ఆ పట్నం పేరెందుకు కానీ, దానికి ఓ పాతిక మైళ్ళ దూరంలో కృష్ణానది ఒడ్డున పెట్టిన ఒక సిమెంటు ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఫ్యాక్టరీ టౌన్‌షిప్‌లో నా క్వార్టర్‌ పక్కనే సుబ్బారావు, సుమిత్రలు కాపురం చేస్తున్నారు. వాళ్ళ పెళ్ళి అయి ఇంకా నిండా ఏడాది కాలేదు.ఒకనాడు పొద్దున్నే సుబ్బారావు పరుగెట్టుకొచ్చి ‘‘కొంప మునిగింది బాబాయి’’ అంటూ ఆయాసం తీర్చుకునే ప్రయత్నంలో పడ్డాడు. నేను బైనాక్యులర్స్‌తో కృష్ణానదికేసి చూస్తే మామూలుగా చిక్కిపోయే కనిపించింది, మరి వీడి కొంపెట్లా మునిగిందబ్బా నా కొంపకేం కాకుండా అని ఆలోచనలో పడ్డాను.‘‘బాబాయి - మీ అమ్మాయి - సరేసరే - నీది మట్టిబుర్ర కదా - విడమర్చి చెబుతాను. నా భార్య సుమిత్ర ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. ప్రొద్దుటినుంచి పిచ్చిచూపులు - అర్థంకాని కలవరింతలు. 

విషం ఏమైనా తెలిసో తెలియకో పుచ్చుకుందంటావా బాబాయి?’’ ఆదుర్దాగా అడిగాడు.‘‘మీ మామ చెంగల్రావు నీకివ్వవలసిన కట్నం లాంఛనాలు ముట్టచెప్పాడన్నావుగా’’ అనుమానంగా అడిగాను.‘‘ఛాఛా... అలాంటిదేమీ కాదు బాబాయి. సుమిత్రను నేను ఎంత అల్లారుముద్దుగా - అనకూడదేమో ప్రేమగా చూసుకుంటానో నీకు తెలుసుగా. ఈ అడవిలో ఆవిడకు పొద్దుపోదు కాబట్టి రెండు వారపత్రికలకు చందా కట్టాను. మాంచి జపాన్‌ సంతతికి చెందిన టి.వి. కొనిపెట్టాను. కొత్త సినిమాల పేర్లు, హింతె నటీమణుల పేర్లు ఆవిడకు కొట్టిన పిండి అనుకో.’’‘‘ఈ హింతె నటీమణులెవర్రా?’’‘‘అందుకే నీది మట్టిబుర్ర బాబాయి. తెలుగులో నటీమణులు లేరుగా! అంచేత హిందీ నుంచి దిగుమతయి తెలుగులో నటిస్తారన్నమాట. నటిస్తారే తప్ప మాట్లాడరు. వాళ్ళకు హింతె నటీమణులని నేను పేరుపెట్టుకొన్నాను - ముద్దుగా షార్టుగా ఉంటుందని. బాగుందా!’’‘‘ఏడిశావు గానీ ముందు సుమిత్ర సంగతి చూడు’’ అంటూ వాడి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాను. సుమిత్ర కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి.

ఉండీ ఉండీ ఏదో గొణుగుతోంది కాని మాట స్పష్టత లేదు. పెద్దరికం ఆపాదించుకొని సుమిత్ర దగ్గరగా వెళ్ళి ‘‘అమ్మాయ్‌, ఏమైందమ్మా. నేను పక్కింటి అంకుల్‌గార్ని. నీ బాధ నాకు చెప, చిటికెలో తీరుస్తాను’’. ఎందుకు మెరిశాయో నా కళ్ళముందు దీపావళి టపాకాయల మెరుపులు మెరిశాయి. సుమిత్ర నన్ను లాగి చెంపమీద కొట్టిందన్న సంగతి పది నిముషాల తరువాత సుబ్రావ్‌ చెబితే తెలిసింది. నాకు కాలేజీలో ముగ్గురమ్మాయిలు వేరువేరు సంఘటనల్లో చెంపవాయించిన అనుభవం ఉంది. పెళ్ళయిన తరువాత నేను చేయని తపకు చెంపదెబ్బ తిన్న మొదటి అనుభవం ఇది. పాపం సుమిత్ర కావాలని కొట్టిందా - పిచ్చిలో అలా చేసిందని సరిపెట్టుకున్నాను.