ఊళ్లన్నీ తిరిగిన ఓ కాకి, ఓ ఊరపిచ్చుక లారీ మీద కూర్చుని పట్టణం తోవ పట్టినవి. లారీ పరిగెత్తుతుంది. పక్షులు ఎడమపక్క చూసినయి. ఓ పెద్దగేటు, ఇరుపక్కల పచ్చి గడ్డి లోపల అన్ని కార్లు నిలుచున్నయి ‘‘చూస్తివా దాని సంగతి ఏమిటనుకున్నవు. అదంతా ఒక్క మనిషిదే! వేల ఎకరాలు. ఆ బంగళాలు భవంతులు అన్నీ ఒక్కనివె. అక్కడికి దేశం నలుమూలల నుండి వచ్చి పోతుంటరు. సినిమాలు కూడా తీస్తరు. ఆటలు పాటలు నడుస్తయి. లోపలికి పోతందకు టికటు కొనాలి సుమా?’’ అంది కాకి.‘‘మనకేం టికట్‌’’ అడిగింది పిచ్చుక.‘‘సరె మనం ఈ లారీ దిగితె మల్ల మనకు’’ అంటు ఆగింది కాకి.‘‘ఏం దొరుకతదనా? మస్తు బస్సులు ఇక్కడికె వచ్చి పోతుంటయి ఏ బస్సు మీద కూర్చున్న పాయె! అంది పిచ్చుక.‘‘అవును కదా బస్సెనకబస్సు వస్తనే వున్నయి’’ అంది కాకి.‘‘వద్దులే, మల్లెపుడన్న చూద్దాం’’ అంది పిచ్చుక.అంబర్‌పేట దగ్గర్కిరాగానె ఎడమవైపు చూసి, ‘‘ ఈ తోవ ఎటో’’ అని అడిగింది పిచ్చుక.‘‘అది సంఘీ దేవాలయానికి దారి’’‘‘అట్టనా, ఆ అడవిలో కనిపించేదేనా’’ అవును ఈ దేవుల్ల గుడులు ఎక్కువ అడవిలో వుంటయి ఎందుకో’’ అంది పిచ్చుక.‘‘ఊళ్లో మనుషులుంటరు కనుక’’ అంది కాకి.‘‘అట్లనా అంటు ఆలోచనల్లో కెళ్లింది పిచ్చుక. అవునూ మనిషి నిజంగా మాయగాడె. మనిషి శ్రమను దోచుకుంటు, తన దోపిడిని ప్రశ్నించకుండ గుడిలో శఠగోపం పెట్టిస్తడు. 

వీళ్లు తలలోంచి నిలుచుండి అడగదలచు కున్నయి అన్నీ మర్చిపోతరు. ఇదో గారడి కదా’’ అని కాకి వైపు చూసింది.ఎల్‌బినగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తాలోని రాజీవ్‌ విగ్రహం చేతిమీద ఊరపిచ్చుక, బుజం మీద కాకి కూర్చోని చుట్టు చూస్తువున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ వైపు ముఖాన్ని తిప్పగానే ఊరపిచ్చుకకు ఊపిరాడలేదు ‘‘ఏంది కంపువాసన’’ అంది.అది విన్న కాకి ‘‘ఇపడు నయం, గతంలో నేనొకసారి వచ్చినపుడు దుర్వాసన వుండే’’ అంది. సాగర్‌ రోడ్‌ వైపు తలను తిప్పి ‘‘ఆ వాసన వదిలేయి ఇదేం పొగ, కళ్లు మండుతున్నయి’’ అంది కాకి.‘‘అవునుగదా’’ అంటు తన కాలితో ముక్కు నొకసారి తుడ్చుకుంది.‘‘పద ముందుకుపోదాం’’ అంటు ఎగిరింది కాకి. ఊరపిచ్చుకా ఎగిరింది. రెండు కల్సి దిల్‌సుఖ్‌ నగర్‌వైపు వెళ్లాయి. మధ్యన వున్న వైట్‌హౌజ్‌ ఫంక్షన్‌హాల్‌ మీద వాలినయి. వంటగదుల నుండి కమ్మటి వాసనలొస్తువున్నయి.‘‘ఇక్కడ పెళ్లిజరుగుతూంది’’ అంది పిచ్చుక.‘‘జరిగితే, నీవు పందిట్లోకి వెళ్లి అక్షింతలైనా తినగలవు నేను పోలేను కదా?’’‘‘అక్షింతలేంకర్వు, వాటికంత పసుపే పసుపు. వాటిని తినలేం. తిన్నా వంటికి మంచివికావు. కాసేపు ఆగితే భోజనాలకు లేస్తరు. ఓ మూలన ఎంగిలిప్లేట్లను పెడతారు. చాలు మనకు’’ అంది పిచ్చుక.