‘‘ఏమండీ! మా బాబాయిగారింటికి వెళ్ళొచ్చారా?’’ అంటుంది జానకి.‘ఓ’ అంటాను నేను. అంటూ నా ముఖం ఆమెకు కనిపించకుండా వెన్ను చూపిస్తాను. ‘వెన్ను చూపించడ’ మన్న మాటలకు యుద్ధరంగంలో వేరే అర్థముంది. దానికి మా ఆవిడ సాన్నిధ్యంలో వున్న అర్థం యింకొకటి.‘‘నిజంగా? మా పిన్ని ఎలావుంది? వసంత ఏమందీ? నాగరాజు ఉద్యోగం మాట ఏమైంది?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది జానకి. కురిపిస్తూ నా ఎదుట కొచ్చేస్తుంది.సత్యపీఠం మీద నిల్చుంటే అబద్ధం చెప్పడం కుదరదంటారు. ఆ అనుభవమెలాంటిదో నాకు తెలియదు. కానీ మా ఆవిడ ముఖంకేసి చూస్తూ చూస్తూ అబద్ధం చెప్పగలగడమనేది - నాకు పెళ్ళయి పది పన్నెండేళ్ళయినా - యింకా సాధ్యం కావడం లేదు.‘‘మరి.. చూడు జానకీ! నేను మరి...’’ అంటూ నీళ్ళు నములుతాను.‘‘అంతేలెండి! నాకు తెలియదా? మన బంధు ప్రేమల వైభోగం అంతలో వుంది! ఏంచేద్దాం! మా బాబాయిగారు బ్రతికున్న కాలంలోనైతే నేరుగా ఆఫీసుకే వెళ్ళి అయిదు నిమిషాలో పది నిమిషాలో మాటాడి, చక్కాబస్టాండుకు దూసుకునేవారు. ఇప్పుడదిగూడా లేకపోయింది.’’ నన్నిలా ముద్దాయినిగాజేసి, అపరాధపు బోనులో నిల్చోబెట్టి తాను న్యాయమూర్తిలా వ్యవహరించడంతో వూరుకోకుండా మళ్ళీ క్రాసు పరీక్షకుకూడా సిద్ధమౌతుంది మా ఆవిడ.‘‘మరైతే - నేను మొదట్లో మా బాబాయిగారింటికి వెళ్ళొచ్చారా అని అడిగితే ‘ఓ’ అన్నారెందుకండీ?‘‘అదా జానకీ! ఎందుకన్నానంటే.. చెబుతున్నాగా వినిపించుకోకపోతే ఎలా...’’‘‘ఒద్దు బాబూ ఒద్దు! నాకు తెలుసు! మీరేదైనా కథ చెబుతారు, కథలు చెప్పి లోకాన్ని మభ్యపెట్టడం మీ చేతనౌను. నా దగ్గర మీ పితలాటకాలు సాగవు...’’ ముఖం ముడుచుకుని, రుసరుస లాడుతూ దూరంగా వెళ్ళిపోతుంది మా ఆవిడ.అంతేనండీ సంగతులు! మా జానకి సమక్షంలో నేను ప్రారంభించిన వాక్యానికి పూర్తయ్యే అదృష్టం సర్వసాధారణంగా సమకూరేదిగాదు.‘ఓ’ అని ఎందుకన్నానో, అలాగడనం ఎంతవరకు సబబో - మా ఆవిడ వినిపించుకోకపోతే పోయింది. మీరైనా అవధరించండి!  జానకి ఎవరినైతే బాబాయిగారుగా వ్యవహరిస్తుందో ఆయన తనకు బాబాయి మట్టుకేగాదు, నాకు మేనమామగూడా! నా కిద్దరు మేనమామలు. 

