మీకెందుకండీ ఈ సినిమాలు’’ అన్నాడు రామనాధం.కేశవరావు ముసిముసిగా నవ్వాడు. అతని నవ్వును చూసి వాళ్ళిద్దరి మధ్యా టీపాయ్‌ మీదున్న రెండు గ్లాసులూ నిండుగా - అరవైల నాటి విషాదాంత తెలుగు సినిమా చివరి రీల్లో హీరోలా విషాదంగా నవ్వాయి.రామనాధానికి మతిపోతోంది. డ్రింక్స్‌ తాగడట! ఓకే! ‘సిగరెట్టు’ ‘వద్దు’ ‘నాన్‌వెజ్‌’ ‘వద్దు’ ఏదడుగు! ‘వద్దు’....రామనాధానికి అంతుచిక్కని వాటిల్లో కేశవరావు నవ్వొకటి! రామనాధమూ అతని అసిస్టెంట్లూ నవ్వినవ్వి, నవ్వలేక పొట్టలు పట్టుకుని దొర్లుతున్నా, కళ్లనీళ్లు తుడుచుకుంటున్నా - తనకేమీ పట్టనట్టు గంభీరమైన మౌనంతో, చూపుల్తో ఎవరూ వూహించని సందర్భంలో, ఏ అసిస్టెంటు మాటకో నవ్వుతూ వుండే కేశవరావు రామనాధానికో పెద్ద పజిల్‌!తానెంత పెద్దగా నవ్వినా, కనీసం మొహమాటానికైనా నవ్వని కేశవరావుని చూసి ‘ఇలా అయితే ఇక పైకొచ్చినట్టే’ అనుకున్నాడు రామనాధం.

 తానింత పైకొచ్చాడంటే దీనివెనక ఎన్ని అసందర్భపు నవ్వులు దాక్కుని వున్నాయి.ఒకపడు తాను చెయ్య ని పనుందా? టీలందించడం దగ్గర్నుంచి, రికార్డింగ్‌ గేట్ల దగ్గర కాపలా దగ్గర్నుంచి, సెట్లో పనులు, ఆర్టిస్టులకు కుర్చీలెయ్యడం, ఫుడ్‌ అరేం జ్‌మెంట్లు... వకటా రెండా... ఎన్ని పనులు ఎంతమంది దగ్గర చేశాడు. ఏ పనయినా చేసి, ఎదుటివాడు... ముఖ్యంగా.. తనపైవాడు... మాట్లాడిన ప్రతిమాటనీ ఆరాధనీయంగా తన్మయుడై విని, తలూపి ‘నమ్రతగా శ్రద్ధగా వింటాడు కుర్రాడు’ అన్పించుకోబట్టి గదా సినిమా దర్శకుడయింది!రామనాధం తన అసిస్టెంట్లతో తన అనుభవ సారాన్ని చెప్తూ ‘‘నువ్వు సినిమాల్లో స్థిరపడాలనుకుంటే, అభిమానం, అవమానం, లాంటి పిచ్చిమాటలకు విలువివ్వకు! అవన్నీ నువ్వొక స్థితికొచ్చాక చెప్పాల్సిన మాటలు! ఇక్కడ బతకాలని వచ్చావా అయితే చచ్చినట్టు పడుండు. ఎదగాలనుకుంటున్నావా అయితే తల లేపి ఎవర్నీ ప్రశ్నించకు. అసలు చూడకు. తలొంచుకుని ‘మీదే కరక్టు సార్‌’ అను. అందరూ నిన్ను యిష్టపడ్తారు. ఏదో ఓరోజు... నీరోజు వస్తుంది! అపడు నీ యిష్టం. ఏమిటి?’’అసిస్టెంట్లందరూ ముక్తకంఠంతో ‘‘సెంట్‌ పర్సెంట్‌ మీరే కరెక్టు సార్‌’’ అన్నారు. కాబట్టే ఆయన్దగ్గర నిలవగలిగారు!కేశవరావు రచయిత! అతనీమధ్య రాసిన ఓ నాటకం తెలుగునాట అన్ని పరిషత్తుల్లోనూ సంచలనం రేపింది. ఆ మాట విన్న రామనాధం కొత్తదనంకోసం కేశవరావుని మద్రాసు పిలిపించాడు. తెలుగు సినిమా రంగంతోపాటు తనూ భాగ్యనగరానికెళ్ళిపోయినా, స్టోరీ సిట్టింగ్స్‌ మాత్రం మద్రాసులోనే పెట్టుకుంటాడు. రామనాధంకున్న సవాలక్ష సెంటిమెంట్లలో ఇదొకటి మాత్రమే. సరే అతను చెప్పిన కథ విన్నాడు. కథలో హ్యూమన్‌ డ్రామా, సెంటిమెంటు... అన్నీ వున్నాయి. అన్నిటికన్నా కథనం కొత్తగా వుంది. సినిమాకి బాగా పనికొస్తుంది.‘‘కథ నాకు బాగా నచ్చింది. వెంటనే సినిమా మొదలెడ్దాం. మీరీ కథ యింకెవరికీ చెప్పలేదుగా’’ అన్నాడు రామనాధం.