వసంతోత్సవం ఇంకా మూడు రోజులుంది.భరతప్ప వాసంతికతో గొడవ పడి నాలుగు రోజులయింది. చాలా మామూలుగా మొదలైన సంభాషణ... చినికి చినికి గాలివానైంది. వ్యాజ్యం న్యాయస్థానం దాకా వెళ్ళింది. విషయం చిత్రమైనదవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వయంగా రాయలవారే తీర్పు చెప్పబోతూండడం ఈ చిత్రమైన సంఘటనకి మరో విచిత్రమైన మలుపు.రేపే తీర్పు.్‌్‌్‌‘‘ప్రణయ వివాహమట కూడానూ!?’’‘‘పైగా మగడూ, పెళ్లాం ఇద్దరూ పండితులట కూడానూ!’’‘‘అస్సలు తంటా అక్కడే కదయ్యా వచ్చిందీ?!’’‘‘ఏమిటో?’’‘‘ఆ! ఏముంటుందీ? పంతాలూ, పట్టుదలలూనూ. ఎన్నయినా చెప్పు ఎవరూ ఎవరికీ లోబడకపోవడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పు? కలికాలం కాకపోతే!’’‘‘అంత సులువుగా చెప్పేయకు. ఆ భార్యాభర్తలు అన్యోన్య దంపతులే. ఒకరికొకరు లోబడి ఉండేవాళ్ళే. కాకపోతే ఈ ప్రత్యేక కారణం ఉంది చూశావూ! అది మహా గొప్పదీ! అంతకంటే చిత్రమైనదీనూ!’’‘‘స్వయానా మూడు రాయల గండడు వ్యాజ్యం వినడమేమిటీ? తానే స్వయంగా తీర్పు చెప్తాననడమేమిటి? రాజ్యమంతా వసంతోత్సవ సంరంభాల మధ్య హడావుడిగా ఉన్న సమయంలో ఈ కలకలమేమిటో?’’‘‘ఏమిటేమిటీ! రాయలవారే స్వయంగానా?’’‘‘మరే!’’‘‘అయితే రేపు కొలువుకి వెళ్ళవలసిందేస్మి!’’‘‘పదండి మరి!’’మిత్రబృందం రాజాస్థానానికి వెళ్ళింది.దార్లోనే కొంత సమాచారం సేకరించగిలిగేరు.భరతప్ప మనసారా ప్రేమించి పెళ్ళాడిన వాసంతిక అందంలో అందం, పాండిత్యంలో పాండిత్యం కలబోసుకున్న నిండైన స్త్రీ. భరతప్ప మాత్రం తక్కువా! పాండిత్యంలో ఆమెకే మాత్రం తీసిపోడు. పైగా ప్రణయ జంట. సమయం స్వర్ణ ప్రవాహంలా సాగుతోంది.

 పెళ్ళయి ఏడాది కూడా కాలేదు. ఇంతలో ఇద్దరి మధ్యా చిన్న గొడవ. తానేమో అచ్చ తెలుగు పండితుడు. ఆమె కన్నడంలో దిట్ట. పుట్టబోయే బిడ్డని తెలుగు వాణ్ణి చెయ్యాలా లేక కన్నడిగుడిగా పెంచాలా? అన్న చిలిపి తగాదా ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేదాకా తీసుకొచ్చింది. ఏ విధంగా చూసినా తన తెలుగు భాషే గొప్పదంటాడు భరతప్ప. ససేమిరా అంటుంది వాసంతిక. వివాదం ముదిరి నీ భాష ఎంతంటే? నీ భాషెంత? అనే దాకా వచ్చి ఆపై నువ్వెంతంటే నువ్వెంత అనే దాకా వచ్చింది. ఇరు పక్షాల వాదోపవాదాలు రెండురోజుల పాటు వాడిగా చర్చించబడ్డాయి. ఆ మాట కొస్తే మొత్తం న్యాయస్థానం తెలుగుని సమర్థించేవాళ్ళుగా, కన్నడాన్ని సమర్థించేవాళ్ళుగా రెండుగా చీలిపోయిందని చెప్పాలి. తెలుగు భాష గొప్పదని ఒప్పుకోకపోతే విడాకులకైనా సిద్ధమంటాడు భరతప్ప. ఎవరి వాదనలు వింటున్నా సరైనవేనన్నట్టున్నాయ్‌.కుర్రకారుకి హుషారు హెచ్చింది. పెద్దల్లో కొందరికి ఆందోళన పెరిగింది. ఇది ఎటు తిరిగి ఎక్కడ తేలుతుందోనన్న భయం పొడసూపింది. అప్పటి దాకా సుప్రసన్నంగా, సంతోషంగా, హాయిగా సాగుతున్న రాయలవారి రాజ్యపాలనలో చిన్న కుదుపు. కొందరు విజ్ఞులు తమాషా చూస్తున్నారు. ఏం జరగబోతోందన్న ఉత్సుకత అంతటా వ్యాపించింది. ఉన్నట్టుండి రాజ్యంలో భాషా సంబంధమైన సంవాదాలతో జనుల మధ్య బీటలు ఏర్పడుతున్నట్టు ఆస్థానానికి వేగుల సందేశాలందాయి. ఉత్సుకత స్థానే ఉద్రిక్తత చోటుచేసుకోబోతోన్న కీలక సమయంలో...స్వయానా మహారాజులే తీర్పిస్తాననడంతో...ఉత్సుకత తారాస్థాయిని చేరింది.