‘ఏంటి సుమా...! ఇంత అర్థరాత్రివేళ ఫోను చేసావు? నిద్దర పట్టడం లేదా?’ కాబోయే శ్రీమతి సుమని నవ్వుతూ అడిగాడు గోపి.‘ఊహూ.... ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్దుర రావడం లేదు. మాటిమాటికి నువ్వే గుర్తొస్తున్నావు. ఎందుకో మనసంతా అదోలా ఉంది’ ముద్దుగా అంది సుమ.‘అది ఈ టైములో సహజమేలే! ఇంకో వారంలో పెళ్ళి కాబోయే అమ్మాయి మనసులోఎన్నెన్నో ఆలోచనలు, మరెన్నో ఊహలు, అలాగే ఏవో లేనిపోని భయాలు ఉంటాయి. అవునా!’ ఆమెను ఆటపట్టిస్తూ అన్నాడు గోపి.‘అబ్బో అబ్బాయిగారికి చాలా తెలుసే...! అవునూ! అత్తయ్యగారూ మావయ్యగారూ ఎక్కడ ఉన్నారు’ అడిగింది సుమ.‘ఎక్కడుంటారు,వాళ్ళ బెడ్రూములో ఉన్నారు. ఏం మాట్లాడతావా..?’ అడిగాడు గోపి.

‘అమ్మో వద్దు... వాళ్ళు మెలుకువగా ఉంటే మనం ఫ్రీగా మాట్లాడుకోలేం కదా. అందుకే అలా అడిగాను’.‘నీకా భయమక్కర్లేదు, వాళ్ళు వాళ్ళ ఆనందంలో ఉండి ఉంటారు’ నవ్వుతూ అన్నాడు గోపి.‘అంటే ’ అమాయకంగా అంది సుమ.‘అంటే ఏముంది, వాళ్ళకి మాత్రం కోరికలు ఉండవా ఏంటీ?’ అన్నాడు గోపి.‘ఛ.... ఊరుకో గోపీ... నువ్వు మరీను! ఇంత వయసొచ్చిన వాళ్ళు ఇంకా ఒకే రూములో పడుకుంటారా?’ ఆశ్చర్యంగా అడిగింది సుమ.‘ఇది మరీ బావుంది సుమా...! అయినా పడుకోవడానికి వయసుతో పనేముంది. వాళ్ళిద్దరూభార్యాభర్తలు అందుకే ఒకే రూములో పడుకున్నారు’ చెప్పాడు గోపి.‘ఏమో బాబూ... అమ్మ నా దగ్గర పడుకుంటే నాన్న వేరే రూములో పడుకుంటారు’ నవ్వుతూ అంది సుమ.‘పాపం మీ అమ్మానాన్నలను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది’ కొంటెగా అన్నాడు గోపి.‘ఏం... ఎందుకట...? వాళ్ళు ఈ వయసులో ఒకచోట పడుకుని మాత్రం ఏం ప్రయోజనం’ అంది సుమ.

‘అంటే ఏంటి నీ ఉద్దేశ్యం! అయినా, వయసు మీరిన వారికి కోరికలు ఉండకూడదన్న రూలేమైనా ఉందా? నువ్వు చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నావు. ఈ టైములో భార్యాభర్తలు ఒక చోటే ఉండాలి, అప్పుడే వాళ్ళు వాళ్ళవాళ్ళ ‘స్వీట్‌ థింగ్స్‌ని’ నెమరు వేసుకుని చక్కగా ఆనం దించే అవకాశం దొరుకుతుంది. ఇంతకాలం పిల్లల్ని పెంచి పెద్దచెయ్యడంలో తల్లితండ్రులు ఎన్నో విషయాల్లో రాజీ పడుతూ తమ కోరికలకు కూడా కళ్ళాలు వేస్తూ ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇప్పుడు బాధ్యత తీరిన తర్వాత వాళ్ళకి దొరికిన ఏకాంతాన్ని ఎంజాయ్‌ చెయ్యాలి. అప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఎంతో బావుంటాయి. నీకో విషయం చెప్పనా సుమా...! భార్యాభర్తల మధ్య అసలైన ప్రేమ లేటు వయసులోనే ప్రారంభమవుతుందట’ ఓ సైకాలజిస్టులా చెప్పాడు గోపి.