పెద్ద మామయ్య మొదటి భార్య కొకేకూతురు జానకి. తండ్రి రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ కుటుంబంలో జానకికున్న స్థానం పలచబడిపోతూ వచ్చింది. పెళ్ళయ్యాక సంగతి సరేసరి. మా పెద్ద మామయ్య ఒక దురదృష్టజీవి. ఆయన బడిపంతులుగా పనిచేశాడు. సంపాదించినదాంట్లో ఎక్కువభాగం నిలవ చెయ్యాలనేది ఆయన ఆశ, ఆదర్శం. అవసరాలు సరిగ్గా తీరకపోవడంతో రెండో భార్య, ఆవిడ పిల్లలు ఆయన్ను ఆదినుంచీ విరోధి వర్గంలోని మనిషిగానే లెక్కగడుతూ వచ్చారు. ఆ యింటికి వెళ్తే ఏ క్షణాన్నయినా రగడ చెలరేగడానికి వీలున్న శత్రుగుడారాల మధ్యన వున్నట్టే వుండేది. మనుషుల్ని పీడించే దయ్యాలు ఎక్కడో వున్నాయనుకుంటాం! ఆశాంతి, అలజడి, అపనమ్మకాలకన్నా దెయ్యాలెక్కడున్నాయి? భగవంతుడు ప్రత్యక్షమై ఒక్కటే వరం కోరుకోమంటే మానవుడు రెండో ఆలోచన లేకుండా అన్యోన్య దాంపత్యాన్ని కోరుకోవాలనుకుంటాను. ఇది మా పెద్ద మామయ్యగారి దాంపత్యాన్ని చూచిన తర్వాత కలిగిన ఊహే అయివుండాలి. కాపురంలో భార్యా భర్త లొద్దికగా వుండక పోవడం మూలాన చెడిపోయేవాళ్ళు పిల్లలు. పిల్లలు చెడిపోవడమంటే భవిష్యత్తు పాడుగావడం. డబ్బిచ్చి పిల్లల్ని ‘మ్యాట్నీ’కి పంపించి, చదువుకోడానికి వెళ్ళారని చెబుతుండేది తల్లి. సాయంకాలాల్లోనైనా యింటిపట్టున వుండి పిల్లల చదువుపట్ల శ్రద్ధ తీసుకోవలసిన తండ్రి విధిగా మఠంలో జరిగే వేదాంతోపన్యాసాలకు హాజరు. ప్రోగ్రెస్‌ కార్డులు యింటికొచ్చిన రోజున కుటుంబం నిప్పుల కుంపటి. ‘నీ ముదిగారం వల్లనే పిల్లలు చెడిపోతున్నా’రని ఇంటాయన ఆరోపణ. ‘మీ నిరవాకంతో బాగుచేయలేకపోయారా’ అని ఇంటావిడ ఫిర్యాదు. ఆ వుక్రోషంతో ఎప్పుడైనా చదువు చెప్పడానికని కూర్చుంటే మా పెద్ద మామయ్య చచ్చేది, బ్రతికేది తెలియకుండా పిల్లల్ని బాదేసేవాడు. ‘అయ్యో, బిడ్డల్ని తన పొట్టన పెట్టుకున్నాడు గదమ్మా!’ అంటూ అత్తయ్య శోకాలు తీసేది. మళ్ళీ యథాప్రకారంగా యింట్లో అరాచకం నెలకొనక తప్పేదిగాదు. ఇలా కాలం జరిగి జరిగి రిటయరయ్యే రోజులు దగ్గరికొచ్చేసరికి బిడ్డలకు చదువబ్బలేదన్న దిగులుతో యింకా యిద్దరు కూతుళ్ళు పెళ్ళిగాకుండా మిగిలే వున్నారన్న ఆందోళనతో మా మామయ్య తీరని అసంతృప్తికి గురయ్యాడు. చివరికా అసంతృప్తి ఒక జబ్బు రూపంలో ఆయన శరీరాన్నికూడా కృంగదీసింది. ‘క్లోస్‌’ గాకముందే కంటికి కనిపించకుండా పోయిన ‘ఫైల్‌’లా ఆయన కాలగర్భంలో కలిసి పోయాడు.