రామునాయుడికి గబుక్కున మెలుకువ వచ్చేసింది.కడుపు పొంగిపోతున్నట్టనిపించి బాత్‌ రూంకి వెళ్ళేడు. తిరిగొచ్చేక, మరి నిద్దర రాలేదు. చుట్ట వెలిగించి, పెదాల మధ్య ఇరికించేడు.నాగరత్నం, మంచానికి అవతల పక్క నోరు బాగా తెరిచి, గురకలు తీస్తూ నిద్రపోతోంది.చుట్ట పొగ వొదుల్తూ, కళ్ళు అరమూసిన రామునాయుడికి తన ఆరోగ్యం మీద బెంగ, పెరట్లోని ఆనపపాదుల్లా అల్లేసుకుంది. కడుపు కుడి చేత్తో రాసుకున్నాడు.‘‘ఏటో అయిపోతన్నాది గావాల... లోన... కానుకోలేకండున్నాను.. నడిరాత్రేల ఒంటేలుకిన్ని సుట్లెందు కొస్తన్నాది... కేంసరు గానీ అట్టుకుందేటో’’.కేంసరు ఆలోచన రాగానే, రామునాయుడికి భయం వేసింది.ఏభై ఏళ్ళుదాటిన రామునాయుడికి అనారోగ్యం అంటే తెలీదు. పిల్లల్లేకపోయినా, అతనికీ, నాగరత్నానికీ కూడా ఆ విషయమై ఎటువంటి బాధా లేదు.అనారోగ్యం ఏనాడూ దరిజేరని అతగాడికి గత వారం రోజులుగా నిద్ర సరిగ్గా పట్టడం మానేసింది.చుట్టపారేసి, మంచంమీద వాలేడు రామునాయుడు. నిద్ర రాలేదు సరికదా... అతనికి ఉన్న ట్టుండి, కళ్ళు చీకట్లు కమ్మేయి. తల గిరగిర తిరుగుతున్నట్టనిపించింది.‘‘సచ్చిపోతున్నాను గావాల’’ అనిపించి, చెయ్యి చాచి, నాగరత్నాన్ని తట్టిలేపేడు. ‘‘రత్నం... వొలె రత్నం... లెయ్యే...’’ అని నాలుగుసార్లు లేపితే, ఒక్కసారి కదిలింది.... కళ్ళు తెరవకుండానే, ‘‘నీకేటి పొయ్యీకాలం... నడి రేత్రికాడ, నీసాని బుద్ధులు నాకాడేటి సాగవు. నీ కెల్లినేల్లు ఎవడి కెల్లేయి. సిగ్గుండాల... నోర్మూసుకుని తొంగుండిపో... రత్నం... రత్నం... అని మల్లీ గోకీ నావంటే బాగుండదు’’ అని అటువైపు వొత్తిగిల్లింది.రామునాయుడికి మంటెక్కిపోయింది. 

‘‘ఏటే... ఏటేటపేల్తన్నావు...? మొగుడు పిలస్తంటే, ఎందుకో, ఏటో అని ఆలోసించకండ, నోటికేదోస్తే అది పేల్తన్నావు...’’ అని నాగరత్నం పిర్ర మీద గట్టిగా చరిచేడు.గబుక్కున లేచిపోయింది నాగరత్నమ్మ. మంచంమీద నిటారుగా నిలబెట్టిన మేకులాగా, కూర్చుని ‘‘నన్నొదిలిపెట్టెల్లిపోనావె అత్తా...! అత్తా!! ఈ మాయదారి మొగుడికి నన్నప్పజెప్పీసినావే అత్తా...! అత్తా...!!’’ అని వొయినాలు వొయినాలుగా ఏడ్వటం మొదలు పెట్టింది.బెంబేలెత్తిపోయాడు రామునాయుడు ‘‘ఓ పొల్లకేయే... ఓసోస్‌... వొల్లకుండిపోయే... నిన్నేటి సేస్సేనే... ఏడకు... ఏడకు’’ అని గడ్డం పట్టుకుని, బతిమాలాడేడు.ఏడు పాపి, తీక్షణంగా మొగుణ్ణి చూస్తూ అడిగింది నాగరత్నం.‘‘నీ మనసులో ఏటీనేకపోతే... నీకేటి అవసరం అనుకోకుంటే, ఈ నడి రాత్రేల నన్నెందుకులేపి నట్టు... నాకది సెప్పిప్పుడు... నాకది కావాల..’’ కుడి అరచేతిలో ఎడమ పిడికిల్తో గుద్దుతూ అడిగింది.‘‘ఓసినీయమ్మ... నా కొంట్లో ఏటో అయిపోతున్నట్టున్నాదని లేపినానే! తప్పయిపోనాదే!! నా బాదకి నన్నొగ్గీసి నువ్వు పల్లక తొంగుండిపో... సేసిన్నద్దర పాల్పట్టున్నాది..’’ కసిగా అన్నాడు రామునాయుడు.నాగరత్నం పడుక్కుండి పోయింది. ఐతే, పడుక్కునే ముందు ఓ మాట అడిగింది ‘‘ఏటైందేటి?’’ అని.‘‘బుర్ర తిరిగి పోతున్నట్టున్నాదే...’’ కొంచెం బాధగా అన్నాడు రామునాయుడు.