వాడ్నందరూ ‘ఊగులోడు’ అంటున్నారంటే అనకేంజేస్తారు. అది చిన్న పని గానీ, పెద్ద పని గానీ... ఒక పట్టాన తెగనియ్యడు, తెల్లారనియ్యడు. ఏ విషయమైనా సరే, ఎట్టాంటి నిర్ణయమైనా సరే ఎనక్కీ ముందుకీ, ముందుకీ ఎనక్కీ ఊగిసలాడతానే ఉంటాడు.వారం రోజుల కిందటొకరోజు ఎప్పుట్లాగనే గొడుగు, నీళ్ళసీసా తీసుకోని బరెగొడ్లిప్పుకోని చేనుకి పోతన్నాడు. మిట్టచేను దాటాడు. అల్లంత దూరంలో ఎనికపాటోళ్ళ ఏపచెట్టుందనంగా ఎనకనించెవరో తోసినట్టు ముందుకి తూలాడు. మందు ఎక్కువైనోడిలాగా తూలుకుంటా తూలుకుంటా రెండడుగులేసి గెనెం మీద ఆమేన కూలబడ్డాడు.చెట్టు నీడన కూర్చోనున్న రాజయ్య ఇది చూసి పరుగెత్తుకుంటా వచ్చాడు. ‘‘ఏమైందిరా..వచ్చే వచ్చే వాడివి అట్టా కూలబడిపొయ్యావు..’’ అంటా పైకి లేపి బుగ్గలు తట్టాడు. ఊగులోడు కళ్ళు తెరిచి పైకి లేచి రెండడుగులు ముందుకేసి మళ్ళీ పడిపోయాడు. దూరంగా కాలవకట్టన గొడ్లు మేపుకుంటన్నోళ్ళు కూడా వచ్చి చుట్టూ మూగారు. ఊగులోడ్ని మోసుకొచ్చి చెట్టు నీడన పడుకోబెట్టారు. ముఖాన కాసిని నీళ్ళు జల్లారు.కాసేపటికి కళ్ళు తెరిచాడు. ‘‘ఏంది మాఁవా’’, ‘‘ఏందిరా’’, ‘‘ఎట్టాగుందిరా’’ అందరూ ఒకేసారి ఆదుర్దాగా అడుగుతున్నారు. ఎవరో మంచినీళ్ళు తెచ్చిచ్చారు. రెండు మూడు గుటకలేశాడు. అంతలోనే లేచి పక్కకొచ్చి వాంతి చేసుకున్నాడు. ‘‘కళ్ళకేమీ అగపడ్డం లేదు... అంతా తెల్లగా బూజరగా ఉంది’’ అంటా కూర్చుండిపోయాడు.

‘కూడు తినకుండా పొలం బయలుదేరాడేమో’, ‘నీరసమ్మీద కళ్ళు తిరిగినట్టుంది’, వాతం కమ్మినట్టుంది’.. తలా ఒక రకంగా ఊహిస్తున్నారు. రాజయ్య సీసాలోని చల్లటి నీళ్ళు తెచ్చి మొహం కడిగాడు.‘‘ఇప్పుడు కనపడతందంట్రా?’’ ‘‘కనపడతంది మాఁవా’’ ఊగులోడు నీరసంగా చెప్పాడు.మాయిటేళ ఇంటికి పొయ్యేటప్పుడు జొన్నకోసుకెళ్ళాలని బండికట్టుకోనొచ్చిన సుబ్బారెడ్డిని కేకేశారు. గెనాల మీద ఎగిరెగిరిపడతా బండి ఊళ్ళోకి వేగంగా పోతంది. ఊగులోడి గుండె అంతకన్నా ఎక్కువగానే ఎగిరెగిరి పడతా ఉంది. అంతకన్నా వేగంతోనే కొట్టుకుంటా ఉంది.ఊగులోడికసలే భయమెక్కువ. ఏ చిన్న సమస్య వచ్చినా కంగారు పడిపోతాడు. ఇట్టయిద్దేమో అట్టయిద్దేమో అని అవకముందే బెంబేలు పడుతుంటాడు. ఇప్పుడిట్లా తూలుడొచ్చి పడిపోవడానికి కారణమేందో అర్థం కాక గుబులు పట్టుకుంది. జెరం, గిరం ఏమీలేకపోయె, కనీసం తలకాయనొప్పి కూడా లేకపోయె. ఇప్పుడు ఉన్నట్టుండి ఇట్టా ఎందుకయినట్టు? కొంపదీసి ఫిట్సేమో.....? ఆ మాట అనుకోటానికే భయం పుట్టింది.తనకిష్టంలేని, మనసుకి కష్టం కలిగించే సంగతుల్ని గుర్తుకు తెచ్చుకోవడం కూడా ఇష్టముండదు ఊగులోడికి. వాటిని కావాలనే మర్చిపోతాడు. జ్ఞాపకాల పెట్టెలో ఎక్కడో అట్టడుక్కి వాటిని తోసేస్తాడు. ఎప్పుడన్నా ఆ ఆలోచనలొచ్చినా... ఎంబట్నే మనసుని మరేదో విషయం మీదకి మళ్ళించేస్తాడు.అయితే ఒక్కోసారి కొన్ని ఆలోచనలు ఎదురు తిరుగుతాయి. ఏం వద్దనుకుంటాడో అవే గుర్తుకొస్తుంటాయి. ఆ రాత్రీ అట్లానే జరిగింది ఊగులోడికి. ‘‘ఛ! మనకేం లేదులే. మూర్ఛలేదు, ఏం లేదు. అదయితే నోటెంట నురుగు రావటం, గుప్పిళ్ళు బిగబట్టడం ఉంటైగదా. ఏదో, మామూలుగా కళ్ళు తిరిగినయ్యంతే’’ అని తనకు తాను చెప్పుకుని పడుకున్నాడు. కానీ నిద్రపడితేగా. రాత్రంతా ఏదో గుబులు.