నా పెళ్లికి రబీంద్రనాథ్‌ టెగోర్‌ గారొచ్చారు’.‘అవునా? మీపెళ్లి ఎప్పుడు జరిగింది?’‘అదా? బహుశా... పందొమ్మిది వందల అరవై ఆ ప్రాంతాలలో... బాగా గుర్తు రాలేదు. అప్పుడే పెద్దగాలి వాన కూడా వచ్చి దేశమంతా అల్లకల్లోలమై పోయింది.‘ఆయన్ని అందరూ టాగూర్‌ అంటారు...’ అన్నారెవరో.‘అది తప్పు. టెగోర్‌ అనే అనాలి. ఆచంట జానకిరామ్‌ కూడా అలాగే అనేవాడు..’‘ఆయనెవరు?’‘ఆయన ప్రసిద్ధ వయోలిన్‌ విద్వాంసుడు. నా పెళ్లికి ఆయన కచేరీ కూడా చేశాడు.’ఇట్లా సాగుతున్నది వరండాలో వ్యవహారం...నేను బట్టలు వేసుకుని తయారై వచ్చి ‘నాన్నా నువ్వు లోపలికి పో... మళ్లీ కాఫీ యిస్తుందిట ఈశ్వరి’ అన్నాను.‘అలాగా? వీళ్లతో మాట్లాడుతూ కాఫీ మాటే మరిచిపోయాను’ అంటూ వారివంక తిరిగి ‘సాయంత్రం మాట్లాడదాం. మళ్లీ...’ అంటూ ఆయనలోపలికి వెళ్లాడు.వాళ్లు నా క్లయింట్స్‌... నన్ను చూసి అందరూ లేచి నిలబడ్డారు.నేను మౌనంగా వెళ్లి కూర్చున్నాను. గుమస్తా రంగాచారి, అతని అసిస్టెంట్‌ సుబ్బరత్నం గారూ చేతులలో కోర్టు దస్త్రాలతో నా పక్కకు వచ్చి నిలబడ్డారు.మా నాన్న ఒక వెర్రిబాగులవాడు. వయస్సుకు తోడు చిత్తచాంచల్యం... ఊరికే అస్తవ్యస్తంగా వాగుతూ ఉంటాడు. ఆయనను మాటల్లో పెట్టి వాగించి వినోదిస్తారు కొందరు.ఇప్పుడు నా మనసంతా మహా చిరాకుగా ఉంది. అసహ్యంగాను ఉంది.ఎదురుగా ముందు కనిపించిన వాడు కోదండరామం... లావుగా పొట్టిగా బొద్దుగా ఉంటాడు. మూతిమీద రెండు బొద్దింకల లాగా ఉంటాయి మీసాలు. 

అసహ్యంగా.. పొట్ట కిందికి జారిపోయి ఉంటుంది ప్యాంటు.. చేతులు కలిపి దణ్ణం పెట్టాడు.వీడిది సొంత గొడవకాదు. వీడి కొడుకు ఎవడి దగ్గరో అప్పుచేసి ఎగ్గొట్టి పైగా వాడు బాకీ తీర్చమని అడిగాడని వాడి కాళ్లు విరగగొట్టి జైలు పాలయినాడు. జైల్లో కూడా పక్కఖైదీలతో లేని పోని గొడవలు పెట్టుకుని వాళ్లను నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. వాణ్ణి బైటికి తీసుకు రావాలి. దానికి ఎంత ఖర్చయినా ఫరవాలేదు. లక్షలు గుమ్మరించడానికి కూడా అతను సిద్ధం.రంగాచారికి ఫైలు తిరిగి ఇస్తూ ‘వాయిదా అడిగించు’ అన్నాను.‘అయ్యా! అయ్యా! అట్లా అనకండయ్యా... వాడు కనబడకపోతే మా ఆడది మంచం పట్టిందయ్యా...’ అంటున్నాడతడు.‘మీరు తర్వాత కనిపించండి’ అంటూ తర్వాత కట్ట అందుకున్నాను. వీరప్ప కథ అది... అదొక ప్రత్యేక తరహాకథ... వాడు ఎక్కడెక్కడికో వెళ్లిపోయి ఎక్కడో ఒకచోట హైవేమీద లోడుతో వెళ్లే లారీలను ఆపి ఆ డ్రైవరు క్లీనర్లను రకరకాలుగా బతిమాలి ఎక్కి బాగా అనువైన వేళ అనువైన చోట వారి మీద దాడి చేస్తాడు. వారిని బాగా గాయపరిచిగాని, తప్పనిసరి అయితే ప్రాణాలు తీసి గాని లారీని తన శిష్యుడి సాయంతో లోబరుచుకుని లారీలోని లోడ్‌ను దూరంగా ఎక్కడో అమ్మేసి లారీని ఏ నిర్జన ప్రదేశంలోనే వొదిలేసి మహా అమాయకుడిలా క్షేత్రాలు సందర్శించి వొచ్చిన వాడిలా ఇంటికి చేరుకుంటాడు. ఆ మహాదగా కోరు హంతకుడి కొడుకు నా ఎదురుగా నిలబడ్డాడు.