అసలే మానసిక ఒత్తిడిలో వున్న నాకు అప్పుడే వచ్చిన ఇ-మెయిల్‌ చదివాక వత్తిడి కాస్త ఎక్కువైంది. ఆ ఇ-మెయిల్‌ సారాంశం ‘మా చిన్నాన్న కొడుకు శ్రీరామ్‌ ఉద్యోగార్థం రేపు నా యింట్లో దిగుతున్నాడు. అదీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం!’.ఐదేళ్ళ క్రితం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం నేను బెంగుళూరు వచ్చినప్పటి పరిస్థితికి ఈ 2009 పరిస్థితికి అసలు పొంతనేలేదు. ఏడాదిన్నర అష్టకష్టాలు పడి చిన్నాచితకా కంపెనీల్లో అనుభవం సంపాదించి చివరికి ఓ పెద్ద ఐటి జైంట్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఉద్యోగం సంపాదించి అందరితో ‘లక్కి ఫెలో’గా ముద్ర వేసుకున్నప్పటి ఆ రోజులు వేరు. ఆర్థిక మాంద్యంతో అన్ని దేశాలూ అల్లకల్లోలమైన ఈ రోజుల్లో ఇంకా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపై వ్యామోహం కోల్పోని యువత వుండటం నన్ను ఆశ్చర్యపరిచింది.శ్రీరామ్‌ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో గత సంవత్సరముగా నా జీవితంలో చోటు చేసుకుంటున్న అనూహ్య సంఘటనలు, అనుభవాలు ఒక్కొక్కటే కళ్లముందు కదిలాయి.సరిగ్గా ఏడాది క్రితం అనుకుంటా - మా కంపెనీ ఉద్యోగులందరికీ యాజమాన్యం తరపున ఓ ఇ-మెయిల్‌ అందింది.

 దాని సారాంశం ‘‘రాత్రీ పగలు కష్టపడి టాలెంట్‌ నిరూపించుకున్న వారిని మాత్రమే కంపెనీ గుర్తిస్తుంది’’. అయితే ఈ మెసేజ్‌ని చాలామంది లైటుగా తీసుకున్నారు.ఎప్పుడూ ఉద్యోగుల్ని వార్మప్‌ చేసే సందేశం గానే అనుకున్నాం. కాని ఆ రోజు పంపిన ఆ ఇ-మెయిల్‌ వెనక అప్పుడే పాశ్చాత్యదేశాలలో ఆర్థిక మాంద్యం చాపక్రింద నీరులా ప్రవేశించిందనీ, దాని ఫలితమే ఆ ఇ-మెయిల్‌ అని మాలో చాలామంది గుర్తించలేకపోయాం. ఆ మాట కొస్తే మన దేశంలోని ఆర్థిక శాస్త్రవేత్తల అంచనాలకి కూడా అందలేదు.మరో నెల గడవకముందే జరిగిన మరో సంఘటన మాలో మొదటి సారిగా మా ఉద్యోగంపై అసంతృప్తిని రేపింది. ఆ నెల శాలరీ స్లిప్‌ ఆతృతగా ఓపెన్‌ చేసి చూసుకున్న నాకు చాలా నిరాశ మిగిలింది. సహజంగా ప్రతి ఆరు నెలలకి రావలసిన ఇంట్రిమ్‌ ఇంక్రిమెంట్‌ ఈ శాలరీ స్లిప్‌లో మిస్సైంది. ఇది నాకే కాదు చాలామంది ఉద్యోగులకి కూడా జరిగింది. అలాగని ఎవ్వరికీ ఇంక్రిమెంట్‌ రాకుండా కూడా పోలేదు. కొంతమందికి ఇంక్రిమెంట్‌ అందడంతో మాలో అసంతృప్తిజ్వాలలు మరింత రగిలాయి. ఆరోజు మళ్లీ మేనేజ్‌మెంట్‌ నుండి ఇ-మెయిల్‌ సందేశం అందుకున్న వారిలో నేనూ ఒకడ్ని. దాని సారాంశం ‘‘నిరాశపడి విధులని - నిర్లక్ష్యం చేయకండి... బెస్టాఫ్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌...!’’ అయితే ఈ చర్య వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని నేనేకాదు మాలో చాలామంది అప్పుడు గ్రహించలేక పోయాం.