జీవితమన్నా అర్థమవుతుందేమో కానీ, మరణం మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. పులిలా జీవించిన రామస్వామి చివరికిలా చనిపోతాడని అనుకోలేదు. దీనికి నేనే కారణమేమో! అతన్ని నేనే చంపేశానా?రామస్వామిని మొదటిసారిగా శేషాచలం కొండల్లో చూశాను. వయసు అరవైకి పైనే. పెద్ద మీసాలు, వేటగాడి కళ్ళు, కొనదేలిన ముక్కు. ఎండ, గాలి, చలి అన్నింటినీ ఇముడ్చుకున్న దృఢమైన శరీరం. నలుపు గోధుమ రంగు మిశ్రమంతో మొహం. మాట్లాడుతున్నపుడు అనుభవాల్ని సూచించే ముడతలు. చెవులకు కమ్మలు. ఒరిజినల్‌గా ఏ రంగో గుర్తించలేని చొక్కా, నీలం రంగు నిక్కర్‌, కాళ్ళకు ముతక చెప్పులు, మెడలో పూసల దండలు. తెల్లటి జుట్టుని వెనక్కి దువ్వి కట్టుకున్న కొప్పు. నక్కలోళ్ళ జాతికి చెందిన ముసలాడు. మా ట్రెక్కింగ్‌ బ్యాచ్‌కి గైడ్‌. సాయంగా మరో నలుగురు కుర్రాళ్ళు. మాతో తెలుగులో, వాళ్ళలో వాళ్ళు నక్కలోళ్ళ భాషలోనూ మాట్లాడుతున్నారు. ఒక్క పదం కూడా అర్థం చేసుకోలేని భాష అది.తిరుమల వెనుక భాగం కొండల్లో నడుస్తున్నాం. రామస్వామి ముందు న్నాడు. చేతిలో చెక్క తుపాకీ ఉంది. మొలలో కత్తి మెరుస్తూ ఉంది.‘‘ఒకప్పుడు ఈ తిరుమల అడవంతా మాదే. గుడికి కూడా మేమే కాపలాదారులం. సాములెవరూ ఇక్కడుండేవాళ్ళు కాదు.

 పులులొచ్చినా, నక్కలొచ్చినా మా నక్కలోళ్ళే తరిమేసేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్నే ఇక్కణ్ణించి తరిమేశారు అమెరికాలో రెడ్‌ ఇండియన్లని తరిమేసినట్టు’’ దారికి అడ్డంగా ఉన్న కొమ్మని నరుకుతూ అన్నాడు రామస్వామి.‘‘నీకు అమెరికా గురించి కూడా తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘నక్కలోళ్ళంటే చదువురాని వాళ్ళనుకున్నారా ఏం... మాకూ ప్రపంచం తెలుసు’’.గాల్లో ఏదో పక్షి తపతపమంటూ ఎగురుతూ ఉంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. మేం మొత్తం పదిమందిమి. ఇక్కడ కూడా కొంతమంది షేర్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌ల గురించి మాట్లాడుకుంటున్నారు.రెండు మూడు చినుకులు రాలాయి. నీటి వాసన కమ్మగా తగిలింది. కీ అని అరుచుకుంటూ నాలుగైదు పక్షులు గాల్లో తిరుగుతున్నాయి.‘‘అవేం పక్షు లు?’’ అని అడిగాను.‘‘కూరొండుకుని తినే పక్షులు’’ అని తుపాకీ తీశాడు.వద్దు అని వారించబోయాను. నా మాటలు వినిపించుకోలేదు. పక్షికి గురిపెట్టాడు. తన సర్వశక్తుల్ని కంటి చూపులోకి తెచ్చుకున్నట్టు పక్షిని చూస్తూ ట్రిగ్గర్‌ నొక్కాడు. ఢాం అని శబ్దం అడ వంతా ప్రతిధ్వనించింది. గాల్లోకి ఎగరడానికి ప్రయత్నిస్తు న్న పక్షి ఒక మాం సపుముద్దలా జారి తప్‌మని పడింది. రెక్కల్లోంచి బొట్లుబొట్లుగా రక్తం.ఆ పక్షిని భుజానికున్న సంచిలో వేసుకున్నాడు రామస్వామి.‘‘పాపం కదా, దారినపోయే పక్షి నీకేం అన్యాయం చేసింది’’ అన్నాను.నావైపు విచిత్రంగా చూసి నవ్వాడు. నాకర్థం కాలేదు కానీ ఆ నవ్వులో చాలా అర్థాలున్నాయి.