ఈరోజు నుండీ దయాసాగరం వారం పాటు ఇంటిపట్టున ఉండడు. ఆ సంగతి తలచుకుంటే కార్తీక్‌ హృదిలో మధురాతి మధురమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి.ఈ మధ్యన తమ ఇంటి ప్రక్కన దిగిన కొత్తజంట దయాసాగరం, నవీనా... అతను పేరున్న ఓ టూత్‌పేస్టు కంపెనీలో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు జిల్లాలు చుట్టి రావాలి. నెలకు అయిదారు సార్లు మాత్రమే ఇంటి మొహం చూడగలిగే అవకాశం...ఆ విషయం గ్రహించే కార్తీక్‌ దృష్టి నవీనపై పడింది. నవీన పోతపోసిన పుత్తడిబొమ్మ... బింకమైన పొంకాలు. చిక్కిన నడుము మడతల్లో మెరుపులు ఎవరు చూసినా మూర్ఛిల్లటం ఖాయం...తోటమాలి కాపుకి నోచుకోని ఒంటరి వృక్షం నవీన.అటువంటి నవీనకోసం తహతహలాడసాగాడు కార్తీక్‌. అతని పెదాలపై నవీన నామమే నానుతోంది. ఇదివరలో ఆమెపై మాగన్నుగా ఉన్నకాంక్ష తొలకరి చినుకులకు పొటమరించిన అంకురంలా ఒక్క ఉదుట్న తొంగి చూడసాగింది.సన్నగా కాడలాగ ఉన్న దయాసాగరం నవీనకు సరిజోడు కాదు. వారానికోసారి గడపతొక్కే అతగాడితో ఆమె ఎలా సంసారం చేస్తుందో అర్థం కాదు.ఒంటరితనంతో దహించుకుపోతున్న నవీనను పేలవమైన, నిరామయ జీవితంలో కొత్త పుంతలు తొక్కించాలి. ఆమెకు తెలియని దివ్యమైన అనుభూతుల మకరంద మాధుర్యాల ప్రపంచం యివీ అని విశదపరచి నివ్వెరపాటు కలిగించాలి.కాని, ఇదంతా తన గృహలక్ష్మికి తెలియకుండా గుట్టుగా సాగాల్సిందే! స్నిగ్ధకి అనుమానం రాకూడదు.

నవీన విషయంలో దయాసాగరం లేని సమయాన ఇంట్లో దూరిపోయి దౌర్జన్యంగా వాటేస్కుంటే లొంగుతుందా? తిరగబడుతుందా??ఏమో కాగలకార్యం గంధర్వులే తీర్చాలి!! ప్చ్‌!! భర్త కార్తీక్‌ తీరుతెన్నులు కొత్తగా అనిపించసాగాయి స్నిగ్థకు. మూడీగా ఉండే మగడిని ఆకట్టు కోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలకు జీవం పోసింది.భార్యగా స్నిగ్ధ ఎంతో సన్నిహితంగా ఓలలాడిస్తున్నా ఒంటరి నవీనా వైపే కార్తీక్‌ తుంటరి ఆలోచనలు.ఎదురు పడినప్పుడల్లా ఓ చిరుదరహాసం వెన్నెల్లా చిందించేది.నెల దాటింది వాళ్ళు దిగి...ఓ రోజు - ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా దయాసాగరమే కోరి పరిచయం చేసుకున్నాడు.‘నా ఉద్యోగం అంతంత మాత్రం... ఊరువాడా తిరిగితే గాని, కుదుర్దు... బంధువర్గమంతా ఒత్తిడి చేస్తే నవీనను చేసుకున్నానుగాని... పెళ్లి నాకు యిష్టం లేనిపని... వారానికోసారి మొహం చూపించే నా వల్ల ఏం సుఖపడుతుందని? ఆమె ఒంటరనే నా బాధల్లా... అయితే నా బెంగంతా ఇక్కడ కొచ్చాక తీరిపోయింది’’ అని ఆగాడు.వేళకాని వేళ భోజనాలు... వీర తిరుగుళ్ళ వల్ల దయాసాగరం మొహం పీక్కుపోయి కాంతి లేని నిస్సారత ప్రస్ఫుటించింది.‘మిమ్మల్ని కలసి అభ్యర్థించాలని రెండు వారాలుగా ప్రయత్నిస్తున్నా’ అని మా దంపతుల వైపు చూశాడు.చిత్రంగా చూశాం.‘ఎవరికయినా తోడు అవసరం... నాతోపాటుగా ఆమెను తిప్పలేనుగా... మీరు మా నవీనకు అండగా ఉండండి... కాకపోతే ఆమెకు పుస్తకాల పిచ్చి... మీ దగ్గరుంటే యివ్వండి... కేబుల్‌ ఖర్చు అని నేనే పెట్టించలేదు... పోనీ మీ ఇంటికి టీవికి వస్తుంది... దయచేసి అపార్థం చేసుకోరుగా..’ దీనంగా అడిగాడు.