లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగివచ్చానో లేదో నా భార్య అంది, ‘‘ఆనందం గారికి బాగా లేదట’’.వెంటనే అతనింటికి బయల్దేర బోతోంటే, ‘ వచ్చే సరికి ఆలస్య మవుతుందేమో, భోజనం చేసి వెళ్లు’’ అంది. ‘‘అక్కడ ఎక్కువ సేపుండను. అర గంటలోవచ్చేస్తాను’’ అని బయటకు వచ్చాను. ఆనందం నాకునలభై సంవత్సరాల నుంచితెలుసు. అతని ఇల్లు మా పక్క వీధిలో ఉంది. రోజూ ఏదో సమయంలో కలుసూ ్తఉంటాం. అతను నాకంటే నాలుగైదు సంవత్సరాలుపెద్దయినా ఆరోగ్యంగా ఉంటాడు. ఏ రుగ్మతా లేదు. వారం రోజుల కిందట ఒంగోలులో ఉంటున్న చిన్నకొడుకు దగ్గరకు వెళ్లాడు. తిరిగి వచ్చిన సంగతి నాకు తెలియదు.అతనికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పెద్దవాడు పెద్దపల్లిలో, రెండోవాడు ఈ ఊళ్లో, మూడోవాడు ఒంగోలులో, కూతురు చిత్తూరులో ఉంటున్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. రెండోవాడు ప్రసన్న తప్ప మిగిలిన వాళ్లందరూ పి.జిలు చేసి లెక్చరర్లుగా పని చేస్తున్నారు.

ప్రసన్నకు చదువు అబ్బలేదో, ఏమో ఇంటర్‌ మటుకు పూర్తి చేయగలిగాడు. జ్యూట్‌ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడు. తండ్రి దగ్గర ఉండడు. కంకరగుంటలో వేరేగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతని భార్య ప్రయివేటు స్కూల్లో టీచరుగా పని చేస్తోంది.నాకు ఆనందంలో నచ్చని విషయం ఏమిటంటే మిగిలిన ముగ్గురు పిల్లల మీద చూపించే ప్రేమలో లేష మాత్రం అయినా ప్రసన్న మీద చూపించడు. నాతో మాట్లాడేప్పుడు కూడా ప్రసన్న గురించి నిరసనగా మాట్లేడేవాడు. ప్రసన్న పొడ అతనికి కానీ, అతని భార్య విజయమ్మకు కానీ ఎంత మాత్రం గిట్టేది కాదు. ఎందుచేతనో నేను అడగలేదు. నా మటుకు నాకు ప్రసన్న నాకు మంచివాడుగా అనిపించేవాడు. నాకు తెలిసినంతవరకు అతనికి ఎటువంటి దురలవాట్లు లేవు. తనేమిటో, తన కుటుంబం ఏమిటోలా ఉండేవాడు. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమలో హెచ్చు తగ్గులుంటాయని ఎక్కడో చదివాను. నాకు ఒక్కతే కూతురు అవటాన నా అనుభవంలోకి రాలేదు. ఆనందం ప్రస్తుతం తను ఉంటున్న ఇంటిని తన కూతురి పేర, మిగిలిన రెండు ప్లాట్లు పెద్దవాడికి, చిన్నవాడికి రెండు సంవత్సరాల కిందట వీలునామాలో రాశాడు. ప్రసన్నకు ఏం రాయలేదు. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే వీలునామా రిజిస్ర్టేషన్‌ విషయంలో ప్రసన్నే తండ్రికి సహాయం చేశాడు. రిజిస్టరు అయిన వీలునామా ఆనందం నాకు చూపించినపుడు పూర్తిగా చదివి నవ్వి, ‘‘ మీ ప్రసన్న సంగతి పూర్తిగా మరిచిపోయావు’’ అన్నాను.