‘‘ఏమో గాని మునుపటి చురుకుదనం నీలో కనిపించడం లేదు నాన్నా!’’అనే మా అమ్మాయి వైదేహి వైపు తెల్లబోయి చూశాను. నిండా నలభై ఏళ్లు లేవు. స్కూలు నుంచి వస్తున్నపడే కాదు, వెడుతున్నపడు కూడా దాని మొహాన ఉసూరుమనడం తప్ప హుషారు అనేది చూసి ఎరగను. ఇదా నన్ను నిలదీయడం!‘‘అమ్మలేని శూన్యం అరాయించుకోలేక పోతున్నావా నాన్నా!’’ అనే అదనపు పరామర్శ ఒకటీ!మా ఆవిడ పార్వతి తద్దినం కూడా పెట్టేసి ఆర్నెల్లు దాటింది.చావు అనేది చెప్పలేనిదే కాదు. చెప్పిరానిది! ఆ ముందురోజు రాత్రి సంతృప్తిగా శృంగారం అందించిన ఏభై ఎనిమిదేళ్ల ఇల్లాలు, మర్నాడు ఉదయం పదిగంటలు దాటకుండా మాసివ్‌ హార్టెటాక్‌ పేరున అంబులెన్స్‌లోనే కన్నుమూస్తుందని ఎవరనుకుంటారు! అరాయించుకుని అలవాటు పడకపోతే, మొండిగా ముందడుగు వెయ్యకపోతే, ఉన్నవాళ్లు ఏం కావాలిట? వెలితికి సవతే వుండదు, లోటుకి పూటూ కుదరదు. ఎలాంటి జబ్బులకైనా కాలమే డాక్టరు. తిప్పక తప్పదు చాప్టరు!వైదేహి ఒక్కర్తే మా ఏకైక సంతానం. ఈ వయసులో నేనొంటరిగా ఏమై పోతానో అని దాని భయం. మా అల్లుడు పనిచేస్తున్న ఊరికి నన్ను ఏకంగా తీసుకుపోయి నా మంచి చెడూ చూద్దామని ఎంతో ప్రయత్నించింది.

సొంత ఇంటి నుంచీ, అలవాటు పడిన ఊరి నుంచీ, కదలడానికి నేను ఒపకోలేదు. అల్లుడు నాగభూషణంతో హోరాహోరీ పోరాడి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని వచ్చి అంతా ఎనిమిది నెలలయింది. వాళ్లే ఇక్కడికి వచ్చి నాతో వుంటున్నారు. మనవడు మురళిని వైదేహి స్కూల్లో చేర్పించడంతో పాటు మా వైదేహి కూడా ఏదో టీచరు పోస్టు ఖాళీ వస్తే ఇక్కడే జాయినయింది.తమాషా ఏమిటంటే నాకేదో సహాయంగా వుందామని నా దగ్గిర చేరిన వీళ్ల ముగ్గురికీ నా తోడే అత్యవసరం కావడం! ఏ వయసులోనైనా చేతనైన పని స్వయంగా చేసుకోవడంలోనే ఆరోగ్యం, ఆనందం వుందని మా తరం వాళ్ల నమ్మకం. ఇప్పటికీ ఎంత దూరమైనా సైకిలు తొక్కుతూ వెళ్లడమే నాకిష్టం. అల్లుడు కారులోకి రమ్మన్నా, అమ్మాయి తన స్కూటరు వెనుక కూచోమన్నా నాకు ఇబ్బందిగానే వుంటుంది. చదువుకుంటున్నపడు తప్ప కళ్లజోడు వాడను. ఇంట్లో వాళ్లకే కాదు. పై వాళ్లకీ చిన్న చిన్న సహాయాలు చెయ్యడం నాకిష్టం. పెద్దగా తోచదని బాధ లేదు. పత్రికలున్నాయి. ఫ్రండ్సున్నారు. టీవీ వుండనే వుంది. మన సాయం అందుకునే మనుషులు దొరకడం కూడా అదృష్టమే కదా!