మూలం:రోజర్‌ మార్టిన్‌ డుగార్డ్‌ 23 మార్చి 1881న ఫ్రాన్స్‌లో జన్మించారు. 1937లో సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. 77యేళ్ళ వయసులో22 ఆగస్ట్‌ 1958న మరణించారు.  

అనువాదం: జి.లక్ష‌్మి

e-mail: guttalakshmi62@gmail.com

రుడాల్గర్‌లోని షాల్‌ ఇంటిముందు జనం గుంపులుగా నిలబడి ఉన్నారు. ఇంతలో ఆ ఇంటిముందుకో కారు వచ్చి ఆగింది. కారులోనుంచి దిగుతున్న షాల్‌, డాక్టర్‌ ఆటోన్‌ని చూసి, గుమికూడిన వారందరూ పక్కకి తొలగి దారి ఇచ్చారు. ఇద్దరూ హడావిడిగా లోపలికి వెళ్ళారు. అప్పటికే వాచ్‌మన్‌ కారులోనే డాక్టరుకు పరిస్థితిని వివరించాడు. వింటున్న షాల్‌ కన్నీళ్ళు పెట్టుకోకపోయినా యాక్సిడెంట్‌ గురించి వివరం చెబుతున్నప్పుడల్లా కదిలిపోతున్నాడు.‘‘జూల్స్‌ను కలుసుకోవడానికి వెళ్ళిన డెడెట్టీని వేగంగా దూసుకొచ్చిన కారు డీకొట్టి, ఆమె శరీరం మీదనుంచీ వెళ్ళిపోయింది. పోగయిన జనంలోంచి ఓ పత్రికా విలేకరి పాపను గుర్తుపట్టి, స్పృహలేని స్థితిలో అపార్టుమెంటుకు చేర్చాడు. అసలు యాక్సిడెంట్‌ జరగ్గానే నా భార్య పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి వచ్చే డాక్టరును పిలుచుకురావడానికి వెళ్ళింది. బహుశా ఆయన వచ్చి ఉండొచ్చు’’ వాచ్‌మెన్‌ డాక్టర్‌ ఆటోన్‌కి చెప్పాడు. ఆటోన్‌ తలూపి షాల్‌ వెంట లోపలికి నడిచాడు. వాళ్ళు హాలునీ, రెండు చిన్న గదుల్నీ, వంట గదినీ దాటి ఒక గదిముందు ఆగారు. వంటగదికి ఇవతల ఒక గుండ్రటి భోజనం బల్లపై నలుగురికోసం ప్లేట్లు పెట్టి ఉండడం ఆటోన్‌ దృష్టిలో పడింది. షాల్‌ గది ముందు నిల్చుని ‘డెడెట్టి! డెడెట్టి’’ అని పిలిచాడు.‘‘లోపలికి రండి’’ అని ఒక గొంతు వినిపించింది.గదిలోకి అడుగుపెడుతూనే గులాబీరంగు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి దీపాన్ని రెండు చేతులతో ఎత్తిపట్టుకుని ఉండడం ఆటోన్‌ గమనించాడు.

 

చెదిరిన ఆమె జుట్టుమీదా నుదుటిమీదా దీపం వెలుతురు పరుచుకుని ఉంది. సూర్యాస్తమయం తాలూకు పలచనికాంతి దీపపు వెలుతురులో కలిసిపోయింది. అప్పుడు ఆటోన్‌ దృష్టి గదిలోని మంచం మీద పడింది. ఒక యువకుడు మంచం మీదకు వంగి రక్తంతో తడిసిన ఆ పాప దుస్తులను కత్తెరతో కత్తిరిస్తూ కనిపించాడు. ఆమె చిన్నతల దిండులో కూరుకుపోయి ఉంది. ఒక ముసలావిడ మోకాళ్ళపై వంగి కూర్చుని ఆ యువకుడికి సహాయం చేస్తోంది.