‘‘మీతో ఈ మాట చెప్పడానికిబాధగా ఉంది. కానీ, చెప్పక తప్పదు’’ అంటూ చిదానందమూర్తి ఓ సోఫాలోకూచున్నారు.వచ్చింది చిదానందం, అంటున్నదిచిదానందం కాబట్టి, కొంచెం అర్థం అయింది శారదకి, వెంకటేశ్వరావుకి.‘‘మీ సంబంధం వొద్దన్నారు...’’పూర్తిగా అర్థం అయింది ఆదంపతులకి. చిదానందాన్ని చూడడం మినహా మరేం చెయ్యలేకపోయారు.‘‘వాళ్ళు చెప్పిన కారణాలు విన్నాక, వాళ్ళకోణం లోంచి చూస్తూంటే,సబబుగానే అనిపించింది...’’ ఓసారి వాళ్ళిద్దరి వైపు చూసి, ఆపి, మళ్ళా అందుకున్నారు.‘‘ప్రపంచ మార్కెట్‌లో షేర్లు, మరోటీ మరోటీ విలువలు పడిపోయినట్టే ఈ పెళ్ళికొడుకుల విలువ కూడా పడిపోయింది. ఈ పింక్‌ స్లిప్‌లు, జీతాల్లో కోతలు ఏ క్షణాన ఊడిపోతాయోతెలియని ఉద్యోగాలు, దిన దిన గండం- నూరేళ్ళాయుష్షులాగా ఉద్యోగాలుంటే... సంసారం ఎలా గడుస్తుంది...’’ ఆగి, వాళ్ళ మొహాలు చూసి,‘‘అలా అని నేనడం లేదు....వాళ్ళన్నారు...’’నిశ్చేష్ఠులయ్యారు.‘‘అక్కడికీ... మధ్యవర్తిగా నా ప్రయత్నం నేను చేసాను. ఆ పిల్ల ససేమిరా వొద్దంది’’‘‘ఈ విషయాన్ని మా పిల్లాడెలా తీసుకుంటాడో! ఎలా తట్టుకుంటాడో తల్చుకుంటేనే బాధగా ఉంది. అసలే... మనసు బాగాలేదు. పులి మీద పుట్రలా ఇదోటి. ఊహించడానికే భయంగా ఉంది’’ అంది శారద గద్గద స్వరంతో.చిదానందం సానుభూతితో వాళ్ళని చూసాడు. మెల్లిగా తల ఊపాడు.‘‘నాకు తెలుసమ్మా.... నేనర్థం చేసుకోగలను. ఏం చేయను? నిమిత్తమాత్రుణ్ణి, తట్టుకోవడం కష్టం. ఓ అమ్మాయి అబ్బాయిని తిరస్కరించిందంటే.... ఇమోషనల్‌గా చాలా ఫీలవుతారు. 

అక్కడెక్కడో అమెరికాలో ఓ లీమాన్‌ బ్రదర్స్‌ పేక ముక్కల్లా కూలిపోవడం ఏంటీ, దాని ప్రభావం ప్రతీ దానిమీద పడటం ఏంటీ, విడ్డూరం కాదా! పోతనగారన్నట్లు, ఒక సూర్యుడు సమస్త జీవులకు దానొక్కొక్కొడై దోచు... లాగా.... ఓ లీమాన్‌ సమస్త రంగాల్నీ, అన్నీ దేశాలనీ కుదిపేసింది. మార్కెట్‌ కూలిపోయింది. ఆఖరికి పెళ్ళిళ్ళ మార్కెట్‌...’’‘‘ఇందులో మావాడి తప్పేం ఉంది? ఈ సంక్షోభం వాడు చెయ్యలేదు కదా!’’‘‘ఇలాగే, కొంచెం అటూ ఇటూ మాటల తేడాతో అన్నాను. కానీ అమ్మాయి, ఆ పిల్ల తల్లీ వినడం లేదు. ఐ.టీ. వద్దు, ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ వాళ్ళు వద్దు. వేరే గవర్నమెంటాఫీసరు, డాక్టరు సంబంధాలు చూడమని అన్నారు. అంతా అమెరికా మహత్యం... అనుకోండి. ఎక్కడ వెతకాలీ? ఎంత మందిని వెదకాలీ? ఎవర్నీ అనడానికి ఏం లేదు... మనుషులు మెటీరిలియస్టిక్‌గా తయారయ్యారు...’’చిదానందం మాటలెప్పుడాపారో, ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా ఆ దంపతులు గమనించలేదు. అలాగే కూచుండిపోయారు. లేవలేదు. జరిగిన దాని గురించి మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. రాబోయే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, దానిక్కావలసిన ధైర్యాన్ని వెతుక్కోడంలో ఉన్నారు.రాత్రి పది గంటలకి వచ్చిన వినయ్‌కి, ఎలా చెప్పాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు శారదా, వెంకటేశ్వర్రావులు.