ముందు దేముడు నైవేద్యం ఆరగించాలమ్మా. ఆ తర్వాత నీవు తిందువు గాని... ఒక్క అరగంట ఓపిక పట్టమ్మా!’’ పన్నెండేళ్ళ చిట్టిబాబుని బుజ్జగించే ప్రయత్నం చేశాడు రామకృష్ణ.ఏడుపు తారాస్థాయికి పెంచేశాడు చిట్టిబాబు. అంత ఏడుపులోనూ వాడు సంధించిన ప్రశ్న శరాఘాతంలా తగిలింది రామకృష్ణకు.‘‘దేముడు నైవేద్యం తినటం ఏమిటి? ఒక్క మెతుకు... ఒక్క మెతుకైనా తిన్నాడా ఏనాడన్నా? నిజం చెప డాడీ. అసలు దేముడు ఉన్నాడా?’’పూజ గదిలోంచి ఒక్క ఉదుటున వొచ్చింది సుజాత. చిట్టిబాబు ఒంటిమీద ఒక్కటి చరిచింది. దేవుడే వున్నాడా.. లేడా అని అడుగుతావట్రా వెధవా? మీరలా నీళ్ళు నములుతారేమిటండీ... కర్ర తీసుకుని వాడికి సమాధానం చెప్పక?’’ కోపంతో ఊగిపోయింది.దెబ్బ లెక్కచెయ్యలేదు చిట్టిబాబు. ‘‘కర్రతో కాదు. నోటితో సమాధానం చెప్పండి. ఎక్కడున్నాడు? ఈ గ్రహం మీదా? మిగతా గ్రహాల మీదా? ఈ సూర్య కుటుంబంలోనా.. ఇంకో సూర్యకుటుంబంలోనా? విశ్వంలో ఎక్కడున్నాడు? భూమ్మీదకు ఎట్లా వస్తాడు? అమృతం తాగిన దేవుళ్ళకు ఆకలి వుంటుందా? నైవేద్యం తింటారా?’’చిట్టిబాబు ప్రశ్నిస్తున్నట్టుగా లేదు. చెంపల మీద వాయిస్తున్నట్టుగా వుంది.సుజాత చెప్పే పురాణ గాధల్నీ, రామకృష్ణ చెప్పే విజ్ఞాన విశేషాల్నీ ఒక్కచోట పేర్చి, కూర్చిన చిట్టిబాబు మది క్షేత్రంలో మొగ్గ తొడుగుతున్న సందేహాలకు సమాధానం కావాలని సుజాతను నిలదీశాడు.నీళ్ళు నమలడం సుజాత వంతయ్యింది.

శేషశయ్యపై చేయిని తలగడగా పెట్టుకుని అరమోడ్పు కన్నులతో నిదురలోకి జారబోతున్న విష్ణుభగవానుడు ఉలిక్కిపడి లేచాడు. నాధుని ఉలికిపాటుకి కంగారుపడింది లకీ్క్షదేవి. భర్త ముఖంలో ఇంత గాభరా ఏనాడూ చూడలేదు. పాలభాగంపై శ్వేత బిందువుల్ని తన కొంగుతో అద్దుతూ అడిగింది లకీ్క్షదేవి. ‘‘ఏమైంది స్వామీ?’’‘‘ముల్లోకాల్లో ఎవ్వరైనా ఆపదల్లో చిక్కుకున్నారా?’’విష్ణుమూర్తి చిరాకుపడ్డాడు. ‘‘ఎవ్వరో ఆపదలో వుంటే నేను ఉన్నానుగా ఆదుకోవడానికి’’.‘‘మరి కంగారు ఏల?’’‘‘ఆపదలో పడబోతోంది నేను. నేనేకాదు నాతోపాటు మిగతా దేవుళ్ళందరూ’’.తన స్వామి స్వరం వొణుకుతోంది. హాస్యమాడటం లేదని నిర్ధారించుకుంది.‘‘విషయం వివరించండి స్వామీ! తోచిన సలహా ఇవ్వగలను’’ అనునయంగా అంది.వివరించే సమయం లేదు. ఒక్క అరఘడియ సమయం మాత్రమే వుంది సమస్య పరిష్కారానికి. తక్షణం శివుణ్ణి కలవాలి’’ మాట పూర్తి అయ్యీ కాకుండానే అంతర్ధానమయ్యాడు విష్ణుమూర్తి.