‘‘ఒరే గోపాలం! నీ కోరిక మరీ చోద్యంగా ఉందిరా.. నువ్విలా పిచ్చిపిచ్చి కోరికలు కోరావంటే ఈ జన్మకి పెళ్ళికాక ఒంటికాయ శొంఠికొమ్ములా ఊరేగాల్సొస్తుంది’’ అంది బామ్మ.‘‘అంత పిచ్చిపిచ్చి కోరికలు నేనేం కోరానే?’’ ఆశ్చర్యంగా అడిగాడు గోపాలం.గోపాలానికి ప్రాచీన తెలుగు సాహిత్యమంటే ఇష్టం. అందునా నంది తిమ్మన వ్రాసిన ‘పారిజాతాపహరణం’ కావ్యమంటే మరీ ఇష్టం. ఆ కావ్యంలో తిమ్మన సత్యభామ ఏడుపును వర్ణించిన ‘‘... ఏడ్చె లతాంగి పాల పల్లవ గ్రాస కషాయకంఠ కలకంఠ వధూ కలకాకలీధ్వనిన్‌...’’ (ఆమె ఏడుపు లేత చివుళ్ళు మెక్కిన కోయిల కూజతంలా ధ్వనించిందట!) అన్న పద్యం ఇంకా ఇష్టం.ఎంత ఇష్టమంటే తను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సత్యభామ అనే పేరున్న అమ్మాయినే చేసుకోవాలనీ, ఆ అమ్మాయి నంది తిమ్మన తన కావ్యంలో వర్ణించినంత అందంగా, ముద్దుముద్దుగా ఏడవగలిగినదయ్యుండాలనీ భీష్మించుకున్నాడు.ఏడవడమనేది బాధను వ్యక్తపరిచే ఒక సాధనమనీ, ఎపడు పడితే అపడు ఏడ్చెయ్యడం సాధ్యంకాదనీ తర్కం తోచనంతగా... ఆ పద్యాన్ని ప్రేమించాడతను!కానీ ఈ వ్యవహారం బామ్మకి సుతరామూ నచ్చలేదు. ‘‘సత్యభామ అనే పేరున్న అమ్మాయే కావాలంటున్నావ్‌, సరే... అంతవరకూ పర్లేదు. ఆ అమ్మాయి అదేదో కావ్యంలో లాగే ఏడవాలంటావేమిటి? పెళ్ళిచూపులపడు అమ్మా... కొంచెం నడిచి చూపించు, పాడి చూపించు అన్నట్లుగానే కొంచెం ఏడ్చి చూపించు అని కూడా అడగాల్నా? అలా అడిగితే చెపచ్చుకు వెంటపడరుట్రా ఆడపెళ్ళివాళ్ళు?’’బామ్మ మాటలతో గోపాలం కొంచెం ఆలోచనలో పడ్డాడు. 

నిజంగానే ఒంటికాయ శొంఠికొమ్ములా మిగిలిపోతానేమోనని భయపడ్డాడు.‘‘సరే... నీ ఇష్టమొచ్చినట్లు చెయ్యవే. అయితే అమ్మాయి పేరు మాత్రం సత్యభామే అయి వుండాలి. కావ్య నాయికలా మనోహరంగా ఉండాలి. తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి వుండాలి’’ అన్నాడు.ఇక బామ్మ పెళ్ళి ప్రయత్నాల్లో పడింది. చూడగా చూడగా తమ బంధుత్వంలోనే ఒకమ్మాయి బాగా నచ్చింది. అమ్మాయి పేరు ‘సత్య’. ‘భామ’ అనే రెండు అక్షరాల్నీ బామ్మే తగిలించేసింది. నిజంగానే కావ్యనాయికలా ఉన్న సత్య గోపాలానికీ నచ్చింది. ఒక్కసారి ఏడ్చి చూపించమంటే బావుంటుందేమోననిపించినా బామ్మ చేసిన హితోపదేశం గుర్తొచ్చి వనంగా ఉన్నాడు.్‌్‌్‌శోభనం. అందానికే అందంలా సత్య పాలగ్లాసుతో గదిలోకొచ్చింది. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు గోపాలం. అతను పలకరిస్తాడేమోనని కాసేపు చూసి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంది.గోపాలం మనసులో ఒక్కటే కోరిక మెల్లమెల్లగా పెద్దదవుతోంది. ‘ఏడిస్తే బావుణ్ణు... పాల పల్లవగ్రాస కషాయకంఠ కలకంఠ వధూకలకాకలీధ్వనిన్‌... అన్నట్లు ముద్దుగా, ముద్దుముద్దుగా ఆమె ఏడిస్తే బావుణ్ణు!’హృదయం మాత్రమే పనిచేసి మెదడు పనిచేయనిచోట తర్కానికి స్థానం ఉండదేమో!!