తుని రైల్వే స్టేషను.. ప్లాట్‌ ఫాం నెంబరు ఒకటి. సమయం సాయంత్రం ఆరుగంటలు కావొస్తోంది. అప్పుడే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వెళ్ళడంతో ప్లాట్‌ఫాం అంతా ఖాళీగా ఉంది. మరలా గోదావరి వచ్చేంతవరకు ఆ ప్లాట్‌ఫాం మీద సందడి ఉండదు. వేసవికాలం కావడంతో సాయంత్రపు నీరెండలో వాతావరణం అంతా చాలా గమ్మత్తుగా ఉంది. ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్ళకు చేరుతున్నాయి. కొన్ని పక్షులు అక్కడ ఖాళీగా ఉన్న సిమెంటు బెంచీల మీద వాలి, సమయం చూసి ట్రాకుమీది పదార్థాలను ముక్కున కరుచుకుని తిరిగి బెంచీమీద వాలి తింటుంటే, కొన్ని పక్షులు మాత్రం దొరికిన ఆహారాన్ని తీసుకుని పైకి ఎగిరిపోతున్నాయి. ప్లాట్‌ ఫాం చివరివరకూ నడుచుకుని వచ్చిన శంకరం అక్కడే ఉన్న ఓ బెంచీ మీద మెల్లగా కూర్చోవడంతో అంతవరకు ఆ బెంచీమీద వాలిన పక్షులు ఒక్కసారిగా తుర్రుమని పైకి ఎగిరిపోయాయి. ఎండలో కాలిన ఆ బెంచీ ఇంకా వేడిగానే ఉంది. అలా కూర్చున్న శంకరం తనలాగే అక్కడి మిగతా బెంచీల మీద కూర్చున్న తోటి రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ని చూసి పలకరింపుగా నవ్వాడు.శంకరం ఓ మూడు నెలల క్రితమే, తుని రైల్వే స్టేషను మాష్టారుగా చేసి రిటైరు అయ్యాడు. ఆయనకు ఆ ప్లాట్‌ఫాం మీది ప్రతి అంగుళంతోటి పరిచయముంది. రిటైరు అయిన కొత్తలో అదే ప్లాట్‌ఫాం మీదకు చిన్న నాటి మిత్రుడు రామారావుతో మొదటిసారిగా వచ్చినప్పుడు ఏదోలా అనిపించింది. 

ఇంతకాలం తాను పనిచేసిన ఈ ప్లాట్‌ఫారమే తనకు రిటైరు అయిన తరువాత సాయంత్రవేళల్లో ఇలా కాలక్షేపానికి పనికివస్తుందని ఏనాడూ అనుకోలేదు. తనకంటే ఓ రెణ్ణెళ్ళ ముందు తుని జూనియరు కాలేజీ ప్రిన్సిపల్‌గా చేసి రిటైరు అయిన రామారావు ఓ రోజున ‘‘ఒరేయ్‌ శంకరం, సాయంత్రం పూట ఇంట్లో ఉండి ఏం చేస్తావు. హాయిగా నాతో అలా స్టేషను వరకు రాకూడదా, అక్కడ మనలాగే రిటైరైన వారు చాలామంది వస్తారు, వారిని నీకు పరిచయం చేస్తాను. పైగా నీకు దీనివల్ల కొంచెం వాకింగూ ఉంటుంది, అలాగే వారితో సరదాగా పిచ్చాపాటీ మాట్లాడుకోవచ్చును’’ అని చెప్పడంతో అతనితో పాటుగా ఆ ప్లాట్‌ఫాం మీదకు వచ్చాడు శంకరం. అప్పటికే అక్కడ చాలామంది వయసు మళ్ళిన వాళ్ళు బెంచీల మీద కూర్చుని నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో రాజకీయాలు, ఆటలు ఒకటేమిటి రకరకాల విషయాలు దొర్లుతున్నాయి. ఇన్నాళ్ళ తన వుద్యోగంలో రోజూ వాళ్ళని చూస్తూనే ఉండేవాడు, అయితే ఏనాడూ వాళ్ళ గురించి పట్టించుకోలేదు. అలాగే తాను కూడా ఓ రోజు ఇలా వాళ్ళతో బాటు కూర్చుంటాననీ అనుకోలేదు. ఆలోచిస్తున్న శంకరానికి మిత్రుడు రామారావు రావడంతో తన ఆలోచనలకు స్వస్తి పలికి అతనికేసి చిరునవ్వుతో చూసాడు.