‘‘ఏవండీ మీ దగ్గర‘తడిగుడ్డతో గొంతులు కొయ్యడం ఎలా?’ అనే పుస్తకం ఉందా?’’బుచ్చిబాబు ప్రశ్నకి బుర్రకాయలో బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డాడుఆ బుక్‌ షాపులోబుక్కులమ్మే మూర్తి.అవును మరి!తడిగుడ్డతో గొంతు కోసే మనుషులుంటారేమో గానీ, అలాంటి పుస్తకాలు ఉంటాయా ఎక్కడైనా? అలాంటిది అదే పనిగా వచ్చిఒక కస్టమర్‌ అలా అడుగుతుంటే బుర్రకాయలోబాంబు పేలదూ మరి?‘‘లేదు..’’ అన్నాడు మూర్తిబుచ్చిబాబుకేసి ఎగాదిగా చూస్తూ.‘‘పోనీ’’ ‘తిన్నింటి వాసాలు లెక్కించడం ఎలా?’అనే పుస్తకమేమైనా ఉందా?’’మూర్తి ఎగాదిగా చూపుల్నికేర్‌ చెయ్యకుండా అడిగాడుబుచ్చిబాబు.ప్రశ్న అంత క్రితందే- ఎటొచ్చీ మారిందల్లా పుస్తకం పేరు!‘సందేహంలేదు... ఇతను కచ్చితంగా పిచ్చివాడే...’ అనుకున్నాడు మూర్తి మనసులో కన్‌ఫర్మ్‌గా!పైకి మాత్రం ‘‘లేదు’’ అన్నాడు ముచ్చటగా మూడోసారి.దాంతో బుచ్చిబాబు ముఖంలో బోలెడంత నిరాశ తాండవించింది.‘‘పోనీ ‘అందమైన అమ్మాయిల్ని మోసగించడం ఎలా?’ అనే పుస్తకమైనా ఉందా కనీసం’’ అడిగాడు పట్టువదలని విక్రమార్కుడిలా.మూర్తికి చిర్రెత్తుకొచ్చిందీసారి ‘‘అలాంటి నీచ, నికృష్ట, ఛండాలపస్తకాలిక్కడ, దొరకవ్‌...’’ అన్నాడు కోపంగా.‘‘పొద్దున్నే ఇలాంటి మెంటల్‌గాడి పాలబడ్డానేంట్రా? ఉదయాన్నే లేచి ఎవరి ముఖాన్ని చూశాన్రా బాబూ?’’ అనుకున్నాడు మనసులో.

మనసులో అతనలా అనుకున్నాడని బుచ్చి బాబుకేం తెలుసు? అందుకే ‘‘పోనీ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?’’ అన్నాడు ఠీవిగా నిలబడుతూ.అది చూసి ‘బుర్రలో మెదడు లేకపోయినా ఠీవీకి మాత్రం లోటు లేదు’ అనుకున్నాడు మూర్తి.అనుకున్నాక ‘‘అలాంటి పుస్తకాలు ఇక్కడేకాదు ఎక్కడా దొరకవ్‌...’’ అన్నాడు ముక్కు మీద గీరుకుంటూ.ముక్కు మీద నిజంగా దురదపుట్టి కాదు! కళ్లెదుట ఓ పిచ్చివాడు నిలబడి ఉన్నపడు భయం కలగటం సహజమే కదా! ఆ భయంలో అనాలోచితంగా అలా గీరేసుకున్నాడన్న మాట.‘‘ఎక్కడా దొరకవా? సారీ అండీ మీకు ట్రబులిచ్చి నట్టున్నాను...’’ అనేసి ఆ షాపులోంచి బైటికొచ్చేశాడు బుచ్చి!వెళ్ళిపోతున్న బుచ్చిబాబుకేసి ఓ వెర్రిచూపు చూసి ‘పాపం పిచ్చివాడు’ అనుకున్నాడు మూర్తి.్‌ ్‌ ్‌బుచ్చి చెప్పింది విని పొట్టచెక్కలయ్యేలా నవ్వాడు పవన్‌.‘‘ఎందుకలా నవ్వుతావ్‌? పదిమందితో చెడ్డవాడు అనిపించుకోవాలంటే ఏం చెయ్యాల్రా అనడిగితే నువ్వేగా చెప్పావ్‌....’’ ఉక్రోషం వల్ల గొంతు పూడుకు పోవడంతో మాట పూర్తి చెయ్యలేక పోయాడు బుచ్చి.‘‘ఏం చెప్పాను?’’ అన్నాడు పవన్‌ మనసులో ‘వీడొక తింగరమేళం’ అనుకుంటూ‘‘తడిగుడ్డతో గొంతులు కొయ్యటం, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటం, తిన్నింటి వాసాలు లెక్కించటం, అందమైన అమ్మాయిల్ని మోసగించటం లాంటి పన్లు చేస్తే తప్ప సమాజం నిన్ను చెడ్డవాడిగా గుర్తించదురా అని నువ్వేగా చెప్పావ్‌....’’‘‘అంటే....?’’‘‘అలాంటి పన్లు చెయ్యడం నాకు చేతకాదు కాబట్టి అలాంటి పనులు చెయ్యడం నేర్పే పుస్తకాలేమైనా ఉంటాయేమోనని ఎంక్వయిరీ చేశాను.... ఏం... తప్పా?’’బుచ్చిబాబు అలా అడుగుతుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు పవన్‌కి.