వెండిని కరిగించి గుమ్మరిస్తున్నట్టుగా వుంది తలకోన జలపాతం. రక్తంలో స్నానం చేసినట్టున్న సూర్యుడు మెల్లిగా కొండల్లోకి జారిపోతున్నాడు. వెలుతురులో సాంద్రత తగ్గిపోతూ వుంది. మిగిలిన ఒకరిద్దరు యాత్రీకులు కూడా బట్టలు సర్దుకుని వెళ్లిపోయారు. చీకటిపడేవేళ జలపాతం దగ్గరికి వస్తున్న నన్ను చూసి ఆశ్చర్యంగా మొహం పెట్టి ఏదో అడగబోయారు. నేను వినిపించుకోలేదు.జలపాతం నన్ను సూదంటురాయిలా లాక్కుంటూ వుంది. పైనుంచి వురికురికి వస్తూ కొండరాళ్లకు ఢీకొని ముక్కలైపోతూవుంది. గుండెలు బాదుకుంటూ రోదిస్తూవుంది. నరమానవుడు తోడు లేకుండా ఒంటరిగా చూస్తేనే ఈ జలపాతం అందం, బీభత్సం తెలిసేది! ఈ హోరు కొన్ని సార్లు భయపెడుతుంది, గిలిగింతలు పెడుతుంది, జలదరింప చేస్తుంది.సాయంత్రం నుంచి చీకటిలోకి ప్రకృతి పరావర్తనం చెందుతోంది. రకరకాల పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. లేతనీలపు రంగులో వున్న వాతావరణం మెల్లిగా రూపుని కోల్పోతూవుంది.జలపాతం దగ్గరికి వెళ్లాను. కాస్త దూరంలో వుండగానే తన చేతుల్ని చాచి చల్లగా తడిమింది. వెళ్లిపెనవేసుకున్నాను. ఒళ్లంతా ఇష్టమొచ్చినట్టు తపతపకొట్టింది. 

వానా కాలాన్నంతా తాగేసి బాగా బలిసివుంది. చేతికి చిక్కడం లేదు. తడిసి తడిసి ముద్దవుతుంటే, చుట్టూ పాములా పాకు తున్న చీకటిని కూడా గమనించ లేదు. గెస్ట్‌హౌస్‌కి చేరుకోవాలంటే గంట పాటు నడవాలి. చీకట్లో కూడా ఈ దారిని కనుక్కోగలను.వున్నట్టుండి ఏదో విచిత్ర మైన శబ్దం వినిపించింది. అది జంతువో పక్షో అర్థం కాలేదు. అడవితో ఎంత పరిచయమున్నా అడవి గొంతులో కదిలే చాలా రకాల శబ్దాలు నాకే తెలియవు. మనకు కనబడని, వినబడని వేరే ప్రపంచం అడవిలో వుంటుంది.జలపాతం హోరులోనే చెవులు రిక్కించాను. మసక చీకటిలో ఎవరో వస్తున్నట్టుంది. మొలలోని పిడిబాకుని చేతిలోకి తీసుకుని జలపాతం ఈవలకు వచ్చాను. బట్టలన్నీ తడిసిపోయున్నాయి. రివాల్వర్‌ తడిసిపోకూడదని ఒక రాయిమీద పెట్టాను. వెళ్లి దాన్ని అందుకున్నాను.అడుగుల శబ్దం దగ్గరయ్యింది. చీకట్లోంచి ఒక మనిషి నా ముందుకొచ్చాడు. ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్కా, ప్యాంటు వేసుకున్నట్టు తెలుస్తోంది.‘‘ ఎవరునువ్వు?’’ అని గట్టిగా గద్దిస్తూ రివాల్వర్‌ చేతిలోకి తీసుకున్నాను.