నన్ను ప్రాజెక్టు పని మీద అమెరికా పంపు తున్నారని నిన్ననే తెలిసింది.ఆ విషయం తెలియగానే ఎగిరి గంతేశాను. ఎంత కష్టపడితే ఈ అవకాశం వచ్చిందో...పంపేముందు ఆరు నెలల్లో వెనక్కి వచ్చెయ్య వచ్చు అంటారు కానీ... ఈ ప్రాజెక్టు పూర్తయి వెళ్లిన మనిషి తిరిగి వచ్చేటప్పటికి ఒకొక్క సారి మూడేళ్లు కూడా పట్టవచ్చు.మూడేళ్లు....సినిమాలో తప్ప ఎప్పుడూ చూడని అమెరికాలో, అందంగా కనిపించే బీచుల్లో, మరింత అందంగా కనిపించే రంగురంగుల టూ పీస్‌ బికినీల్లో దాగిన తెల్ల తోలు అందాలను కళ్లారా చూసుకోవచ్చన్న ఆనందంతో రాత్రంతా నిద్ర పట్టలేదు.తెల్లారాక ప్రశాంతంగా నా అమెరికాప్రయాణం గురించి ఇంట్లో చెప్పాను.మూడో ప్రపంచ యుద్ధం మూడు నిమిషాల క్రితం మొదలయ్యిందనీ, ఆ యుద్ధంలో ముందు వరసలో నిలబడటానికి నన్నే పంపుతున్నారనీ తెలిసిందన్నంత బిల్డప్‌తో మెలో డ్రామా సీన్లు ఇంట్లో మొదలయ్యాయి.అమ్మల మొదటి రియాక్షన్‌ ఇలానే ఉంటుందనీ, దాన్ని చూసి ఏ మాత్రం బెసగవద్దనీ, ఒక వారంలో అంతా సర్దుకుపోతోందనీ అనుభవజ్ఞులయిన కొలీగ్స్‌ చెప్పారు.అయితే మా అమ్మ అందరిలాంటిదీ కాదు.నేను అనుకున్న దాని కంటే చాలా ముందే తను ఈ షాకు నుండి తేరుకుంది. ఇక అప్పటినుండి నన్ను అమెరికా వెళ్లకుండా ఆపటానికి తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఒకరోజు నా పక్కనే కూర్చుని, ‘‘వెళ్లక తప్పదా?’’ అని జాలిగా అడిగింది.‘‘పరమపద సోపాన పటంలో పాములూ, నిచ్చెనలూ పక్కపక్కన ఉన్నట్లే, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అన్నాక మంచి జీతాలతో పాటు అనుకోని ట్రాన్స్‌ఫర్లు కూడా ఉంటాయి. ఆటలో నిచ్చెన ఎక్క టాలూ, పాము నోట్లో పడటాలూ ఎలా అయితే మన చేతుల్లో ఉండదో కంపెనీలో కూడా ఎప్పుడేం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు...’’ చెప్పుకుపోతున్న నేను ముక్కు చీదిన శబ్దంతో ఆగిపోయాను.

ఆ శబ్దం మా అమ్మ ముక్కు నుండి వచ్చింది.అవన్నీ నన్ను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చెయ్యటానికి వేసే ఎత్తులని నాకు బాగా తెలుసు.మొదటి నుండి నాకు బెజవాడ వేడి వాతావరణం గిట్టదు. చెమట పడితే భరించలేను. ఏ.సి. లేకుండా ఉండలేను.ఇప్పుడు నేను వెళ్లబోతున్న ప్రదేశంలో దాదాపు సంవత్సరం అంతా నీరు గడ్డ కట్టుకుపోయేంత చలి ఉంటుందట. హాయిగా ఆ చలి వాతావరణాన్ని కొన్నాళ్లయినా ఎంజాయ్‌ చేయాలన్న నా కోరిక తీరనీయకుండా మా అమ్మ వేసేఎత్తుల్ని నేను కనిపెట్టలేనా?శుభ్రంగా ముక్కు శుభ్రం చేసుకుని, ‘‘మరో మార్గం లేదా?’’ అంది జాలిగా.అప్పుడే కరంటు పోయిందేమో చెమటలు కారు తున్నాయి. ‘‘ఇదే అమెరికాలో అయితే ఇలా కరంటు పోతుందా?...’ అని మనసులో అనుకుని, ‘‘మన చేతుల్లో ఏముందమ్మా? ఉద్యోగం కావాలంటే వెళ్లాల్సిందే..’’ అన్నాను.