మనసు మబ్బవుతుంది. నల్లగా బరువుతో వేళ్ళాడుతూ ఆకాశమంతటినీ ఆవరించి పోయే పెనుమబ్బులా ఆవేదనేదో కమ్మేసుకున్నపుడు మనసు నల్లమబ్బే అయిపోతుంది. అల్లుకున్న మబ్బు ఉధృతంగా నీరై కురిసిపోయాక మబ్బు మాయమై పోయినట్టు, కళ్ళవెంట ధారలుగా కన్నీరు కారినప్పుడుగానీ ఆవేదన అంతమవదు. ఆ ఆవేదన దేనికోసమైనా కావొచ్చు.భరించలేని ఆవేదన నల్ల మేఘంలాగా మనసంతా నిండిపోయినా ఆమెకి కన్నీరే రావటం లేదు. ఆమెలో భావోద్వేగాల బావి ఎన్నడో ఎండిపోయింది. ఎప్పుడూ ఈ మధ్య కాలంలో అవసరం పడకపోవడంతో కన్నీళ్ళు కూడా ఆమెలో బిడ్డ పాలు తాగడం మానేసాక ఇంకిపోయిన తల్లిపాలలాగా ఇగిరిపోయాయి. ఆమె ఇప్పుడు అనుభూతులన్నీ దగ్ధమైపోతున్నపుడు, కొద్దిపాటి కన్నీటికోసం తన మెదడులోని జ్ఞాపకాలను చాలా ఓపిగ్గా వెదుకుతోంది.ఆమెకి చాలాకాలం కిందటి సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చింది.్‌్‌్‌అప్పుడు ఉప్పెనొచ్చిన దాన్లా ఉంది ఊరు. పెద్ద తప్పు చేసిన దాన్లా ఉంది. ఊరి జనమంతా ఒక్కుమ్మడిగా ఊరు కాలిపోయిన వాళ్ళల్లా ఉన్నారు. 

ఏ ఇంటికీ కళ లేదు... ఏ ఇంటికీ గడపైనా మిగల్లేదు... తరాల పురుడు, పుణ్యాలు గడచిన గదులన్నీ నడిచిపోయిన జ్ఞాపకాలయి పోయేయి.ఊర్ని కొట్టేరు. ఊరి రోడ్లు కొట్టేరు. దుకాణాలూ, దివాణాలూ ఏదీ వొదల్లేదు. అన్నీ కొట్టేరు. ఊరు ఇరుకైంది. ఊరలా ఉంటే పనికిరాదట. ముసిలిదైపోతే అమ్మ మరి పనికి రానట్టు. ఎవరూ ఏమనలేకపోయేరు. ఏమన్నా ఎవరూ వినేవాళ్లు కానపుడు ఎవరేమనీ లాభం లేదని అందరికీ తెలిసిపోయింది. ఇళ్లు మాట్లాడలేదు. ఊరివంక ఆశగా చూసేయి. ఊరు ఊరుకుండిపోయింది. ఊరు గుంభ నంగా ఉండిపోయింది. అధికారులు ముత్యాలు నోటబెట్టుకున్నవాళ్ళయ్యేరు. ఆరాలకు అందకుండా తిరిగేరు. ఊళ్ళన్నీ వరసగా తెగిపోతున్నాయని తెలిసి, ఊరివాళ్ళకి ముందుగా నిద్ర తెగిపోయింది. ఊర్లో అందరూ ఉన్నారు. అయినా ఊరు కొట్టేరు.పగలే...!ఎలాంటి పగా లేదు. తాతలనాటి ఊరు... తరాలు అంతర్వాహినులైన ఊరు... ఉప్పెనొచ్చిన దాన్లా అయిపోయింది. గొప్ప తప్పు చేసి దొరికి పోయినట్లైపోయింది. వందలమంది వేలమందైనా గోవర్ధన గిరిలాగా కాచిన ఊరు. రెక్కలు తెగిపోయిన తల్లి కోడిలా అయిపోయింది. అప్పుడు ఊరందరిలో ఆవేదన నల్లమబ్బే అయ్యింది. కష్టాలు కన్నీళ్లై ఊరంతా ప్రవహించేయి. గమ్యం ఆగమ్య గోచరం అయిపోయింది. అమ్మకీ నాన్నకీ... అప్పుడే హాయిగా ఫీలయిన ఆమెకి ఆ జ్ఞాపకం ఇప్పుడేమీ కంటినీరు తెప్పించలేకపోయింది.్‌్‌్‌ఇప్పుడు ఆమె ఒక్కర్తే కూర్చుంది. ఘనీభవించిన శిలలాగా కూర్చుంది. తొమ్మిదంతస్థుల అపార్టుమెంట్‌లో నాలుగో అంతస్థు సగంపైగా ఆక్రమించుకున్న ఆ ప్లాట్లో విశాలంగా ఉన్న బెడ్రూంలో మూడోవంతు జాగాలో ఉన్న మంచం పక్కన ఆమె చలనం లేకుండా చాలా సేపట్నుండి అలానే కూర్చుంది. రాత్రికూడా నిలిచిపోయినట్టుంది. మరింక ముందుకు కదిలేట్టుగా లేదు. ఇంట్లో కూడా మరెవ్వరూ లేరు. ఎవరూ లేకుండా గడపటం, ఆమెకీ, అతనికీ బాగానే అలవాటైంది.