ఒకటో.... రొండోకాదు! .... ఏకంగా పదిహేను రోజులు! బాప్‌రే... పదిమీద ఐదు రోజులు! సరిగ్గా ఓ పక్షం...అయినా... శాంతరాలేదు!పదిహేను రోజుల ముందు రాశానుత్తరం. అయినా రాలేదు!! పోనీ పదనుకుందాం.. అలా లెక్కేసినా ఐదురోజుల ముందే రావాలి!కానీ రాలేదు!అర్జంటుగా రమ్మనీ, రాకపోతే కుదరదనీ, నువ్వు లేకుండా యిక్కడేం బావోలేదనీ, ఉత్తరం అందగానే... అమ్మాయి కాదన్నా, అల్లుడుగారు ఇబ్బంది పడినా సరే, సరాసరి వచ్చేయమనీ... ఎదురు చూస్తుంటాననీ ఐదారు రోజుల్లో యిక్కడుండకపోతే, ఏడో రోజున అన్నం మానేస్తాననీ... స్పష్టంగా, నిర్మొహమాటంగా రాశా!అయినా... అయినా శాంతరాలేదు!నెలరోజుల్లో వస్తానన్న మనిషి - రెండునెలలు దాటి మూడు రోజులు గడిచినా రాలేదంటే... కనీసం కబురయినా లేదంటే... ఎవరయినా చేసేదదే! అన్నమాట నిలబెట్టుకోనందుకు ఘాటుగానే రాశాను! అయినా శాంతరాలేదు.నాలుగు రోజులుగా స్టేషన్‌లో ఎదురు చూస్తు న్నాను. నాలుగు రోజుల్లో ఎంత లేదన్నా నలభై రైళ్లొచ్చాయి. ఐదారు వేల మంది వచ్చి వుంటారు. ఒక్క శాంత తప్ప!ఢిల్లీలో మనుమరాలిని చూసుకుంటూ మురిసి పోతుందేమో?... కూతురు కాల్చిపెట్టే రొట్టె ముక్కలు రుచి మరిగి, మరిచి పోయిందేమో?..... టూరిస్ట్‌ బస్సులో వెళ్లి హరిద్వార్‌, రుషీకేష్‌ చూసొస్తానంది. అక్కడ బావుండి, యిక్కడందర్నీ... ఛీ, ఛీ... బుద్ధి లేకపోతే సరి!ఇక్కడో మనిషున్నాడు. 

తను లేనిదే కాల్చేతులాడ వన్న సంగతే మర్చిపోయింది! రానీ చెప్తా... అన్నం తినకుండా అలిగితే అమ్మగారు టఫీమని దిగొస్తారు. తప్పయింది. యికముందు యింకెక్కడికీ వెళ్లనని చెంపలేసుకున్నదాకా మర చినీళ్లు కూడా ముట్టను. ముట్టనుగాక ముట్టను.ఛీ.... ఛీ... ఉత్తరం రాశాక కూడా రాలేదంటే... ఆ మనిషినేమనుకోవాలి; ఇన్నేళ్లొచ్చి, ఇంగితమయినా లేకుండా.... ఛ... ఛ.... కూతురేగానీ, కొడుకేగానీ... ఎవరికెవరు? ఎవరి దగ్గరా వుండకూడదనుకునేగా ఇల్లు కట్టుకున్నది? అమ్మా, నాన్న కావాలనుకున్నోళ్లు - వాళ్లే వచ్చి చూస్తారు. మనం ఎవరి పంచనా వుండొద్దని ఎన్నిసార్లు అనుకోలేదు?పోనీ... అవసరానికి ఐదారు రోజులయితే ఏదోలా సర్దుకోవచ్చు. ఇదేమిటి?... నెలల తరబడి ! అదీ పెద్దమనిషిని వదిలేసి... పిచ్చికాకపోతే.. నిజంగా పిచ్చి మాలోకమే!నిద్రెలా పడుతుందో!... అసలు నిద్రపోతుం దో లేదో... అసలే ఢిల్లీ ... చలిరోజులు.. జ్వరంతోగాని పడిందేమో...! ఉత్తరాది వంటలు వంటికి పడుతున్నాయో లేదో.... ఆ పులకలు ఎలా నముల్తుందో.... పిప్పన్నుకు మందివ్వమని పోతే, పన్నే పీకేశాడు డాక్టరు. తొర్రిది.... ఎలా నముల్తుందో?....‘మీరు తినందే, నాకు తిన్నట్టుండదండీ....’ అనే మనిషి రెండు నెలల మూడు దినాలుగా ఎలా తింటుందో....‘‘గణ్‌, గ్‌ణ్‌.... గణ్‌... గ్‌ణ్‌....’’- ఉలిక్కిపడ్డాను. సిమెంటు బెంచీపై చాలా సేపట్నుంచీ కూచోవడం వల్ల కీళ్లు పట్టేశాయి. లేవలేక పోయాను.