సాయంకాలం. ఎంతో ప్రశాంతంగా, పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఆహ్లాదంగా వున్నా... నా మనసులో మాత్రం ఉదయం జరిగిన సంఘటన తాలూకు దృశ్యాలే మళ్ళీమళ్ళీ కనిపిస్తున్నాయి. అందువల్లే పరిసరాలను పరిశీలించి ఆస్వాదించే స్థితిలో లేను. ‘రివటలా ఉన్నవ్యక్తి ... ఎటువంటి ధన, కుల బలం లేనివాడు, అర్భకుడు... నూతిలోంచి వచ్చినట్లున్న మాటలు! అయితేనేం ... ఎంత సూటిగా, స్పష్టంగా ఉన్నాయవి!’ ఒక్కసారి గతమంతా జ్ఞప్తికొచ్చింది.్‌్‌్‌ఆరోజు బడికి వెళ్ళగానే హడావుడి కనిపించింది. నలుగురైదుగురు కూలీలు ఫెన్సింగ్‌కు వేసిన సిమెంట్ స్తంభాలను పెళ్ళగిస్తున్నారు. రామిరెడ్డి, హెడ్‌మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. వారం క్రిందట విజిట్‌కు వచ్చిన యంఇవో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘ఆదర్శ గ్రామం పథకం కింద మీ పాఠశాలకు అదనంగా రెండు తరగతి గదులొచ్చాయి. జాగ్రత్తగా దగ్గరుండి పూర్తిచేయించి, స్కూల్‌ను బాగా తయారుచేయండి’.మాది ప్రాథమికోన్నత పాఠశాల. గత సంవత్సరమే అప్‌గ్రేడ్ అయింది. సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా ఇప్పటికే ఒక అదనపు గది మంజూరై పూర్తయింది. అదనంగా ఇపడు రెండు! చాలా సంతోషమేసింది. ఇప్పటిదాకా ఒకేచోట రెండు తరగతులను కూర్చోబెట్టాలి. బోధన ఇబ్బందికరం. ఇవన్నీ పూర్తయితే మండలంలో ఇన్ని రూములున్న పాఠశాల మాదే అవుతుంది.బైక్‌కు స్టాండేసి, రిజిస్టర్‌లో సంతకం పెట్టి బయటకు వచ్చాను. పిల్లల మనసంతా స్తంభాలు తీసేవాళ్ళపైనే ఉంది. వాళ్ళెలా పనిచేస్తారు? ఏం చేస్తారనేదే వాళ్ళ ఆసక్తంత! హెడ్‌మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. కూలీలకు జాగ్రత్తలు చెబుతున్నాడాయన. ‘ఓ జాగ్రత్త... స్తంభాలిరిగితే ఇబ్బంది.. రూములైనాక ఫెన్సింగ్ వెయ్యాలి’.‘నమస్తే సార్’ అంటూ విష్ చేశాను.
పక్కనే ఉన్నాడు రామిరెడ్డి. ఊరి పెద్దమనిషి! రూమ్‌ల కాంట్రాక్ట్ ఆయనకే వచ్చినట్లుంది. అతనే నన్ను పలకరించాడు. ప్రతిగా నవ్వాను.‘‘ఏం రామిరెడ్డి గారూ.. మీరేనా తీసుకుంది?’’‘‘మనకే సార్...’’‘‘స్పీడ్‌గా కానియ్యండి. ఇదిగో.. దీనిలాగా చెయ్యమాకండి’’ అంటూ స్లాబ్ పూర్తయిన సర్వశిక్షా అభియాన్ రూమ్‌ను చూపాను. దానికి ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ చేయలేదు. దాని కాంట్రాక్టర్ రామిరెడ్డి కాదు.‘‘మన ఎవారం అట్టుండదులే సార్.. ఏదైనా తెగిపోవాల! నాలుగు డబ్బులు మనకు రావడమో, జోబులోయి పడడమో.. రెణ్ణెల్లలో అయిపోతది సూడు.’’మధ్యలో హెడ్‌మాస్టర్ కల్పించుకుంటూ, ‘‘అందరి పద్ధతీ వేరు, రామిరెడ్డిది వేరు సార్. వర్క్ దగ్గర పర్‌ఫెక్ట్! చూడు, దెబ్బకు అయిపోతది. ఓపెనింగ్‌కు ఎమ్మెల్యే, గిమ్మెల్యే... కథాకార్కాణం గందరగోళంగా ఉంటది చూడు’’ అన్నాడు.రామిరెడ్డి ఛాతీ కాస్త ఉప్పొంగింది. కాంట్రాక్ట్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడని అతనికి పేరు. అలాంటిది మా హెడ్‌మాస్టర్ పొగడ్తలు అతణ్ణి మరింత ఉత్తేజపరిచాయి.‘‘ఎమ్మెల్లేను పిలవకుండ ఉంటమా! మన మాట కాదంటడా!’’ రామిరెడ్డి నవ్వుతూ అన్నాడు. తను, ఎమ్మెల్యే ఒకే పార్టీ. ఎమ్మెల్యే ఎపడు ఈ ప్రాంతానికి వచ్చినా భుజంపై చేయి వేసి మాట్లాడే వ్యక్తుల్లో రామిరెడ్డి ఒకడు.