కాలనీలోని కమ్యూనిటీ హాలు చిన్నగా ముస్తాబయింది. రెండో పెళ్లి చూడటానికి వచ్చినట్లు పదిహేను మంది ఆ కుర్చీలలో అక్కడక్కడ అలా కూర్చున్నారు.’వ్రాయాలని వుంది’ అనే పుస్తకాన్ని మరి కొద్ది సేపట్లో ఆవిష్కరించనున్నారు. రచయిత బంధువులు, మిత్రులు తప్పదన్నట్లు కునుకుపాట్లు పడుతున్నారు. చాలా కాలం తరువాత సుందర్రామ్మూర్తి గారు కనిపించారు. తలుపు దగ్గర నిలబడి చివరి వరుసలో కూర్చున్న నన్ను అదే పనిగా చూస్తున్నారు. తెల్లని కుర్తా, పంచె, చక్కని కండువా ఆయనకు నిండుగా వుంటాయి. చేతిలో ఏదో పుస్తకం లాంటిది వుంటుంది. అది పుస్తకం కాదని చాలా మందికి తెలియదు.

అది కేవలం ఒక పుస్తకం మీద అట్ట. నాకు తెలిసి దానిని ఏ రోజూ వదిలి పెట్టలేదు. మా ప్రక్క ఇంటి వరండాలో ఆయనని రోజూ పడక కుర్చీలో వున్నపడు చూసే వాడిని. ఫాన్‌ ఓ మూల వున్నప్పటికీ ఆ అట్టముక్కతోనే విసురుకునే వారు. ఎవరైనా మంచి నీళ్లు తీసుకుని వస్తే దాని మీద పెట్టమని అలా గ్లాసు అందుకునేవారు. ఆయన ఆ ఇంట్లోంచి వెళ్లిపోయి చాలాకాలం అయింది. అయినా నన్ను గుర్తుపట్టి వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు.‘కులాసాగా వున్నారా?’ అడిగాను.‘రాయిలా వున్నాను. అందుకే హాయిగా వున్నాను’ , అన్నారు.‘మిమ్మల్ని చాలా సార్లు ఈ అట్టముక్క గురించి అడిగాను. చెప్పనే లేదు’.‘మంచివారే! పుస్తకావిష్కరణ సభకు వచ్చి అట్టముక్క గురించి అడుగుతారేం?’‘అట్టముక్క కాబట్టి తొలిపలుకు లాగా చెప్పండి’‘నిజమే. ఈ కార్యక్రమంలోనైనా మీకు చెప్పాలనిపిస్తోంది...’అంటూ గొంతు సద్దుకున్నారు. వేదిక మీద ఎవరో మైకు ముందుకు వచ్చి గొంతు సరి చేసుకున్నారు. ‘మనిషి ఎందుకు వ్రాస్తాడు?...’, మైకు గియ్‌ మని సద్దుకుంది, ‘...తను మాట్లాడకూడదనా లేక మరొకరు మాట్లాడాలనా? ఒక్కసారి ఆలోచించండి...’జజజజజఆ కార్యక్రమానికి అంతరాయం కలుగకుండా ఆయన చెబుతూ పోతున్నారు...‘కాలేజీ నుంచి ఇవతలికి వచ్చిన తరువాత అది వరకు లేనిది ఎందుకో పుస్తకాల మీద మోజు పెరిగిపోయింది. రోజూ దగ్గరలో వున్న గ్రంథాలయంలోకి దూరి బాగా పొద్దు పోయే వరకూ చదువుతూనే ఉండే వాడిని. ఇష్టంగా అనిపించినవి జాగ్రత్తగా పొందుపరచుకుని అలా ఎక్కడో అక్కడ వ్రాసుకుంటూ ఉండే వాడిని. ఒక చక్కని సంవాదమో లేక సన్నివేశమో లేక బాగా ఆలోచింపచేసే మాటలనో కాగితం మీద పెట్టి దాని కింద నా ఆలోచనలు రాసేవాడిని. ఒక రోజు లైబ్రరీలో కూర్చొని ఏదో చదువుతూ ఒక తెల్ల కాగితం మీద మరేదో రాయబోయి ఎందుకో ఆగాను. ఇంత తెల్ల కాగితాన్ని ఎందుకు చెడగొట్టాలి? అనిపించింది....