‘‘రేపు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌కి వెళ్తున్నాను. ఏం తీసుకురాను నీకు?’’ ఈసారేం తెమ్మంటుందో దాదాపు తెలిసినప్పటికీ అడిగాను.సమాధానం ఆమె నుండి వినడమే నాకు ఇష్టం. అదీగాక నా ఊహను తారుమారు చేసే జవాబు రావచ్చేమో అన్న ఆసక్తీ లేకపోలేదు.‘‘పదం... ఒక్క పదం చాలు’’ అంది. ఊహించిన జవాబే. ఊహ తారుమారు కాలేదు.గత ఐదేళ్ళుగా ప్రతి ఏడాదీ జనవరిలో విజయవాడలో జరిగే బుక్‌ ఫెస్టివల్‌కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కుని రావడం అలవాటు.నేనుండేది చిన్నపట్టణమే అయినప్పటికీ అన్ని పుస్తకాలూ దొరకవు. సాహిత్యపుస్తకాలైతే మరీ.ఒక్కసారి వెళ్ళొస్తే నా నింపాది చదువుడుకి సంవత్సరం సరిపోతాయి పుస్తకాలు.తనతో పరిచయమై పదేళ్ళవుతోంది.పదేళ్ళ క్రితం మా ఊళ్ళోని బస్టాండు ఎదురుగా ఉన్న రామకృష్ణా మఠం పక్కనున్న పార్క్‌లో నిర్మానుష్యంగా ఉండే ఒక మూల కనిపించింది ఆమె ఒక శీతాకాల సాయంత్రం.అప్రయత్నంగా అటువైపు నడిచాయి నా కాళ్ళు. తలనిండా పూలతో, చేతుల నిండా పొరలే ప్రేమతో, కళ్ళ నిండా కదిలే కరుణతో దగ్గరికి తీసుకుంది.ఇక ఆ రోజునుండి నేను ఏ సాయంత్రం పార్క్‌కి వెళ్ళినా సేదతీరేది అక్కడే... ఆమె ఒళ్ళోనే.ఇవ్వాళ అడిగినట్లే అయిదేళ్ళ క్రితం ఇలాగే ఆమె ఒళ్ళో తలపెట్టుకుని అడిగాను.

‘‘రేపు బుక్‌ ఫెస్టివల్‌కి వెళ్తున్నాను. ఏం తీసుకురాను నీకు?’’ అని.‘‘ఏమీ అవసరం లేదు. కానీ నా కోసం ఏదైనా తీసుకురావడం నీకు సంతోషాన్ని కలిగిస్తుందనుకుంటే నీ ఇష్టం. అయితే ఒక్క కండీషన్‌. డబ్బులెక్కువ ఖర్చుపెట్టి మాత్రం తేవొద్దు’’ అంది.కళలు, సాహిత్యం, వేదాంతం పట్ల ఆమెకు గొప్ప అభిరుచి, లోతైన అవగాహన ఉందని ఆమెతో గడిపిన ఈ ఐదేళ్ళలో గమనించాను.కాబట్టి ఆ సంవత్సరం పుస్తక ప్రదర్శన నుండి నా కోసం కొనుక్కున్న పుస్తకాలతో పాటు ‘నీడల్ని ముద్రించిన మనిషి’ అనే నవల ఒకటి ఆమె కోసం తీసుకొచ్చి మర్నాడు సాయంత్రం పార్కులో ఆమెకు వినిపించాను.నేనే చదివి ఎందుకు వినిపించానంటే - ఆమెకు చదవడం రాదు.కానీ చెవుల్ని పెద్ద కళ్ళు చేసుకుని వినగలదు. వింటున్నప్పుడు ఆమెనెవరైనా చూస్తే ‘ఈమెకు వినడం తప్ప ఇంకేమీ తెలియదేమో’ అనుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఆమెవి వినడం సాధన చేసిన చెవులు’.