‘‘ఒక కథ చెపుతాను వింటావురా?’’‘‘చెప్పండి తాతా’’‘‘అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక్కతే కూతురు అనే కథ కాదది. చానాయేళ్ళ కింద జరిగింది’’.‘‘నిజంగా జరిగిందా?’’‘‘ఆఁ’’‘‘అయితే చెప్పండి’’ఒంటెద్దు బండి సంస్కృత పాఠశాల మీదుగా కుడివేపుకి తిరిగి రాజాగారి వీధి గుండా పోతున్నది. బండి తోలే తాత బండివాడిలా కనిపించడం లేదు. తెల్లని ఖద్దరు లాల్చి అంతకన్నా తెల్లని పొందూరు ధోవతి ధరించి వున్నాడు. ఎద్దు తోకకి తగిలి ధోవతి మరకలవకుండా మడిచి తొడల కిందికి లాక్కున్నాడు. తలపాగకి బదులు తెల్లగా పండిన క్రాపు. ముసలి పెళ్ళికొడుకు వలె వున్నాడు. ఆటోలు రిక్షాలు తిరిగే వీధిలో ఒంటెద్దు బండిని వింతగా చూస్తూ పోతున్నారు కొందరు.‘‘అప్పుడీ మూలాపేటలో యిన్ని ఇళ్ళు లేవు, యిన్ని బళ్ళు లేవు. ఇదిగో ఈ వీధి చివర ఆ ఫ్లాట్లు కనపడుతున్నాయే అక్కడ అందమైన పూల తోట వుండేది. పొద్దు గూకిందంటే చాలు మల్లెలు, సన్నజాజులు, గులాబీలు, మనోరంజితాల వాసనతో ఈ మూలాపేటంతా గుబాళించేది’’-బండి వీధి చివరికొచ్చింది. చెరువుకట్ట మొదలైంది. కట్టమీద ఇరగాళమ్మ గుడిలో గంట మోగుతూంది. కుడి వేపున ఇంకా మిగిలివున్న పొలాలు.‘‘అసలు కథ చెప్పండి తాతా’’.‘‘వస్తున్నా’’ అంటూ ఎద్దుని అదిలించి కథ చెప్పసాగేడు తాత-.....అనగనగా ఆరోజు ఇలాటి సందేళ ఇదే రోడ్డ మ్మట ఒక ఒంటెద్దు గూడుబండి సాగిపోతూ వుంది. చుట్టూపచ్చని పంట చేలు. అల్లంత దూరాన ఒక ఆడమనిషి ఒంటరిగా నడిచిపోతూ వుంది. 

చంకలో పసిబిడ్డ. ఒక చేతిలో సంచి. ఎద్దుని అదిలించాడు. బండి ముందు కురికింది. ఆడమనిషి బాగా దగ్గరైంది. చిక్కినట్టు కనిపిస్తున్నా చక్కగా వుంది. ముఖంలో లక్ష్మీదేవి కళ. ఆమెని చూస్తుంటే కామాక్షి తాయిని చూస్తున్నట్టుగా వుంది.‘‘బండెక్కుతావా?’’ అడిగేడు బండి తోలే అతను.ఒకసారి తిరిగి చూసి బదులు చెప్పకుండా నడుస్తూ వుంది ఆమె.‘‘ఫరవాలేదు ఎక్కు. డబ్బులడగన్లే’’.మాట్లాడకుండా నడుస్తూ వుంది. పక్కనే బండి సాగుతూ వుంది. కొంచె దూరం పోయాక చంకలో బిడ్డ బండికేసి చూపి బుల్లి చేతులూపసాగింది. ఏమనుకుందో ఏమో బిడ్డని బండిలో కూచోబెట్టింది. పక్కనే సంచి కూడా పెట్టేసి బండి కమ్మిని పట్టుకుని నడుస్తూ వుంది. మరికొంచెం దూరం పోయేక బండాగింది.‘‘ఎంతదూరమని యిట్లా నడుస్తూ వస్తావు. నిన్నేమి మింగెయ్యన్లే. బెట్టు చెయ్యకుండా బండెక్కు’’ కొంచెం కోపంగా అన్నట్టు చెప్పాడు.అతనికేసి ఒకసారిచూసి బండెక్కి కూర్చుని బిడ్డని వొళ్లోకి తీసుకుంది. ఆ పాపకి మూడేళ్ళుంటాయి. ముద్దొచ్చేట్టుంది.‘‘కొంచెంగా పైకి జరిగికూర్చో’’ చెప్పాడు బండతను.చీకటి పడింది.‘‘ఈ వేళకి ఎక్కడికి బయలుదేరినావు ఒక్కదానివే?’’ ఆమె పలుకలేదు.