శేషాచలపతిరావ్‌ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ ‘‘ఇవాళ నీ పేరు అలఖ్‌ నిరంజన్‌’’ అని చెప్పేడు అద్దంలోని శేషాచలపతిరావ్‌తో. అద్దంలోని శేషా... నవ్వి ‘‘గొప్ప మజా, స్కౌండ్రల్‌, నీ సంగతేం చెప్పను. అవును కానీ, నీకు ఎడం పాపిడేమీ బాగులేదు ఇవాళ. కుడిపాపిడి లాగు. టైనాట్‌ కింద డింపుల్‌ బాగు లేదు. షోల్డర్స్‌ ఇంకా స్క్వేర్‌ చెయ్యి’’ అన్నాడు.విండర్స్‌ నాట్‌ కింద డింపుల్‌ దిద్ది, పాపిడి కుడిచేి స, మళ్ళీ బ్రష్‌చేసి, బుగ్గల్లోని డింపుల్స్‌ ప్రాక్టీస్‌ చేసి. అద్దం పక్కని పిన్‌చేసి ఉంచిన క్లాస్‌ రూటీన్‌ చూశాడు.‘‘మొదటి రెండు పీరియడ్సూ ఉండాలి. మూడు, నాలుగూ స్కిప్‌ చెయ్యొచ్చు’’.హాస్టల్‌ గేటు దాటుతూ ‘‘పవర్‌, ట్రెచరీ, ఎడ్వంచర్‌. నేను నేతాజీని, హిట్లర్‌ని. వినండి, బుద్ధిలేని, బలంలేని బాస్టర్డ్స్‌... మిమ్మల్నిహతమార్చేస్తాను. పారా హుషార్‌... లక్షలు లక్షలుగా క్రిముల్లాగ బతుకుతున్న మిమ్మల్ని రూపురేఖలు లేకుండా చేస్తాను... పిడికిలి బిగపట్టి, హాస్టల్‌వేపు కాలేజీవైపు చూపించి గట్టిగా చెయ్యి ఊపేడు.జోరుగా వచ్చే రిక్షాని తప్పించుకుని హిందీలో బూతులు తిట్టేడు.‘మొదటి రెండు పీరియడ్స్‌ స్కిప్‌ చెయ్యొచ్చు. దశాశ్వమేథ్‌ ఘాట్‌కి వెళ్తాను’ అని అనుకుంటూనే లైబ్రరీ వేపు తిరిగి, ‘అలఖ్‌ నిరంజన్‌! నిన్ను.. నన్నే... నేను డిసీవ్‌ చెయ్యగలను తెలుసా’ అని లైబ్రరీ వేపు నడవటం మొదలు పెట్టేడు.

సెక్షన్‌ లైబ్రేరియన్‌ టేబుల్‌ మీద గుట్టలు గుట్టలుగా రీ బౌండు చేసిన పుస్తకాల పేరు రిజిష్టర్‌లో రాసుకుంటున్నాడు. నేరుగా లోపలికిపోయి బీరువాల్లో పుస్తకాల టైటిల్స్‌ చూడటం మొదలు పెట్టేడు అలఖ్‌ నిరంజన్‌.చీర రెపరెపలు.సున్నితంగా మాటలు.కంటి చివరినుంచి చూస్తే, సెక్షన్‌ లైబ్రేరియన్‌ టేబుల్‌ మీద వేళ్ళు. లేడి... జింక... డీర్‌.ముఖం తిప్పి చూసేడు.తనవేపే చూస్తూంది ఉమాడే.అప్రయత్నంగా కళ్లతో నవ్వేడు అలఖ్‌. అప్రయత్నంగా కళ్లతో నవ్వడం అలవాటు చేసుకున్న నిరంజన్‌.హిందీలో అంది: నా కార్డ్‌ మర్చిపోయాను. శనివారం త్రివేది సెమినార్‌లో ఎస్సే సబ్మిట్‌ చెయ్యాలి. మీ కార్డ్‌మీద ఛాసర్‌ మీద బుక్స్‌ ఏమేనా ఇప్పిస్తారా?ఆ క్షణంలో చిరునవ్వు మాయమయి పోయింది. నిరంజన్‌ కళ్ళల్లో, క్షణంలో కళ్ళల్లోని నవ్వుని మాయం చెయ్యడం అలవాటు చేసుకున్న అలఖ్‌ కళ్ళల్లో. ఇంగ్లీషులో అన్నాడు. ‘‘కారిడార్‌లోకి రండి’’.గాజు అద్దాల కిటికీ దగ్గరగా వెళ్ళి. వెనక్కి తిరిగి. కోపంగా అన్నాడు. ‘‘నా కార్డ్‌ ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగను, మీరెవరో నాకింకా బాగా తెలియదు. తెలియని ఆడవాళ్ళందరికీ సహాయం చేసే షివల్రస్‌ మనిషిని కాను’’.ఉమా కళ్ళలో మెరుపులాగా కోపం...‘‘ఇవ్వకపోతే యివ్వనని మృదువుగా చెప్పొచ్చు. గొంతుకలో అంత థండర్‌ అవసరం లేదు’’.