కళ్ళుతెరవగానే అలవాటుగా కిటికీలోంచి చూశాడు రాజు. పలుచగాపరుచుకున్న చెట్టు కొమ్మల్లోంచి, రోజూకంటే ఆప్యాయంగాసూర్యుడు శుభోదయం చెప్తున్నాడు.ఆ ప్రభాత వేళల్లో దినకరుడ్ని చూస్తుంటే గుండె కొంచెం తియ్యగా, కొంచెం బాధగా మూలిగింది. అసూయగా అనిపించింది. తన వాళ్ళందర్నీ వేరే కిటికీలోంచి రోజూ చూస్తున్నాడు కదా! టైమ్‌ చూశాడు.. ఏడున్నర.. వాళ్ళుండే చోట ఎప్పుడో తెల్లారి పోయుంటుంది... అంటే తప్పకుండా వాళ్ళని పలుకరించే ఉంటాడు.బద్ధకంగా పక్కకి తిరిగి బాల భానుడ్నే చూస్తూ ఉండిపోయాడు.ఇంకెంత.. రెండురోజుల్లో వాళ్ళని కలవబోతున్నాడు.‘రేపు కాదుకానీ.. ఎల్లుండి పొద్దున్నే, ఇప్పటికంటే.. ఇంకా చాలాముందే.. చిట్టిగాడు మెడమీద వేళ్ళాడుతుంటే.. బుజ్జి ఒళ్ళో కూర్చుని, నా మొహంలోకి చూస్తూ కబుర్లు చెప్తుంటే.. నా స్వంత ఇంట్లోంచి, కమ్మటి ఫిల్టర్‌ కాఫీ తాగుతూ నిన్ను పలుకరిస్తా.’ అలాగా అన్నట్లు చూస్తూ ఎరుపు రంగు వదిలేసి.. పసుపుపచ్చని రంగులోకి మారిపోయాడు దివాకరుడు.. రాజుని ఉత్సాహపరుస్తూ!ఒక్క సారిగా పది తేనె పిచ్చుకలు తుప్పల మధ్యలో ఉన్న దిగుడుబావిలోంచి చప్పుడు చేసుకుంటూ లేచి, అతివేగంగా ఆకాశంలోకి ఎగిరాయి.రాజు వాటికి టాటా చెప్పి మంచం మీంచి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. 

తనుకూడా ఆ పక్షుల్లాగే బయల్దేరాలి.. పడుక్కుంటే ఎలాగా?రాజు, ఆఫ్రికా ఖండంలో బోట్స్‌వానా లో మైనింగ్‌ ఇంజనీర్‌. డిబీర్‌ కంపనీ వాళ్ళ డెబ్‌స్వానా వజ్రపు గనుల్లో, అతని ప్రతిభ గురించి విని పిలిచి ఉద్యోగం ఇచ్చారు.ఆ దేశ రాజధాని గాబరోన్‌కి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వానెంగ్‌ గనుల్లో ఉద్యోగం. అక్కడే కంపనీ వారిచ్చిన గెస్ట్‌హౌస్‌లో నివాసం. ముందంతా లాన్లు, క్రోటన్లు, పూలమొక్కలు ఉన్నా... రాజు గదికి వెనుక అంతా అడివిలా ఉంటుంది. అందులో రకరకాల చెట్లు తుప్పలు అడ్డదిడ్డంగా పెరిగున్నాయి. అక్కడే చిన్న రావిచెట్టులాంటి చెట్లు, వాటికింద ఒక దిగుడుబావి.. సహజంగా ఉంటుందని అలాగే వదిలేసినట్లున్నారు.ఆ దిగుడుబావిలోనే తేనె పక్షుల నివాసం. సన్నగా అల్లిన పొడుగు బుట్టల్లాంటిగూళ్ళు... ఆ గూళ్ళు చూస్తుంటే రాజుకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. దట్టంగా.. మధ్య మధ్య సందులతో ఎంతో అందంగా ఉంటాయి. ఆడ, మొగ పక్షులూ రెండూ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ.. అల్లేస్తాయి. ఎంతో అందంగా ఉన్న ఆగూళ్ళు ఎండ రాకుండా.. గాలితగిలేలా.. లోపల చల్లగా ఉంచుతాయి.. ఏసీ ఎందుకూ పనికి రాదు.పొద్దున్నే చుట్టుప్రక్కల ఉన్న ముంగిసల్ని తేనెపట్ల దగ్గరికి తమ అరుపుల్తో తీసుకెళ్ళి, అవి ఖాళీ చేశాక మిగిలిన పట్లనించి నోటినిండా తేనె నింపుకుంటాయి. కొన్ని రకాల పక్షులు అత్యంత వేగంతో లేచి, పూలమీద వాల్తాయి.. పువ్వులకి ఏమాత్రం దెబ్బ తగలకుండా, తేనె సేకరిస్తాయి. తేనె తాగేసి గూటికొచ్చి కిచకిచలాడ్తూ గూట్లోకీ చెట్లమీదికి విహరిస్తుంటాయి.