‘‘నాలుగురోజులు ముందుగా రమ్మంటే’’... ముహూర్తం వేళకా రావటం....’’ నా రెండుచేతుల్నీ పట్టుకుని ఆప్యాయంగా కోప్పడ్డాడు పట్టాభి.‘‘ముందుగా రావాలనటం... అప్పుడే వెళ్తారా అనటం... ఇవన్నీ ఆనవాయితీగా మాట వరసకేనని అందరికీ తెలిసిన సంగతేగా! ఈ రోజుల్నిబట్టి వేళకివచ్చి... పెళ్ళిఅవగానే వెళ్ళిపోవటమే తెలివిగా ఉంటుంది! నువ్వు పెళ్ళి ఏర్పాట్లు ఇలా చేస్తున్నావని తెలిస్తే మాత్రం తప్పకుండా నాలుగురోజుల ముందే వచ్చేసేవాడిని. ఈ తాటాకుల పందిళ్ళేమిటి... మామిడాకుల, బంతిపూల తోరణాలేమిటి... అలికిన నేలంతా ముగ్గులు... మన చిన్నతనం రోజుల్లో పెళ్ళివారిల్లు ఎలా ఉండేదో మళ్ళీ కళ్ళకు కట్టినట్లుగా చూపించావు కదరా... కొబ్బరాకులు చుట్టిన స్తంభాల చుట్టూ ఆటలాడుతున్న పిల్లల్ని చూస్తుంటే... మనసు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి... వాళ్ళలా పరుగులు పెట్టాలన్నంత హుషారు నాకు వచ్చేసిందనుకో...’’ ఆనందంగా అన్నాను.నా మాటలకు నవ్వుతూ ‘‘ఇప్పుడు మాత్రం ఏమయిందీ... నాలుగు రోజుల తర్వాతే వెళ్ళు. మనం కలుసుకుని కూడా చాలానాళ్ళయింది... ఇద్దరం సరదాగా గడిపినట్లుంటుంది. ఏమంటావ్‌?’’ అని మళ్ళీ నవ్వుతూ ‘‘మాట వరసకి మాత్రం కాదు.. నిజంగానే చెబుతున్నాను...’’ అన్నాడు.‘‘అది నాకు మాత్రం తెలియదా...’’ అంటూ నేనూ నవ్వాను. ‘‘నువ్వు ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఇష్టమైనన్ని రోజులు ఉండే స్వతంత్రం నాకుంది! కాకపోతే పెళ్ళయి... పెళ్ళికూతురు వెళ్ళాక... సర్దుకునే పనులే తప్ప సందడేం ఉంటుంది! అది సరేగానీ, ఎంత పల్లెటూరులో అయినా షామియానాలే తప్ప పందిరి కనుపించడం లేదు.

 ఇంతంత పందిళ్ళు వేయించావ్‌... ఎలా వీలయిందిరా...?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘అమ్మాయి పెళ్ళి అట్టహాసంగా కాదు గానీ... మునుపటి రోజుల్లోలా.... బంధుమిత్రులందరం కలిసి ఓ వారంరోజుల పాటు సరదాగా గడిపేట్లుగా జరగాలని ఉందని తమ్ముళ్ళతో ఓ మాట అన్నానంతే... నా కోరిక తీర్చే బాధ్యత వాళ్ళిద్దరూ తీసేసుకున్నారు. నెలరోజుల ముందే సెలవుపెట్టేసి వచ్చేశారు. పిల్లలు మాత్రం నాలుగురోజుల క్రిందే వచ్చారనుకో. ఓ వారంరోజుల నుండీ...పెళ్ళికూతుర్ని చేయటం... అదనీ... ఇదనీ... ఏదో వేడుకపేరు చెప్పి ఊళ్ళో వున్న బంధువులు, పని వాళ్ళు కలిసి రోజుకి వంద విస్తళ్లు లేస్తున్నాయి. ఈ పనులన్నీ తమ్ముళ్ళే చక్కబెడుతున్నారు. నేను మాత్రం పైపైన తిరుగుతున్నానంతే! ఊళ్ళో చుట్టాలందరూ కూడా పనుల్లో తలో చెయ్యి వేస్తున్నారు... సందడేగానీ శ్రమేం లేదు. చుట్టాల అందరిళ్ళవద్దనుండి పాలు, పెరుగు కూరగాయలు వచ్చి పడుతున్నాయి!’’ అంటూ అప్పుడే అటుగా వచ్చిన లక్ష్మణ్‌కి నీ వసతి ఏర్పాట్లు చూడమని పురమాయించాడు.