‘‘సార్‌! ముకుందరావుగారని.. మునుపు ఇక్కడ పనిచేసి ఇక్కడే రిటైరయ్యారు. వారు మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు. తీసుకురమ్మంటారా?’’ వినయంగా అడిగి ఆఫీసరుగారి స్పందన కోసం చూశాడు బంట్రోతు అప్పారావు.‘‘ఉద్యోగ విరమణ చేసినవారా! ఈ ఆఫీసులోనే?’’ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఆఫీసర్‌ అనంతరావు.

‘‘ఔను సార్‌. మీరు ఇక్కడికి బదిలీ మీద వచ్చేముందే వారు రిటైరయ్యారు. అందుకే వారిని మీరు చూసే అవకాశం లేక పోయింది’’ చనువు తీసుకుని చెప్పాడు బంట్రోతు.‘‘ఓహో! వారిని వెంటనే పంపు’’ అన్నాడు అనంతరావు.నిమిషం గడవకుండానే ముకుంద రావుని ఆ గదిలోకి తీసుకువచ్చాడు అప్పా రావు.‘‘నమస్కారం’’ చెప్పాడు ముకుంద రావు.‘‘నమస్కారం కూర్చోండి’’ అంటూ ఆయనకి కుర్చీ చూపించి, అప్పారావు వైపు తిరిగి ‘‘వీరికొక మంచి కాఫీ తీసుకురా’’ అని చెప్పాడు.ఆ మర్యాదకి ముకుందరావు పొంగిపోయాడు. అధికారాంతము నందు చూడవలె అయ్యగారి గతి... అన్నది తనపట్ల నిజం కాలేదు! కొత్తగా వచ్చిన ఆఫీసరు కుర్రవాడు, చాలా మంచివాడని ఎవరో చెబితే విన్నాడు గానీ, అధికారమూ, మంచితనమూ రెండూ ఒక ఒరలో పొసగని రెండు కత్తులనే అనుకున్నాడు. కానీ ఇప్పుడితను తన పట్ల ప్రదర్శిస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే తనెంత పొరపాటు పడ్డాడో తెలుస్తోంది.

అంతేకాదు. తను వచ్చిన, అసాధ్యమనిపించే పని సాధ్యపడు తుందేమో అనే ఆశావేశమూ కలుగు తోంది.‘‘మీరీ కార్యాలయంలో పనిచేస్తూనే ఉద్యోగవిరమణ చేశారని విన్నాను’’‘‘ఔను’’ అన్నాడు ముకుందరావు.‘‘ఆరోగ్యం బాగానే ఉంటోంది కదా?’’‘‘ఊఁ‘‘‘‘పెన్షను సక్రమంగానూ, సకాలంలోనూ అందుతోందా?’’‘‘నెలనెలా ఒకటో తారీకున ఠంచనుగా అందుతోంది పెన్షను’’ గొణుగుతున్నట్లు చెప్పాడు.ఇక అడగవలసిన కుశల ప్రశ్నలేమీ లేనట్లు - ‘‘మీరేం పనిమీద దయ చేశారు? పూర్వ ఉద్యోగి అయిన మీకు మేం ఎలాంటి సహాయం, సేవ చెయ్యగలం?’’ మర్యాదగా అడిగాడు అనంతరావు.ఆఫీసరు కుర్చీవెనుక గోడమీద మహాత్మాగాంధీ ఫొటో వైపు చూస్తూ కొన్ని క్షణాలపాటు మౌనంగా ఉండిపోయాడు. కానీ ముకుందరావు మాత్రం తాను వచ్చిన పని గురించి చెప్పాలా, వద్దా అని తర్జన భర్జన పడుతున్నట్లు కనిపించడంతో, ‘‘మీరేమీ సందేహించకండి. సంకోచించ కండి. చెప్పండి. మీరేం పని మీద వచ్చారో చెప్పండి. చేయడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. మీరూ ఒకప్పుడు ఈ సంస్థకి చెందినవారే. మొహమాట పడకుండా చెప్పండి’’‘‘చెబుతాను. చెప్పడానికే వచ్చాను. కాని నా పని విని నన్నో పిచ్చివాడనుకోరు కదా? నవ్వరు కదా?’’‘‘మీరు పెద్దవారు. మేము మిమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతాం? మీరు అడిగారు కనుక హామీ ఇస్తున్నాను. మీ పని ఎలాంటిదైనా నవ్వను. సరేనా?’’ వాగ్దానం చేస్తున్నట్టు అన్నాడు అనంత రావు.