది.మరోసారి శబ్దమయింది.‘‘ఎవరు?’’ అన్నది కాస్త కంఠం హెచ్చించి సుభద్రమ్మ.అటునుంచి మాట వినబడలేదు.

ఇంకా నిద్రపట్టని కొడుకు మంచం మీద నుంచి లేచి గది తలుపు తీసుకు బయటకు వచ్చాడు తల్లి కంఠం వింటూనే.కొడుకు వెనగ్గా కోడలు బయటకు వచ్చింది.‘‘ఎవరో తలుపు కొడుతున్నారురా... ఎవరంటే మాట్లాడటం లేదు!’’కొడుకు తలెత్తి ఒకసారి గడియారం వంక, ఇంత రాత్రప్పుడు తన కొంపకు వచ్చేది ఎవరా అన్నట్లుగా, చికాగ్గా చూచాడు.ఆరు నెలలయింది ఆ ఇల్లు కట్టి. పొరుగూళ్ళలో వున్న చాలామంది బంధువులకు తన ఇల్లు తెలియను కూడా తెలియదుఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరయినా పగటి పూట వస్తారుగాని ఈ వాతావరణంలో, బస్సులు కూడా సరిగ్గా లేని తన ఇంటికీ, మరీ అవసరం పడితే తప్పరారు.పలకరింపులూ, చిన్నచిన్న పనులూ సెల్‌ ఫోన్‌ మీదే జరిగిపోతుంటాయి.ఇంట్లో వున్న వాళ్ళకు వీలుగా ఉంటుందని ల్యాండ్‌ ఫోనుకోసం వారం రోజుల క్రితమే డబ్బు కట్టాడు. అదీ రెండు మూడు రోజుల్లో రావచ్చు.లేచి, ముందు హాల్లోనూ, బయటా లైటు వేశాడు. తరువాత తలుపు తెరిచాడు.ఎదురుగ్గా ఓ స్త్రీ, చంకన చిన్నపిల్ల...ఆమె తన ముఖాన్ని ఆ ఇంటిలో ఎవ్వరికీ చూపించటం ఇష్టం లేదన్నట్లుగా తలవంచుకు నిలబడి వున్నది. ఆమె సన్నగా, బలహీనంగా వున్నది. ఆమె శరీరమంతా దిగుళ్ల గూళ్ళతో నిండిపోయిందన్నట్లుగా కుంచించుకుపోయి వున్నది. ఆమె ఏదో కీకారణ్యంలో చిక్కుకున్నదన్నట్లుగా ఒత్తయిన జుట్టంతా ముఖాన్ని సరిగ్గా కనబడనీయకుండా చిందరవందరగా కప్పివేసి ఉన్నది. ఆ జుట్టు వెనగ్గా కళ్ళు ఉన్నాయా లేవా అన్నట్లుగా ఎక్కడో లోపలకు పోయి కొడి గట్టిన దీపాల్లా మిణుకుమంటున్నాయి. ఆమె శరీరమంతా కంపిస్తున్నదని స్పష్టంగా ఆ దీపపు వెలుగులో కనబడుతున్నది.