చింపిరి జుట్టు, బిత్తర చూపులు, తత్తర అడుగులు,మురికి శరీరం, అర్థం లేని మాటలూ కలిసి అతనో పిచ్చోడు. మొలకో చిన్న గుడ్డ ఉంది. ఆరు నెలలుగా వీధుల్లో తిరుగుతూ పిల్లలకు ఆట వస్తువయ్యాడు. శలవైనందున ఆగడం పెరిగి వాళ్ళు రాళ్ళుసురుతున్నారు. చురుక్కుమనగానే గెంతుతోంటే పకపకలాడుతున్నారు. ఇంతలో రోడ్డుపై ఓ లారీ విసురుగా రావడం, అది ఓ మనిషిపైకెక్కడం, అతనాక్రందన చేయడంజరిగాయి. పిల్లలందరూ ‘పొలో’మని లారీ చుట్టూ చేరారు.పిచ్చతను తన లోకంలో తానున్నాడు.షాక్‌ నుండి తేరుకొన్న డ్రైవర్‌ లారీని వెనక్కు లాగాడు. మనిషి పైనున్న టైర్‌ రోడ్డుపై కొచ్చింది. క్షతగాత్రుడు గాలి పీల్చుకోవాలని చూశాడు. కుదర్లే. చనిపోయాడు.శవం వెల్లకిలాపడుంది. వయస్సు నలబై ఉండొచ్చు. నల్లగా, పొడవుగా ఉన్నాడు. క్రాపు చెదిరింది. బట్టలు రక్తంతో తడిసాయి.‘‘డ్రైవర్‌ కళ్ళు మూసుక తోలాడండీ!’’, వాడ్ని కాదండీ..... లైసెన్సిచ్చినోడ్నానాలి!’’, ‘‘చూస్తా...చూస్తా...నిండు ప్రాణాలు తీశాడుగా!’’, ‘‘అయినా...రోడ్డు క్రాసింగ్‌లో జాగ్రత్తగుండాలి!’’ చూపర్లు తలో మాటంటున్నారు.ఎస్సై వెంకట్రావ్‌ రంగప్రవేశం చేశాడు. శవం తాలూకు వారికై ఎంక్వయిరీ జరిగింది. ఎవరూ రాలేదు. లారీని సీజ్‌ చేసి డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతను లబోదిబోమంటున్నాడు. స్పాట్‌ను రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు తీసారు. పంచనామా ముగిసింది. ఎఫ్‌.ఐ.ఆర్‌లో డ్రైవర్‌పై కేసు బనాయించారు.రాత్రి ఏడైంది. డాక్టర్‌ పోస్టుమార్టమ్‌ రేపని తేల్చాడు.

 శవం కాపలా కిట్టయ్య, రంగయ్య అనే కానిస్టేబుల్స్‌కప్పగించబడింది. సర్వీస్‌లో కిట్టయ్య జూనియర్‌. వయస్సు ముప్పై. ఎర్రగా,బొద్దుగా ఉన్నాడు. ధైర్యవంతుణ్ణన్న గర్వమెక్కువ. రంగయ్య నలబైలో నల్లగా, ఎత్తుగా ఉన్నాడు. భయస్తుడు. కిట్టయ్యంటే ఈర్ష్య.వెట్టోళ్ళు శవాన్ని రిక్షాపై వేశారు. పి.సి.లు ఎస్కార్టుగా అది మార్చురీకి చేరింది. చెరువు కట్టకొమ్మునున్న దాన్ని పీనుగల కొట్టంటారు. అది బ్రిటీష్‌ కాలం నాటిది. అందులో ఓ గది, పంచా ఉన్నాయి. గదిలో ఎత్తు బల్లా శవం డిసెక్షన్‌కు, పంచాలో చిన్న బల్లా కూర్చోటానికి వాడుకుంటారు.వెట్టోళ్ళు శవాన్ని తెస్తుంటే రంగయ్య టార్చేసి తలుపు రెక్కలు తెరచి స్విచ్‌ ఆన్‌ చేశాడు. కాని లైట్‌ వెలగలేదు.‘‘బిల్లు కట్లేదని కరెంట్‌ కట్‌లాగుందన్నా!’’ కిట్టయ్య టార్చేసి దారి చూపాడు.‘‘తూఁ! ఈ డాక్టరికివేం పట్టవయ్యా! అదేనేమో రాత్రయితే కోతలేదంటాడు!’’ విసుక్కొన్న రంగయ్య టార్చి బల్లపైకేశాడు.శవం దభేల్నపడింది. దాని వంటినున్న బట్టలు లాగి మొలకో గుడ్డ చుట్టారు.కిట్టయ్య తలుపు లాగి గడి పెట్టబోయాడు. అది పడ్లేదు. ‘‘ఏందన్నా...ఇదీ రిపేరా?’’ ముఖం చిట్టించాడు.‘‘ఎల్తాం దొరా!’’ వెట్టోళ్ళు రిక్షాతో వెళ్ళారు.పి.సి.లు బెంచ్‌పై కూర్చున్నారు. కిట్టయ్య టార్చేసి పరిసరాలు చూస్తోంటే రంగయ్యా చూపు మరల్చాడు.చీకట్లో చింత చెట్లు కొమ్మల్నరబోసుకొని దయ్యాల్లా ఉన్నాయి. ఆగాగొచ్చే గాలి విసుర్లు, చెట్లపై గూబల అరుపులు, గడ్డి మొక్కల్లో కీచుల రొదలు, చెర్లో కప్పల బెకబెకలు, ఊర్లో కుక్కల భౌభౌలు,... దూరంగా పొలాల్లో నక్కల వూలలు, వాటి మధ్య పీనుగుల కొట్టు.... కలసి వాతావరణం భీతిగొలిపేదిగా వుంది.