నాలుగైదు రోజుల్నించీ వానజల్లులు పడుతున్నాయి. ఎండి, బీటలు వారి దాహం కోసం ఎదురుచూస్తున్న భూమాతని చల్లని మేఘాలు ఆత్మీయంగా వానరూపంలో వచ్చి పలకరించడంతో ఆనందంగా పులకరించిపోయింది.సన్నటి వానజల్లులోనే తడుస్తూ చేను దగ్గర్నించి ఇంటికి వచ్చాడు వెంకయ్య.‘చేనుకాడికి పోయేవాడివి గొడుగు తీసుకుని పోకూడదూ? వానకి తడిస్తే కమ్మగా వుండిద్దీ?’ అంది భార్య కోటమ్మ.‘ఇంతలోనే వాన వచ్చిద్దని ఎవురు అనుకున్నార్లేవే! పదును అయిందో లేదో అని చూసిరాటానికి పోయా!’‘పొద్దుట్నించీ మబ్బులుకమ్ముతూనే వుండె. వాన ఎంత సేపట్లోరావాలి? అయితే చేలు పదును అయినట్టేనా?’‘ఉద్దామద్దేగా అయిందే పదును. ఇంకో వాన పడితే యిత్తులు ఎదపెట్టుకోవచ్చు’.‘వాన పడిద్ది ఇయాలయ్యా!’‘ఇయ్యాల్టితో ముగశిరకార్తె పోయిద్ది. ముగశిర కార్తెలో చినుకుపడితే ముసలి ఎద్దు కూడా లేచి రంకేసిద్దంట! రేపు ఆరుద్ర వచ్చిద్ది. ఆ కార్తె ఎట్ట వుండిద్దో! ఆ కార్తెలో కూడా ఇట్నే రెండు వానలు పడితే ఇంక ఢోకా వుండదు.!’‘జనం వూరుకోరు. ఈ అగులు బొగులు పదునుకే పైర్లు ఎదపెడతారు. ఎపడెపడా అని వున్నారు. ముందు యిత్తనం మొలిచిద్ది కదా!’‘ ఏం మొలిచిద్దోనబ్బా! బాగా పదును అయితే కదా?’‘మనం ఏం పైర్లు యేద్దామయ్యా?’‘చూద్దాం. 

నలుగురూ ఏ పాటు పడతారో మనమూ అట్నే పడదాం. పొలంలో పైరు వెయ్యా లంటేనే భయంగా వుందే! నాలుగేళ్లనుంచీ పొలం మీద రూపాయి ఎరిగివున్నామా?’‘మనం ఎరగడం సంగతి తర్వాత... పొలానికి పెట్టేగా అపల పాలయ్యింది. చూస్తా చూస్తా పొలాన్ని వదిలిపెట్టలేంగా?’‘ఐదెకరాలు మొక్కజొన్న, మూడెకరాలు పత్తీ, రెండు ఎకరాలు సీడ్‌ బెండ వేద్దామని వుంది నాకు. మొక్కజొన్నలో కంది కలిపిపెడదాం. ముందు వానలు పడనియ్యి!’‘సరే, కాళ్ళు కడుక్కునిరా, అన్నం పెడతా!’ అని కోటమ్మ లేచి ఇంట్లోకి వెళ్లింది.వెంకయ్య కాళ్లు కడుక్కుని లోపలకి వెళ్ళి పీట వాల్చుకుని కూర్చున్నాడు.‘ఇంకొక్క వానపడితే బాగుండు!’ అనుకు న్నాడు మనసులో. అదేమాట ఆరోజు ఏ వంద సార్లో అనుకున్నాడు.వెంకయ్యకి పది ఎకరాలు పొలం వుంది.వానలు సక్రమంగా వుండి, పంటలు సక్ర మంగా పండితే వెంకయ్య మంచి రైతు కిందనే లెక్క!వరుసగా మూడేళ్ళనుంచీ వ్యవసాయంలో చాలా దండుగపడ్డాడు.ఈ మూడేళ్ళూ పదును అయ్యేటట్లు తొలకరి వానలే కురవలేదు. ముదురు పైర్లు పడలేదు.మూడేళ్ళ క్రితం ఖరీఫ్‌ అదును దాటిపోయిన తరువాత వానలు పడటంతో రబీలో శనగ, పెసర, మినుము పంటలు వేసాడు.విత్తనాలు ఎదపెట్టిన తరువాత 20రోజులకి ఒక వాన పడి ఆగిపోయింది.పెసర, మినుము పంటలు మోకాటి ఎత్తున పెరిగి పూత, పిందె వరకూ వచ్చింది. మారు వాన లేకపోవటంతో అవి ఎండిపోవటం మొదలు పెట్టాయి.