ఈదరగాలి తిప్పిచ్చీ మల్లిచ్చీ కొట్టింది.వాన గుడిలోకి తొంగి చూసింది. జల్లు కొట్టేసరికి దీపాలు ఉలిక్కిపడినాయి. రెపరెపలాడతా కొంచెం ముందుకు జరిగి కుర్చున్నాయి.దిగవింటి దీపం పచ్చనికాలం కత నెత్తుకునింది.

చలిమంట మెల్లమెల్లగా రగులుకొనింది.గుడిసెలమింద, చింతచెట్లమింద, చింతపూతమింద, రాళ్ళమింద, గడ్డిమింద, గడ్డిపువ్వులమింద సుంకు రాలినట్టు మంచు కురస్తా వుండాది.చెట్లు కదలడం లేదు. ఆకులు కదలడం లేదు. ఆకుల్లో దాగిన పువ్వులు కదలడం లేదు.కొమ్మలమింద వొదిగిన కాకులు కదలడం లేదు. మంట సుట్టకారం కుర్చున్న ముసలి వాళ్ళలోన కదలిక లేదు. చెందమామ వెన్నెల అంతా గడ్డకట్టకపొయింది.మంటొక్కటే కదలతా వుండాది. చిటపటమని నాలికలు కోస్తా వుండాది.‘‘ఎందుకట్టా దిగులుగా కుర్చోనుండారు? మీ కడుపు మంటను గదా నేను. నాతో చెప్పగూడదా! మిమ్మల్ని చూస్తావుంటే నాకు దిగులుగా వుండాది’’ చిన్నవ్వకల్లా వంగి అనింది చలిమంట.‘‘నోరు మూసుకోని వుండు సాలుగాని! మా కండ్లల్లో మండతా వుండావు. మా కడుపులో మండతా వుండావు. కండ్లముందర మండతా వుండావు. మమ్మల్ని కాల్చకతింటా వుండేది సాలదా! ఏ జన్మలో ఏం పాపం చేసినామో, ఆ దేవుడు తొటిమరాలే కాలంలో ఒంటరిగా బతకమని శపించినాడు. దేవుడా! మా గుప్పెడు పాణాలను తోడేసి తీసకపో. నీకు పున్నెముంటుంది’’.‘‘రెక్కల కింద దాచుకుని పిల్లోల్లను సాక్కున్నేను. కరువు పిల్లోల్లను గెద్ద తన్నకపొయినట్టు తన్నకపొయింది’’ అని మంటని తిట్టుకుంటా కండ్ల నీళ్ళుపెట్టుకుని కొంచెం వెనక్కి జరిగి పుల్లల్ని ఎగదోసింది.

చిటపటమని మిణగరలు ఎగిరినాయి.‘‘గొర్రెల తాతా... చిన్నవ్వ కోపంగా వుండాది. నువ్వన్నా చెప... ఎందుకు మీకు ఈ దిగులు? ఎందుకిట్టా పుల్లపుల్లగా ఎగదోసి నన్ను మండిస్తారు?’’ గొర్రెల తాతని కదిలించి చూసింది చలిమంట.గొర్రెలతాత ఉలకలేదు. పలకలేదు.నాలుగు మిణగరలు ఎగిరి పంచెమింద పడినాయి. ఉలిక్కిపడి పంచె ఇదిలించినాడు.‘‘ఏమీ మంటకు పొయ్యేకాలం? మిణగరలు కక్కతా వుండాది. మేడిపట్టిన చేతుల్ని కరువు మేసేసింది. ముష్టిమడకని చెదులు మేస్తా వుండాది. పాలకొండల్ని అగ్గిమేసేసింది. కన్నపేగుని నువ్వు కాలస్తా వుండావు. సాలదా? పంచెకంటుకుని నన్నుగూడా కాల్చకతింటావా, ఏంది?’’ అని. పుల్లల్ని ఎగదోసి మంటని కొంచెం వెనక్కి తోసినాడు.