‘‘శాండిల్యా ఒక్కసారి కారు ఆపమ్మా?’’‘‘ఏమయింది ప్రవల్లికా’’ కారు ఆపుతూ అడిగాడు శాండిల్య.హిందూపురం వెళ్తున్న దారిలో సడన్‌గా కారు ఆపమంది, ఏమయుందో అర్థం కాలేదు.సిటీలో పెరిగి అమెరికాలో సెటిలైన శాండిల్యకి, అతడి తల్లి శారద స్నేహితురాలు ప్రియంవద అత్త కూతురుతో పెళ్ళి నిశ్చయమైంది.‘‘ఇన్నాళ్ళూ చదువూ, ఉద్యోగమంటూ అమెరికాలోనే ఉండిపోయినా, లివింగ్‌ టుగెదర్‌ అంటూ నా నెత్తిమీదకి ఎవరినీ తేకుండా, నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకుంటానమ్మా అన్నాడు నా కొడుకు. నీ కూతురికన్నా సరిఅయిన జోడెవరే నా కొడుకుకి ప్రియంవదా?’’ శాండిల్య తల్లి ప్రియంవద చేతిలో చేయి వేసి మరీ అంది. అయిదు పదులకు దగ్గిర పడుతున్నా చెక్కు చెదరని చందనపు బొమ్మలా ఉండే ప్రియంవద, ఎంతో హుందాగా మౌనంగా ఉండే మూర్తిగారు, ఎం.ఏ సోషియాలజీ చేసి లెక్చరర్‌గా చేస్తూ, తన తల్లిని చూడగానే చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ, శారదత్తా ఎప్పుడొచ్చావు. నేనడిగినవి తెచ్చారా’ అంటూ, తల్లినీ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రవల్లిక. 

ఆ కుటుంబాన్ని చూశాక, తన తల్లి ఛాయిస్‌ పరఫెక్ట్‌ అని మనసులోనే తృప్తి చెందాడు శాండిల్య.కాలుష్యానికి దూరంగా, కాంక్రీటు జంగిల్‌ని వదిలి, పచ్చని పైర్లు, పిల్ల తెమ్మెరలు, పూలతోటల మధ్య కారు ప్రయాణం. ప్రవల్లికతో వాళ్ళ ఊరికి వెళుతున్నాడు శాండిల్య. తోటలు, పొలాల్లో రకరకాల దిష్టిబొమ్మలు, గడ్డివాములు, గుంపులుగా మేకలు, గొర్రెలు, గేదెలు, అరకలు, గోధూళిలోని ఒక రకమైన పరిమళం, జల్లులకు తడుస్తున్న నేల పరిమళం, పారే సెలయేర్లు, పిల్లవాగులు, కారులో ఏ.సీ ఆఫ్‌ చేయించి విండో కిందికి దింపి చుట్టు పక్కలకు చూస్తూ పరవశించిపోతోంది ప్రవల్లిక.

కసేపు ముక్కు మూసుకుంటూ, కాస్సేపు తుమ్ముతూ, ఇంకాసేపు కారుకి అడ్డంగా రోడ్డుపై మందలుగా వెళుతున్న గేదెల్ని చూస్తూ చిరాకు పడుతున్న శాండిల్య వంక చూస్తోంది ప్రవల్లిక తేగలు కాల్పిస్తూ. వాలుజడ ముద్దమందారం, చక్కని వన్నెగల మోము, అంతకు మించిన కళగల కాటుక కళ్ళు, రవ్వల ముక్కుపుడక, స్వచ్ఛంగా మెరిసే నవ్వు, ఆగని మాటల హోరు, తీరైన శరీరాకృతి, మాటలకు లయబద్ధంగా కదులుతున్న చెవి బుట్టలు, రెపరెపలాడుతున్న చీరచెంగు, చిన్నప్పటి బాబ్డ్‌ హెయిర్‌ పిల్లేనా ఈ అందాల బొమ్మ అనుకున్నాడు శాండిల్య.