గుంటూరు నుండి బయలుదేరిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌... జనరల్‌ కంపార్ట్‌ మెంట్‌ ఖాళీ లేకుండా కిటకిటలాడుతోంది. ఒక్కో సీటు మీద ముగ్గురేసి కూర్చున్నారు. ఓ సీట్లో ఇద్దరు ఆడవాళ్ళు. ఓ మధ్య వయస్కుడూ కూర్చుని వున్నారు.ఎదురుగా 22 ఏళ్ళ కుర్రాడు, మరో ఇద్దరు మగవాళ్ళూ కూర్చుని వున్నారు. అందులో ఓ వ్యక్తి భారీ కాయంతో, ఇద్దరు పట్టే సీటుని ఒక్కడే ఆక్రమించేశాడు... బహుశా ఏ గవర్నమెంట్‌ కాంట్రాక్టరో అయ్యుండ వచ్చు. మధ్యలో వ్యక్తి స్కూల్‌ టీచర్‌ అయ్యండవచ్చు. బక్కపలచగా ఉండి పంచె, ఇస్త్రీ చేసిన చొక్కాతో మధ్య తరగతికీ, మంచితనానికీ ప్రతినిధిలా వున్నాడు.ట్రైన్‌ బయలుదేరుతుండగా... ఓ పెద్దావిడ ఎక్కింది. ఎక్కడైనా సీటు దొరుకుతుందేమోనని చూసుకుంటూ ముందుకి నడుస్తోంది. అంతలో ట్రైన్‌ కదిలింది.... తూలి పడబోయింది. యువకుడు ఆమెను పడకుండా పట్టుకుని పక్కకు జరిగి ఆమెను కూర్చోమన్నాడు. మధ్యలో కూర్చున్న బక్కపలచని వ్యక్తి కూడా సర్దుకుని ఆమెకు చోటిచ్చాడు. కాని కిటికీ ప్రక్కన కూర్చున్న కాంట్రాక్టర్‌ యువకుణ్ణి ఈసడింపుగా చూస్తూ ‘‘చూడు బాబూ.... ఇది ముగ్గురు కూర్చునే సీటు, నాలుగో మనిషి కూర్చుంటే నలుగురికీ ఇబ్బందిగా వుంటుంది. అంతగా నీకు ప్రజా సేవ చేయాలని వుంటే, నువ్వు నిలబడి ఆమెను కూర్చోబెట్టు’’ అన్నాడు. ఆ యువకుడు మారు మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు.

మూడు స్టేషన్ల తరువాత పిడుగురాళ్ళ స్టేషన్‌లో ముసలావిడ దిగి పోతూ... ‘‘చల్లగా వుండుబాబు’’ అని యువకుడి తల నిమిరి ఆశీర్వదించి దిగిపోయింది. యువకుడు తన సీట్లో కూర్చున్నాడు. ట్రైన్‌ బయలుదేరింది. ఎదురుగా కూర్చున్న ముగ్గురు ఆడవాళ్ళలో ఒకావిడ ఆ యువకుడివైపు మెచ్చుకోలుగా చూస్తూ ‘‘నీ పేరేంటి బాబు’’ అని అడిగింది. ‘‘చందు’’ అన్నాడు యువకుడు. ‘‘ఏం చేస్తున్నావు’’ ... ఎంటెక్‌ అయిపోయింది’’ యుఎస్‌లో జాబ్‌ వచ్చింది. వచ్చే నెలలో వెళుతున్నాను’’ అని మళ్ళీ తనే... ‘‘మనం ముగ్గురం కూర్చున్నాం. ఇంకో మనిషి కూర్చున్నంత మాత్రాన, మనకు కలిగే అసౌకర్యం కంటే, ఆ ముసలావిడ పడే బాధ నాకు ఎక్కువనిపించింది. హైదరాబాద్‌ వెళ్ళే వరకు ఇది మన సీటు అని పర్మినెంట్‌ సీటులా భావిస్తే ఎలా?.... ఏ గూండానో, ఫ్యాక్షన్‌ లీడర్‌ వచ్చి గన్‌ చూపించి సీట్లోంచి లేవండి... లేవక పోతే కాల్చేస్తానంటే లేవకుండా వుంటామా?.... మూడు బ్రిడ్జిలు దాటాకా, నాలుగో బ్రిడ్జి కింద బాంబు పేలి మన కంపార్ట్‌మెంట్‌ మొత్తం బూడిదైపోతే మనం ఎక్కుడుంటాం... ఉన్నంతవరకు సాటి మనిషికి సాయం చెయ్యలేకపోతే ఎందుకండీ బ్రతకడం’’ అన్నాడు చందు. ఈ లోగా కాంట్రాక్టర్‌ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. తనని ప్రశ్నించిన ఆవిడ వైపు చూస్తూ ‘‘మీ పేరు తెలుసుకోవచ్చా’’ అడిగాడు చందు.