అదీ సంగతి! ఏం చెయ్యాలో మాకర్ధమైచావట్లేదు...’’ అన్నాడు ముగింపు మాటలుగా ముత్యాలు.అంతవరకు అన్నదమ్ములు చెప్పిందంతా విన్న అచ్యుతం, ఆరిపోయిన చుట్టని అర్జంటుగా అవతల పారేశాడు.‘‘ఇదంత వీజీగా తేలే యవ్వారం గాదు. అవతల మీ నాన్న ఇరణ్యకసిపుడు. నాటువైద్దం సేత్తే కొంపలంటుకుపోతాయ్‌.. నావిగాదు... మీవి!’’ అన్నాడు అచ్యుతం.‘‘మావాఁ! యీ వూళ్ళో కొంపలంటించినా, ఆర్పినా అందుకు సమర్ధుడివి నువ్వే గంద? మాకేదో దారి చూపెట్టు’’ అన్నాడు ముత్యాలు తమ్ముడు సత్యాలు.‘‘నాగ్గనిపిస్తే గద నీకు సూపెట్టేది! మీ నాన్న ఎలాంటోడనుకున్నావ్‌. గట్టిగా నవ్వేడంటే అయిదూళ్లకినపడతది. ఉరిమి చూసాడంటే ఊరు వణికిపోతది. నాల్రోజులు దిలాసాగా చుట్ట కాల్చుకుంటూ బతకాలని ఆశపడ్డాను. చూస్తుంటే, మీ వల్ల నాకు పోయేకాలం వచ్చేట్టుంది.’’‘‘అట్టాగనక మావాఁ... నువ్‌ పోతే ఊరు అడివైపోద్ది. నువ్వు బాగుండాల... ఊరు బాగుండాల’’ అన్నాడు ముత్యాలు.‘‘సరే సాయంత్రం గనపడండి చూద్దాం’’ అన్నాడు అచ్యుతం అరుగు మీదనుండి కిందికి దిగి.‘‘చూద్దాం అనకు మావాఁ... చేద్దాం అను’’ అన్నాడు సత్యాలు రెండు చేతులూ పట్టుకుని.‘‘రేయ్‌ సిన్నాడా... నా బుర్ర తినబాక... మీ అమ్మ నాకు సవితి చెల్లెలయినా సొంత చెల్లెల్లాగానే చూసుకుంటున్నా గంద. దాని కడుపున పుట్టిన మిమ్మల్ని గాలికొదిలేస్తానేంట్రా?’’‘‘అట్టాగన్నావ్‌ బావుంది... పదరా చిన్నాడా...’’ అంటూ ఆనందంగా ఇంటిదారి పట్టాడు ముత్యాలు.

అచ్యుతం జేబులోంచి చుట్ట బయటికి తీసి వెలిగించబోయాడు.అగ్గిపెట్టె మొరాయించింది. రెండు పుల్లలు గీసినా వెలగలా.విసుగుపుట్టి, చుట్ట జేబులో పెట్టుకుని ఇంటిదారి పట్టాడు.దారిలో తెలిసిన వాళ్ల పలకరింపులకి పరధ్యానంగా సమాధానాలు చెబుతూ ఇల్లు చేరాడు, అచ్యుతం.‘‘ఏమిటలాగ వున్నారు?’’ అంది తులసి.‘‘ఎట్టా ఉన్నాను?’’ అన్నాడు పెళ్లాంకేసి వింతగా చూస్తూ.‘‘ఏదో పోయినట్టు...’’‘‘నిజంగానే పోయింది...’’‘‘ఏంటది?’’‘‘మతి..’’‘‘నాకర్ధంగాలా...’’‘‘మొదట నాకూ అర్దంగాలా... అర్దం అయ్యాక గుండె జారిపోయింది. మతి గతి తప్పింది..’’‘‘అబ్బ... కాస్త అర్ధమయ్యేట్టు చెప్పండి...’’‘‘అది తెలియకే నేను కొట్టుకు చస్తన్నా.. సరే విను - మా ముత్యాలు, సత్యాలు తెలుసుగా?’’‘‘ఎందుకు తెలియరూ... మీ మేనల్లుళ్లేగా?’’‘‘వాళ్లిద్దరూ నా పీకకి ఉరిపెట్టారు’’‘‘మెడమీద అలాంటి గుర్తులేమీ లేవే...’’ మెడ తడిమి చూస్తూ అంది తులసి.‘‘నువ్వింత తెలివితక్కువ దానివి కాబట్టే నేను పెళ్లి చేసుకోవాల్సొచ్చింది...’’‘‘నాకు తెలివేం తక్కువ...’’‘‘అదే నేను ఏడ్చేది! నువ్వు తెలివి తక్కువ దానివని నేను చెప్పేదాకా నీకు తెల్వదు. చెప్పినా వపకోవు..’’‘‘అబ్బ... చంపక విషయం ఏమిటో చెబుదురూ?’’‘‘మా బావ ఎలాంటోడు?’’‘‘మీరే చెప్పండి... మళ్లీ తెలివి లేదంటారు!’’‘‘వపకున్నావ్‌ గద? అయితే విను...’’‘‘చెప్పండి...’’‘‘నా మేనల్లుళ్లిద్దరికీ పెళ్లిళ్లయ్యాయా? పెళ్లాలు కాపురానికొచ్చారా? వాళ్లకీ సరదాలు సంపెం గలూ వుంటాయా? ఆ ముసలోడు యివేమీ ఆలోచించకుండా వీళ్లని ఏసంకాలం ఎండలో, వానాకాలం నీళ్లలో నిలబెడుతున్నాడు..’’