‘ఈ ‘బిచ్‌’ గనక బిజినెస్‌ పెట్టిందా... ఒక్కటంటే ఒక్క బేరం రాదు.’ఇదీ మేడం... మిమ్మల్ని చూడగానే నాకు కలిగిన ఆలోచన. ఆ వెంబడే ‘అమ్మయ్య’ అన్న రిలీఫ్‌ కూడా కలిగింది. సాగర్‌బాబు మీద ‘ప్రేమ’ మరింత ఉప్పొంగింది. నా పథకంలో వాడి యూజ్‌ వాల్యూ ధడాల్న పెరిగిపోయింది.నేనిలా ఉబ్బితబ్బిబ్బై అది దాచుకోలేక సతమతమవుతుంటే...‘‘వీడికి నువ్వు డాడీనని ఎందుకు చెప్పావ్‌?’’ అంటూ మీరు కోపంతో ఊగిపోతున్నారు. మీ మొహంలోకి చూడకుండా మొహమైతే వంచుకున్నాను గాని మనసులో నవ్వు... ఆశ... కలగలిసి పొంగుతున్నాయి.‘నువ్వింత భూలోకసుందరివని తెలీక చెప్పాను...’ అని నాలో నవ్వు, ‘నువ్వు ఇలా ఉండటం నాకు మరింత సేఫ్‌...’ అని నాలో ఆశ.మీరు నా కథంతా వింటున్నారు... ‘‘అనాథని... స్కూల్లో సెక్యూరిటీ గార్డుని... హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి వచ్చాను... మీ అబ్బాయి సాగర్ని స్కూలు పిల్లలు డాడీ లేడని ఏడిపించటం చూశాను. 

అందుకని నేనే డాడీనని ఓదార్చేను...’’‘మీరు నేను చెప్పినదేదీ నమ్మటంలేదని తెలుస్తోంది... కాని గట్టి బీజమే వేసాను. మీ మనసులో మొలక... ఇప్పుడే వస్తుందా... టైం పడుతుందా... లోలోపల ఆలోచనలు...’అసలు సంగతి ఇప్పుడు చెప్తాను మేడం... భర్త లేకుండా పిల్లాడిని పెట్టుకుని ఉంటున్నారు మీరు. హైద్రాబాదులో ఈవిడకు ఈ మాత్రం ఉద్యోగం దొరకదా... అమ్మా నాన్నా దగ్గర ఉండొచ్చు కదా... నిజంగా మొగుడు ఎక్కడో ఉన్నాడా లేక ఇంకేమైనా కథ ఉందా? మీ పొరుగువాళ్ళకి మీరంటే కుతూహలం. వాళ్ళు అల్లుకున్న కథలు పిల్లల ముందు అన్నారు. పిల్లల మాటలు మా సెక్యూరిటీ వాళ్ళకి చేరాయి. ఆ మాటలే నా పథకానికి ఆరంభం. దానికి నీరుపోసా. పిల్లలు ఏడిపిస్తూంటే సాగర్‌ బాబుకి ‘డాడీ’ అయ్యా. నెమ్మదిగా వాడికి చేరువయ్యా.‘‘మీ ఇంట్లోనే పనిచేస్తా... సాగర్ని వదలలేకపోతున్నాను... మీరు జీతం ఎంతిచ్చినా పర్లేదు... తిండి పెట్టండి చాలు.’’నా ప్లాన్‌ ఫలించింది. ఏకంగా ఇంట్లోనే ఉండమన్నారు. నా అంతిమ లక్ష్యం అదే. చాలా సులువుగా నెరవేరింది. కాని మళ్ళీ జంకు.