అయిదవ్వగానే హడావుడిగానే బయలుదేరాను ఆఫీసు నుంచి. ‘‘ఆరింటికే వచ్చేసేయి! వాళ్ళు వచ్చేస్తారు’’ అని అమ్మ పొద్దున చేసిన హెచ్చరిక నేను మరచిపోలేదు.బస్టాపుకి రాగానే అప్రయత్నంగా అతనికోసం నా కళ్లు వెతికాయి. అతను ఉన్నాడు అక్కడే. నన్ను చూడగానే అతని కళ్ళలో మెరుపులు! ఒక నెల నుంచి చూస్తున్నాను అతన్ని! నాతోపాటు బస్సు ఎక్కుతాడు, నా స్టాపు రాగానే నాతోనే దిగుతాడు. మా యింటి సందువరకు వస్తాడు. నేను ఇంట్లోకి వెళ్లేవరకు చూసి వెళ్లిపోతాడు. అంతే!అతని కళ్లలో నా పట్ల ఏదో ఇష్టం, ఆరాధన! మనిషి పెద్ద అందగాడు కాదు. తెలియని ఆకర్షణ ఉంది అతని రూపంలో.ఇంట్లోకి వెళుతూనే వెనక్కి చూశాను. అతను అలాగే నా వంక చూస్తున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ లోపలికి నడిచాను.‘‘సరితా ఏమిటి విశేషం! పెళ్లిచూపులంటే ఎపడూ ముఖం మటమటలాడించుకుంటూ వస్తావు. ఇవ్వాళ నవ్వుతూ వస్తున్నావంటే ఈ సంబంధం తప్పక కుదురుతుంది’’అమ్మ సంతోషంగా నవ్వింది, నన్ను చూస్తూ మురిపెంగా.‘‘త్వరగా రెడీ అవ్వు. మంచం మీద చీర, జాకెట్టు పెట్టాను, కట్టుకో’’ అమ్మ హడావుడిగా అంది లోపలికి వెళుతూ.

నాకీ పెళ్ళి చూపులంటే - ఆ తతంగం అంటే అసహ్యం! ఏ చూపులకైనా కావల్సింది సొమ్ము చూపులే కాని సొగసు చూపులు కావు. బంగారు కాసులే కాని వాలుచూపులు కావు. ఓ సంతకెళ్ళి గేదెను కొన్నట్టే. ‘‘మాకేమిస్తారు? మా అబ్బాయికేం పెడతారు? మీ అమ్మాయికేం పెడతారు’’ ఇదే తంతు. ఇవి నా ఆరో పెళ్ళిచూపులు. అమ్మ తాపత్రయం, హడావుడి చూస్తుంటే కోపం వస్తుంది. అంతలోనే జాలి కలుగుతుంది, ఆవిడ మీద!ఆవిడకెవరున్నారు నేను తప్ప. మా నాన్న ఎవరో నాకు తెలియదు. నా చిన్నపడే అమ్మను వదిలేసి వేరే ఆవిడతో ఏలూరులో ఎక్కడో వున్నాడని నాకు చాలా పెద్దయ్యాక తెలుసుకున్నాను.స్కూల్లో అందరూ వెక్కిరిస్తుంటే అమ్మను అడిగాను ‘‘అమ్మా! నాన్నెక్కడ?’’ అని.మిషను కుట్టుకుంటున్న అమ్మ ఆశ్చర్యంగా నా వంక చూసింది. నే మళ్ళీ రెట్టించేసరికి ఆవిడ కళ్లలోకి నీళ్లు గంగలు ఉరికాయి. గట్టిగా తుడిచేసుకుంటూ నవ్వేసి - ‘‘సరితా! నీకు నాన్న లేడమ్మా! నేను నీకు అమ్మా, నాన్నా! సరేనా.’’నేను మళ్ళీ ఏదో ప్రశ్నించబోయాను.అమ్మ అడ్డొస్తూ - ‘‘సరితా! నీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను. కాని ఆ ఒక్కటిమటుకు నన్నడగకు. అదే మీ నాన్నను’’.అమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నాకు ఏడుపొచ్చింది. అలాగే జాలిగా ఏడుస్తూ వుండిపోయాను.‘‘ఇంకెపడూ నాన్నను అడగొద్దమ్మా!’’ అంది మళ్లీ దీనంగా.