అప్పుడే మాగన్నుగా కన్నంటుకుంది సుజాతకు.అంతకుముందే సృజన్‌ని పైకి లేపి, మెల్లిగా కూర్చోబెట్టి ఒక్కో ముద్దా అన్నంపెట్టి తడిచేత్తో మూతి తుడిచి మళ్లీ పడుకోబెట్టింది. ఖాళీ అయిన గిన్నెల్ని సర్దే ఓపిక కూడా లేక వాటినట్లాగే పొయ్యి గట్టుమీదే ఉంచి పక్క అయినా పరుచుకోకుండా మంచమ్మీద వాలిపోయింది.ఇరవై ఏళ్లవాడు, నూనూగు మీసాల గుండ్రటి వెల్తురు ముఖం, బలిష్టమైన రెండుచేతుల్తో పెద్దకప్పును పైకెత్తి మోస్తూ ‘‘అమ్మా! లే! నిద్ర లే! ఏం తెచ్చేనో చూడు. ఫుట్‌బాల్‌ ఆటలో నేనే ఛాంపియన్‌ని. నీకోసమే నమ్మా ఇది’’ అని తట్టిలేపుతున్నాడు.కొడుకు తన కల నిజం చేసాడన్నట్లు సుజాత ముఖంలో చిరునవ్వు...హైస్కూలు రోజుల్లో సుజాత అన్ని ఆటలూ ఆడేది. కబడ్డీలో కూతకెళ్లిందంటే పాయింటు రావాల్సిందే. వాలీబాల్‌లో వలమీదికెగిరి బంతిని అటువైపుకి మళ్లీ రాకుండా దించేది. కోకో ఆటలో కో అని వెనక కూత పెట్టారంటే చాలు. అవతలి పక్షం ఆటరాలు వీపుమీద చరుపు పడాల్సిందే. ఆటల్లో అంత ఉత్సాహం ప్రదర్శించేది. సుజాత ఏ జట్టులో ఉంటే ఆ జట్టుదే గెలుపు. వార్షికోత్సవాల్లో స్టేజి ఎక్కి ఎన్నో బహుమతులు అందుకునేది. హైస్కూలు చదువు కాగానే కేవలం ఆటల కోసమే అలిగి, గొడవపడి మరీ తల్లిని ఒప్పించి మరీ కాలేజీలో చేరింది. అట్లా ఎన్నాళ్లో గడవలేదు. వ్యవసాయ కుటుం బం కావడాన పంటలు పండితేనే ఏదైనా- పండిందానికి ధరలుంటేనే ఏ పని చేసినా - అప్పుల్తో ఇల్లు గడవటమే గగనమైన రోజులవి. చదువుకోవాలన్న ఆశలూ, ఆటల్లో ఎన్నెన్నో గెలవాలనుకున్న ఆకాంక్షలూ అన్నీ అడియాసలయ్యాయి సుజాతకు.

ఇన్నాళ్లకు తను గెలవలేనిది తన కొడుకు గెలిచాడని నిద్రలోనే మరింత నవ్వుకుంది సుజాత. అప్పుడే ఖంగున ఏదో మోగింది. కొడుకు మంచం దగ్గరి ముక్కాలిపీట మీది నీళ్ల చెంబు దొర్లి కిందపడింది. నీళ్లు చింది నిద్రలో ఉన్న సుజాత మీద కూడా పడ్డాయి.గబుక్కున లేచి కూర్చుంది సుజాత. ఎలుక ఒకటి ఖాళీ అయిన గిన్నెల్ని గలగలలాడిస్తూ ఇంటిచూరులోకి పారిపోయింది. లేచి లైటు వేసింది. వెల్లకిలా పడుకుని పైకి చూస్తున్న సృజన్‌ దగ్గర నిలబడింది. వాడి క ళ్లల్లో ఏదో బాధ...వాడు నోటితో చెప్పకపోయినా కళ్లు చూసి వాడిని చదవటం ఎప్పుడో నేర్చుకుంది సుజాత.మంచంలో పడుకోబెట్టిన వాడు పడుకోబెట్టినట్లే ఉంటాడు. అటూ ఇటూ శరీరాన్ని కదిలించలేడు. ఈ మఽధ్య చేతులు కూడా లేపలేక పోతున్నాడు.‘‘అమ్మా! ఊపిరాట్టం లేదమ్మా’’ అన్నాడు తల్లి రావటం గమనించి.రెండు మూడు రోజుల్నుంచి రాత్రులు పడుకునే ముందు ఆ మాటే అంటుంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందేమో అనుకుని జామాయిలు పూస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా వాడి తల దగ్గరున్న జామాయిలు మూతతీసి కాస్త గుండెలమీద రాసింది. ఇంకాస్త తీసుకుని వాడి ముక్కులకు వాసన చూపించింది. వాడు కళ్లు మూసుకోగానే తలుపు తీసుకుని బయటకెళ్లింది. పందిరి కింద మంచమ్మీద రమణయ్య నిద్రపోతున్నాడు.