నావన్నీ పిచ్చిమాటల్లాగా అనిపిస్తున్నాయి కదా నీకు! ఒక్క మాట కూడా అర్థం కాలేదు కదా! ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో! ఎవరైనా అమ్మాయి నీతో ఇలాగే మాట్లాడితే, ఆమెతో పరిచయం పెంచుకోకు... ఆమెను వెంటనే మర్చిపో! కానీ ఆమె నిన్ను మరచిపోలేదు. ఆమె కంటతడి ఎన్నడూ ఆరడమంటూ కూడా ఉండదు.’’‘‘నాతో స్నేహంగా ఉండటమంటే దుఃఖాన్ని పొందడమేనని చెప్పదలుచుకున్నావా నువ్వు?’’‘‘దుఃఖ విషయమని చెప్పలేదు ప్రభూ! చెప్పింది కంటతడి విషయం.’’చాలామంది అదృష్టవంతులకి మల్లే నాకు కూడా ప్రేమ, పెళ్లి విషయాల గురించి ఆలోచించవలసిన అవసరం రాలేదు. కామేశ్వరి పుట్టినవెంటనే మాపెళ్లి ఇంచుమించుగా ఖాయం అయిపోయింది. మేము పెరిగి పెద్దవాళ్లమయిన తర్వాత కూడా ఆ విషయమే తర్కించి, చర్చించవలసిన అవసరం మాకుగానీ, మా పెద్దవాళ్లకిగానీ రాలేదు. కామేశ్వరి తల్లిదండ్రులు మాకు బాగా దగ్గర బంధువులు. అదే ఊర్లో ఉంటున్నవారు కాబట్టి మారెండు కుటుంబాల మధ్య రాకపోకలూ, స్నేహాలూ మాతో బాటే వృద్ధి అవుతూ వచ్చాయి.‘‘ఎంత అనుకున్నదయినా, దగ్గర సంబంధమైనా, మీరు అడగక పోయినా, లాంఛనాలకి లోటు రానిస్తామా, ఒదినగారూ! అన్ని ముచ్చట్లు యథావిధిగా జరిపిస్తాం... మాకు ఉన్నదీ ఒక్కపిల్లేగా!’’‘‘నిజమేలెండి! మాకూ ఒక్క కొడుకేగా! మాకు ఏ సంతోషం కలిగినా, వాడి ద్వారానేగా!’’ఇలాంటి సంభాషణలు మా ఇంట్లో చల్లని సాయంత్రాల్లో జరిగి అందరి మనసులనీ ఎంతో ఆనందపూరితం చేసేవి.

నాకు కూడా కామేశ్వరి అంటే ప్రత్యేకమైన ఇష్టం లేకపోయినా, చిన్నప్పటినుంచీ, ‘ ఆమె నా ఆస్తి’ అన్న అభిప్రాయం నాలో బలపడి, అందుకు విరుద్ధంగా భావనలు చేయాల్సిన అవసరం, ఆసక్తి కూడా లేకుండాపోయాయి.అయితే ‘ప్రేమ, ప్రేమించటం’ లాంటి పదాలు ఈ కళాత్మక జగత్తులో ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి కాబట్టి ఆ స్పందనలు లేని జీవితం పరిపూర్ణంగాక లోపభూయిష్టంగా ఉంటుందేమోనన్న శంక కలిగి, నేను కాలేజీలో చదువుతున్నపడు కామేశ్వరికి ప్రేమలేఖ రాసాను. ఆ ఉత్తరాన్ని నేను స్వయంగా ఏ అనుభూతి లేకుండా, ఇతరుల అనుభవాలనీ, ప్రేమగ్రస్థ హృదయ వాంఛలనీ ఆధారం చేసుకుని రాసాను. ‘ ఐలవ్‌యూ’ అన్నమాటలని చాలా నిర్దయగా, అస్తవ్యస్తంగా ఉపయోగించినట్లు గుర్తు. కామేశ్వరి దగ్గరనుంచి వెంటనే సమాధానం వచ్చింది.‘‘ఈవేళ కనకాంబరం రంగు పట్టుపరికిణీ కుట్టించుకున్నాను. టైలర్‌ కూలీతో కలిపి చాలా ఖర్చయింది. వనజాక్షిగారి సీమంతానికి అదే ధరించి వెళ్లాలనుకుంటున్నాను. మీ పక్కింట్లో డాక్టర్‌గారి అమ్మాయి నిన్ననే పెద్దమనిషయింది. ఏ వేడుకలూ చేయరని అందరూ చెపకుంటున్నారు...’’ ఇలా సాగింది ఆ ఉత్తరం.ఆ ఉత్తరం నన్ను చాలా నిరాశలో ముంచివేసింది. ‘‘ఉత్తరాన్ని కొంచెం సరదాగా, హుషారుగా ఉండేలా రాయలేవూ!’’ మరో ఉత్తరంలో అడిగాను.