ఎవరో తలుపు తట్టారు. లుంగీ సర్దుకుంటూ తలుపు తెరిచాడు సుగుణారావు.పేపర్‌ కుర్రాడు.ఏమిటన్నట్టు చూశాడు సుగుణారావు.‘‘మీ మేడమీద వాటాలో అద్దెకున్న మేడం మీ దగ్గర న్యూస్‌ పేపర్‌ బిల్లు అడిగి తీసుకోమన్నారండి!’’ అన్నాడతను.సుగుణారావు ఆశ్చర్యంగా చూసి ‘‘నువ్వు సరిగ్గా విన్నావా!’’ అన్నాడు.‘‘మీ పేరు సుగుణారావే కదండీ ఆమె మీ పేరే చెప్పారు!’’‘‘అవును. నా కామె పేరే తెలియదే....!’’‘‘విచిత్రంగా వుందే! ఆమె నాకు ఆ సంగతి చెప్పాలి కదా!’’‘‘మీకు చెప్పలేదన్న సంగతి కూడా నాకు చెప్పారండి! మీకు తర్వాత ఇచ్చేస్తానని చెప్పమన్నారండి!’’‘‘ఇప్పుడు లేదా ఆవిడ?’’అతడొక రకంగా చూసి, ‘‘ఉంటే సమస్యే లేదండి!’’ అంటూ మాటలో కూడా విరుపు ప్రదర్శించాడు.సుగుణారావు చురుకుగా చూశాడు. ఇదెక్కడి తంటా! ఇస్తే ఒకటి! ఇవ్వకపోతే ఒకటి! పేపరు కుర్రాడ్ని చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ప్రిస్టేజ్‌, మొహమాటం, ఆడదీ వంటి అంశాలతో అతడు తన మీద అకారణంగా ముప్పేటదాడికి తెగబడ్డాడు.ఇంతకీ పైనున్న ఇల్లాలు ఎవరో తనకి తెలిస్తే బాగుండును!‘‘బిల్లు చెల్లించను! ఆమె స్వయంగా చెబితే ఆ ముచ్చటే వేరు!’’పేపరు కుర్రాడు అతడ్ని ఎగా దిగా చూసి, ఆ చూపులో కోరతనం కాస్త మిళాయించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.ఆదివారం పూట తనకు సెలవు దినం కావడంతో ‘అమ్మడి’ కోసం కాపు కాశాడు సుగుణారావు.మధ్యాహ్నం ఒంటిగంటకు నిద్రలేచింది నందిని. అప్పటికే సుగుణారావు ఆమె కోసం నాలుగైదు సార్లు వచ్చి చూసుకుని వెళ్ళాడు. ఒంటి గంట వరకూ తనను పలకరించవద్దని పలక ఒకటి తన గుమ్మానికి తగిలించింది.

 ఆమె తీరును తన మనస్సులోనే అభినందించాడు సుగుణారావు.సరిగ్గా ఒంటిగంటకు ఆమె గుమ్మంలో నిలబడిన సుగుణారావు అప్పుడే తలుపు తెరిచిన నందిని స్నేహ పూర్వకంగా పలకరించింది. కొద్దిగా మాసిన పంజాబీ డ్రెస్‌లో వుంది నందిని.‘‘క్రింది వాటా సుగుణారావుగారు కదా!’’ అంది నందిని.‘‘నేనెలా తెలుసు మీకు!’’ అడిగాడతడు.‘‘మన ప్రపంచం చాలా చిన్నది. అందువల్ల-’’ నవ్వింది నందిని.‘‘నాకు మాత్రం ఇది పెద్ద ప్రపంచమే!’’‘‘క్షమించవలసిన తప్పే!’’సుగుణారావు చురుకుగా చూసి ‘‘పేపరు బిల్లు నన్నెందుకు చెల్లించమన్నారు!’’ అన్నాడు.ఆమె నవ్వుతూ చూసి గుమ్మానికి అడ్డుతప్పుకుంది. అంతే తప్ప జవాబు చెప్పలేదు.‘‘ప్చ్‌. వదిలిపెట్టండి. కూర్చోండి. మజ్జిగ తాగుదురుగానీ!’’ అందామె.అతడు గుమ్మం దాటుతూ ‘‘చొరవ ఎక్కువే!’’ అంటూ కుర్చీలో వాలాడు.‘‘ఆ మాత్రం లేకపోతే కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం ఎలా చెయ్యగలం!’’ అందామె మజ్జిగ కలుపుతూ. తర్వాత సంభాషణ సొంత వివరాల మీదికి మళ్ళింది.ఆమె నిమ్మరసం కలిపి మజ్జిగ గ్లాసందించింది. తానొకటి అందుకుంది.‘‘వండుకుంటారా!’’ అడిగింది నందిని.‘‘బుద్ధి పుడితే!’’అలా కబుర్లు అరగంటపాటు సాగాయి.