ఈ మధ్య ఒకటికి రెండుసార్లు అదే దృశ్యం. ప్రయాణం పొడుగునా కనబడ్తూ నన్ను ఉత్సాహపరుస్తున్నది. తోవవెంబడే గమనిస్తున్నానని కాదు గానీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేచోట, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌పడిన చోట ఆ దృశ్యం నుంచి దృష్టి మళ్లించుకోలేక పోతున్నాను.లారీల నిండా బియ్యం బస్తాలు. ఆ బస్తాలపై టార్పలిన్‌ కప్పినంత మందంగా పరచుకున్న పావురాలు. అయితే టార్పలిన్‌ గట్టిగా తాళ్లువేసి కట్టకపోతే గాలికి కదులుతుందేమోకానీ ఈ పావురాలు అనుక్షణం అలలుగా కదులుతూ ఒకే ఒకపనిలో నిమగ్నమయ్యాయి. తాము నగరం మధ్యన ప్రమాదకరమైన కరెంటు తీగల అంచున జనసమ్మర్దం మధ్యలో ఉన్నామనే ధ్యాసే లేకుండా. కదలాడుతున్న నీలి మబ్బుల్లాగా.ముక్కులతో ఆ బియ్యపు బస్తాలలోంచి ఒక్కొక్క గింజనే పొడుచుకొని తింటూ. ఆ లోడంతా గోడౌన్లకు పోతున్నదో, గోడౌన్ల నుంచి వస్తున్నదో తెలియదు. ఇది నాగపూర్‌-కలకత్తా రహదారి కావచ్చు. అంటే నాగపూర్‌ మీదుగా ఢిల్లీ, కలకత్తా జాతీయ రహదారి కావచ్చు. ఇంత సామూహిక కపోత భోజన ప్రక్రియ ఎంతో దూరం సాగితే ఈ బియ్యం మిగులుతాయా?ఇదేమి జి2 స్పెక్ట్రమ్‌ స్కామా? కూర్చునితింటే గుట్టలు మిగలక పోవడానికి గాలి పోగేసిన గనులా-విరిగిపడిన చెట్టు కొమ్మను నిట్టాడుగా గుడిసె వేసుకునే ఆదివాసీ, కొండగొట్టి పోడు చేసుకునే ఆదివాసి ఎంత అడవిని అదృశ్యం చేయగలడు.

అదేం గ్రీన్‌ హంట్‌ ఆపరేషానా?పావురాలు బియ్యం తిని రాళ్లు ఏరుగుతాయట గదా.ఆ గోడౌవున్లలో మురుగుతున్న బియ్యాన్ని సాధించుకోవడానికి ఆ రాళ్లు అన్నార్తుల చేతుల్లోకి వస్తాయా? అట్లా ఆ పావురాలు ఆ బస్తాలకు ముక్కులతో చిల్లులు చేస్తున్నాయి గదా, ఆ లారీల వెనుక దోసిళ్లు పడితే ఆ బియ్యం ఆకలిగొన్న వాళ్ల చేతుల్లోకి వస్తాయా?ఆ బియ్యం ఆకలిగొన్న వాళ్లకోసమే తరలిపోతున్నాయా-గోడౌన్లలో ముక్కి మురిగిపోవాల్సిందే తప్ప, పందికొక్కులు తినిపోవాల్సిందే తప్ప పేదలకు పంచేది లేదన్నాడు గదా మన ప్రధాని.దారిద్య్రరేఖ దిగువున వున్న వాళ్లు దేబరిస్తే కాదు, ధనరేఖకు ఎంతో ఎగువనున్నా అత్యున్నత న్యాయస్థానం బెదరించినా వినలేదు.పందికొక్కులు తినవచ్చునో కానీ పావురాలు తినవచ్చునా - ఇన్ని ప్రశ్నలు, సందేహాలు ఎందుకంటే.అవి పావురాలు గనుక.పావురం శాంతికి, ప్రేమకు, సాత్వికతకు చిహ్నం.తెలంగాణలో మా వైపు ప్రేమను పావురం అంటాం. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమను కాదు మనుషుల మధ్య ప్రేమను ఎంత పాఁవురస్తురాలో, ఎంత పాఁవురస్తుడో అంటారు.ఎప్పటినుంచి వింటున్నాం. ప్రేమకు, శాంతికి చిహ్నంగా పావురం గురించి. మహాభారతంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు అర్జునునికి కపోతకథ చెప్తాడు - శాంతిపర్వంలో అనుకుంటాను.ప్రేమకుండే గొప్ప విలువ గురించి చెప్పడానికి.