ఆ రోజు ఊటీలో మేట్నీ షో సినిమా చూస్తూండగా విఠల్‌కి హఠాత్తుగా తన సందేహాలకీ సమాధానం దొరికినట్టనిపించింది. తన భార్య వింత ప్రవర్తనకు, ఆ సినిమాలో హీరోయిన్‌ పరిస్థితికి లింకు దొరికింది.పెళ్లయి వారం రోజులు దాటినా అతను తన భార్యను ఆపాదమస్తకం చూడనేలేదు. హనీమూన్‌ గురించి అతను వూహించుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. భార్యభర్తల తొలి కలయిక పెళ్లివారి యింట్లో జరగడం అంటేఅతనికి మహా చికాకు. పెళ్లి తాలూకు సందడి పక్కగదుల్లో సద్దు మణగదు. పేకాడుకునే జనాల గోల, గిన్నెలు సర్దుతున్న చప్పుడు అర్ధరాత్రి దాకా వినబడుతూనే వుంటాయి. మిగిలిపోయిన అరటిగెలలు, తమలపాకుల బుట్టలు, పంచడం కుదరని మిఠాయిలు నిండిన తట్టలు - గది నాలుగు మూలలా నిండి తమ తమ వాసనలు వెదజల్లుతూ వుంటాయి. కొత్త దంపతులు కిలకిలలాడినా పక్కగదిలోకి వినబడుతుందన్న బెరుకు వుంటుంది.ఇవన్నీ ఆలోచించే అతను హనీమూన్‌ ఊటీలో పెట్టుకున్నాడు. మన ప్రథమ సమాగమం అక్కడే అని భార్యకు పెళ్లికి ముందే ఫోన్‌లో చెప్పాడు. ‘‘ఊటీ అవీ ఎందుకు? మా అమ్మమ్మ గారింటికి వెళదాం. వాళ్లది పెద్ద యిల్లు. విశాలమైన గదులు. మా మామయ్య, అత్తయ్య, అమ్మమ్మ... ముగ్గురు తప్ప ఎవరూ వుండరు. మామయ్య పిల్లలు సిటీలో చదువుకుంటున్నారు. అల్లరి పెట్టేవాళ్లు కూడా ఎవరూ వుండరు’’ అంది విశాల.

‘‘భలేదానివే, నేను మంచి రొమాంటిక్‌గా ఊటీ అంటూంటే నువ్వు పల్లెటూరినీ, బురదరోడ్లనీ పట్టుకు పాకులాడుతావేంటి? ఊటీ అంటే ఆ నీలగిరి హిల్స్‌, ఆ కొండలూ, లోయలూ జీవితాంతం గుర్తుండిపోతుంది. పైగా మనం చెట్టాపటాలేసుకుని తిరిగినా ఊటీలో ఎవరూ పట్టించుకోరు. అదే మీ వూళ్లో అయితే... వూరందరికీ అదే వూసు...’’‘‘మీ యిష్టం మరి. వేరే వూళ్లో హోటల్లో ఎందుకు అనవసరమైన ఖర్చు కదాని చెప్పా...’’ అంది విశాల నెమ్మదిగా.‘‘నీకు తెలియదు. మీ అమ్మమ్మగారి వూరికి ఎప్పుడైనా వెళ్లవచ్చు. హనీమూన్‌ అంటే ఊటీ, కొడైకెనాల్‌, డార్జిలింగ్‌, కాశ్మీర్‌... అలాటి ప్లేసులుండాలి. అఫీషియల్‌ ఫస్ట్‌నైట్‌ అయిన మర్నాడే ప్రయాణం. నువ్వింక నస పెట్టకు’’ అన్నాడు విఠల్‌ ధాటీగా.‘‘మీ యిష్టం అన్నానుగా...’’అనుకున్నదాన్ని తూచ తప్పకుండా అమలు చేసే మనిషి విఠల్‌. అందుకే శోభనం రాత్రి సరదా కబుర్లతో సరిపెట్టాడు. విశాల కూడా హుషారైన పిల్లే. తనకు తెలిసిన నాన్‌ వెజ్‌ జోక్స్‌ తనూ చెప్పింది. మర్నాడు రైల్లో సరసాలాడితే తనూ తీసిపోనని నిరూపించింది.వచ్చిన చిక్కల్లా ఊటీకి చేరాక వచ్చింది. ఆమె సిగ్గు అతనికి చిర్రెత్తిస్తోంది. గదిలో దీపం వుండడానికి వీల్లేదంటుంది. అతను చదివిన ఏ కథలోనూ ఏ హీరోయిన్‌ పాత్రా యిలా లేదు. చీకటైనా, వెలుతురైనా సరే, గది తలుపు మూయగానే అప్పటిదాకా అందుకే కాచుకుని వున్నట్టు మొగుణ్ని మద్దులతో ముంచెత్తుతుంది. కౌగిలిలో వూపిరి సలపకుండా చేస్తుంది. నిమిషాల్లో వొంటిమీద బట్టలను జారవిడుస్తుంది. క్షణాల్లో భర్తనూ పుట్టినరోజు పాపాయిని చేసేస్తుంది. కానీ విశాల తంతే వేరు. ఎకాంతంలో నైనా సరే పైటయినా జారనీయదు. చేరువగా కూచుంటుంది కానీ ముద్దాడనీయదు.