‘‘ఒరే ఫైజ్‌, ఈ నెలయినా ఒక్కసారి వచ్చి వెళ్ళు. అన్వర్‌ గురించి నాకు బెంగగా ఉంది. ఇంకా ఎక్కువ కాలం వాడు మన మధ్య ఉండడేమో! నీ ఇష్టం మరి!’’ అని సాహెబ్‌ మామూ ఫోన్‌ పెట్టేశాడు.వెళ్ళాలి... వెళ్ళాలి... అన్వర్‌తో ఈ చివరి కొన్ని రోజులైనా ఉండాలి.కాని వెళ్ళగలనా? వాడి నిశితమైన కళ్ళలోకి సూటిగా చూడగలనా? ఆలోచనలన్నీ బీడుభూమిగా మారిపోయిన వాడి నిర్జీవత్వంతో మాట్లాడగలనా?ఎడమచేతిని కళ్ళ ముందుకు చాచి వాచ్‌లోకి చూసుకున్నాను. ఎందుకు చూస్తాను పదే పదే పెద్దపులి లాంటి ఈ గడియారపు భీకరమైన ముఖంలోకి? భయమేస్తుంది, తెలియని దిగులేస్తుంది ఆగిపోయినట్టున్న ఆ రెండు ముళ్ళనీ చూస్తే, వాటి నిశ్శబ్దాన్ని వినలేక వింటూ ఉంటే! ఈ గదీ, ఈ వాచ్‌, ఈ పుస్తకాలూ, ఈ పెయింటింగ్స్‌..., నేనూ ఏమీ మారలేదు. పదేళ్ళుగా అదే జర్నలిస్టు బతుకు. అదీ మారలేదు. కొత్తగా వచ్చిందల్లా- ఈ నిగూఢమైన నిశ్శబ్దం. నైరూప్యమైన శబ్దరాహిత్యం.‘‘నువ్వు మాటా పలుకూ లేకుండా ఉండడం నేరం. మాట్లాడు. అన్నీ మనసు విప్పి గొంతు విప్పి మాట్లాడు. లేకపోతే నీకు ఉనికే లేదు’’ అంటాడు అన్వర్‌. 

ఆ మాట గుర్తుకు వచ్చిన ప్రతిసారీ గొంతు విప్పాలనే ఉంటుంది కాని, శాశ్వతంగా మూతపడిన బావిలాగా ఉండిపోయాన్నేను- ఒక్క నీటి చుక్కా మెరవని పాతకాలపు దిగుడు బావిలా. ఎప్పుడైనా అన్వర్‌లాగా స్ఫుటంగా మాట్లాడగలనా నేను? ఏమో?నిజానికి ఒకప్పుడు చాలా ధైర్యాన్నిచ్చినవన్నీ ఇప్పుడు దిగులే పుట్టిస్తున్నాయి. నా గోడ మీద నాకు చాలా ఇష్టమైన డాలీ బొమ్మ The Persistence of Memory ఉంది.

అందులో పాకెట్‌ వాచ్‌ కరిగిపోతున్న దృశ్యం, ఒక స్వాప్నిక స్థితిలో గడ్డ కట్టి ఉన్న రూపం, చీమలు తింటున్న ఇంకో గడియారం. కొమ్మ మీద శవంలా వేలాడుతున్న మరో గడియారం.ఆ గడియారాన్ని చూస్తూ వింటూ ఊహిస్తూ స్వప్నిస్తూ ఒకే రకం నిశ్శబ్దంలో కూరుకుపోయి, ఒకే తరహా మాటల్ని మననం చేసుకుంటూ ఉండిపోతున్నాను తప్ప బయటి లోకంతో నా ప్రమేయాలు కుంచించుకుపోయాయి. నా ఒంటరి గది. పుస్తకాలూ కొన్ని పెయింటింగ్స్‌ కొంత సంగీతం... మనుషులు తప్ప అన్నీ ఉన్న లోకం. పత్రికా ఉద్యోగంలో పక్కనున్న వాళ్ళు మనుషులో కాదో ఎప్పుడూ అనుమానమే. మాటల చుట్టూ కంచెలు.